
చేతిలో పార... తీక్షణమైన చూపులతో ‘కూలీ’లో శ్రుతీహాసన్ పోషించిన ప్రీతి పాత్ర లుక్‌ని విడుదల చేసినప్పుడే చర్చనీయాంశమైంది. ఈ చిత్రంలో ఆమెది నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అని, యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయనే ఊహాగానాలు నెలకొన్నాయి. అయితే తన పాత్ర గురించిన వివరాలేమీ బయటపెట్టకుండా శ్రుతీహాసన్ ‘కూలీ’ సినిమా గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ‘‘కెమెరా ముందు నటీనటులకే కాదు... కెమెరా వెనక డైరెక్టర్‌కి కూడా ఈ సినిమా ఓ సవాల్. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ అలాంటి కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు.
లొకేషన్‌లో ప్రతి ఒక్కరూ వర్క్ మీదే ఫోకస్ పెట్టాం. సీన్స్ అన్నీ కూడా ఆ ఫోకస్‌ని డిమాండ్ చేశాయి. పైగా ఎక్కువగా నైట్ షూట్స్ చేశాం. నాకు నైట్ షూట్స్ అంటే చాలా ఇష్టం. సీన్ పర్ఫెక్ట్‌గా వచ్చేవరకూ లొకేషన్‌లో ఎవరూ నిద్రపోలేదు. ఇలా సెట్‌లో అందరూ చాలా ఉత్సాహంగా పని చేయడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. మంచి కంటెంట్ ఉన్నప్పుడు ఇలా అందరూ లీనమైపోతాం. ‘కూలీ’ అనేది నాకు అద్భుతమైన అనుభూతిని మిగిల్చిన చిత్రం’’ అని శ్రుతీహాసన్ పేర్కొన్నారు. ఇక రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నాగార్జున, అమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు నటించారు. ఆగస్ట్ 14న ‘కూలీ’ విడుదల కానుంది.