
దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి(SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబినేషన్‌లో ఓ సినిమా(SSMB 29) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్పై ఇప్పటికే చాలా పుకార్లు వచ్చాయి. టైటిల్ ఇదే అంటూ రకరకాల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ రాజమౌళి మాత్రం ఎప్పటిమాదిరే టైటిల్ని గోప్యంగా ఉంచాడు. అంతేకాదు సినిమా షూటింగ్ అప్డేట్ కూడా బయటకు రానివ్వడం లేదు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ విషయంలో మరో కొత్త పేరు ప్రచారంలోని వచ్చింది. అదే వారణాసి. గతంలో పలు పేర్లు అనుకున్నా.. చివరకు రాజమౌళి ఈ పేరుకే మొగ్గు చూపినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
డివోషనల్ టచ్..
ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి..మహేశ్ బాబుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించగానే.. ఇదొక జంగిల్ అడ్వెంచరస్ మూవీ అని ప్రచారం జరిగింది. లీకైన షూటింగ్ క్లింప్స్ కూడా అలానే అనిపించాయి. అయితే జక్కన్న మాత్రం ఈ జంగిల్ అడ్వెంచరస్ కథకి డివోషినల్ టచ్ ఇచ్చాడట. ఆగస్ట్లో రాజమౌళి రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే కూడా ఇది నిజమనే తెలుస్తుంది. అందులో మహేశ్ మెడలో నంది, త్రిశూలం-ఢమరుకం లాకెట్ ఉంది. అది చూస్తే.. ఇందులో డివోషనల్ ఎలిమెంట్స్ ఉంటాయనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన ‘వారణాసి’ టైటిల్ కూడా ఆ పుకారుకి మరింత బలం చేకూర్చింది.
నవంబర్లో క్లారిటీ!
రాజమౌళి చిత్రాల టైటిల్స్ యూనిక్‌గా ఉంటాయి. కథకు తగ్గట్లుగా టైటిల్స్ పెట్టడంలో ఆయన దిట్ట. ఇప్పుడు మహేశ్ సినిమాకు వారణాసి అని పెట్టినట్లు తెలుస్తుంది. ఈ టైటిల్ కూడా అన్ని భాషలకు అర్థమయ్యేలా ఉంది. కానీ జక్కన్న ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి ఈ టైటిల్ ఇండియా మినహా మిగతా ప్రపంచానికి అర్థమవుతుందా? అక్కడ వేరే టైటిల్తో రిలీజ్ చేస్తాడా? అసలు వారణాసి టైటిల్ ఫైనల్ అయిందా లేదా అనేది తెలియాలంటే.. నవంబర్ వరకు ఆగాల్సిందే.
(చదవండి: ప్రతి విషయాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోలేను..రూమర్స్‌పై స్పందించిన రష్మిక)
నవంబర్ 16న సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తారంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివార్లలో వారణాసి నగరాన్ని తలపించేలా ఓ భారీ సెట్ వేశారట. అందులోనే మేజర్ సన్నివేశాలన్నీ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఫోక్ సాంగ్?
ఈ సినిమాలో ఓ ఫోక్ సాంగ్ కూడా ఉంటుందట. ఇప్పటికే సంగీత దర్శకుడు కీరవాణీ ఓ జానపద బాణీని రాజమౌళికి ఇచ్చాడట. అది ఆయనకు బాగా నచ్చిందట. ట్రయల్ షూట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మహేశ్-ప్రియాంక చోప్రాల మధ్య ఆ సాంగ్ ఉంటుందట. ఆ ఫోక్ సాంగ్‌కి వీరిద్దరు వేసే ఊరమాస్ స్టెప్పులు అదిరిపోతాయట. మొత్తానికి ‘నాటు నాటు’ ని మించేలా ఆ పాటను తీర్చి దిద్దాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట.