నాకు దక్కిన గౌరవం అది: సోనూ సూద్‌ | Sakshi
Sakshi News home page

మరోసారి పెద్ద మనసు చాటుకున్న సోనూ

Published Mon, Oct 5 2020 3:26 PM

Sonu Sood Helps Haryana Students Installs Mobile Tower Online Classes - Sakshi

రియల్‌ ‘హీరో’ సోనూసూద్‌ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఫలానా చోట.. ఫలానా సమస్య ఉందన్న విషయం తన దృష్టికి వస్తే చాలు.. వెంటనే పరిష్కారం చూపిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. లాక్‌డౌన్‌ మొదలైన నాటి నుంచి అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టిన సోనూ.. తాజాగా... సిగ్నల్స్‌ అందక ఆన్‌లైన్‌ క్లాసులు మిస్సవుతున్న విద్యార్థులకు చేయూతనిచ్చారు. స్నేహితులతో కలిసి మొబైల్‌ టవర్‌ ఏర్పాటు చేసి, వారి చదువుకు ఆటంకం కలగకుండా అండగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో సోనూసూద్‌పై మరోసారి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యాసంస్థలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. దీంతో ఆన్‌లైన్‌ బోధనకు ప్రాముఖ్యం పెరిగింది. (చదవండి: సోనూసూద్‌కు ప్రతిష్టాత్మక అవార్డు)

ఈ క్రమంలో సంపన్న వర్గాల కుటుంబాలకు చెందిన విద్యార్థుల చదువులు సాఫీగానే సాగుతున్నా, చాలా మంది నిరుపేదలు మాత్రం స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఎలాగోలా కష్టపడి ఫోన్‌ కొనుక్కున్నా సిగ్నల్స్‌ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లు మరికొందరు. ఇలాంటి పరిస్థితులకు అద్దంపట్టే వీడియో ఒకటి ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. హర్యానాలోని మోర్నిలోని దీపనా గ్రామానికి చెందిన విద్యార్థులు కొంతమంది సిగ్నల్‌ కోసం చెట్ల కొమ్మలపై కూర్చుని తంటాలు పడుతున్న దృశ్యాలను షేర్‌ చేసిన ఓ నెటిజన్‌.. సోనూ సూద్‌, ఆయన ఫ్రెండ్‌ కరన్‌ గిల్హోత్రాను ట్యాగ్‌ చేశారు.

ఇక ఇందుకు స్పందించిన ఆ ఇద్దరు మిత్రులు వెంటనే మొబైల్‌ టవర్‌ ఏర్పాటు చేయించారు. ఈ విషయం గురించి సోనూసూద్‌ మాట్లాడుతూ.. ‘‘బాలలే మన దేశ భవిష్యత్తు. సమాన హక్కులు, మెరుగైన భవిష్యత్‌ పొందేందుకు వారు అన్ని విధాలా అర్హులు. వాటిని పొందడంలో విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవడం మన బాధ్యత. ఆన్‌లైన్‌ క్లాసులకు ఇబ్బంది కలగకుండా మొబైల్‌ టవర్‌ ఏర్పాటు చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.

ఇకపై అక్కడ సిగ్నల్స్‌ కోసం ఎవరూ చెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు’’అంటూ ఎప్పటిలాగే మంచి మనసు చాటుకున్నాడు. కాగా గతంలో చండీఘర్‌లో కొంతమంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు కొనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆపదల్లో ఉన్న వారికి తనవంతు సాయం చేస్తూ వారిని కష్టాల కడలి నుంచి గట్టెక్కిస్తూ మానవత్వానికి ప్రతీకగా నిలిచిన సోనూసూద్‌కు ఇటీవలే ఐ‍క్యరాజ్యసమితి ప్రతిష్టాత్మక పురస్కారం(స్పెషల్‌ హుమానిటేరియన్‌ యాక్షన్‌ అవార్డు) అందించిన విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement