మహేశ్‌బాబు స్వాగతం చెప్పడం ఆనందం: శిల్పా శిరోద్కర్‌ | Shilpa Shirodkar About Jatadhara Movie | Sakshi
Sakshi News home page

మహేశ్‌బాబు స్వాగతం చెప్పడం ఆనందం: శిల్పా శిరోద్కర్‌

Oct 28 2025 12:57 AM | Updated on Oct 28 2025 12:57 AM

‘‘సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘జటాధర’. ఇందులో స్టన్నింగ్‌ విజువల్స్, అద్భుతమైన సంగీతం,  బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది’’ అని నటి శిల్పా శిరోద్కర్‌ చెప్పారు. సుధీర్‌ బాబు హీరోగా నటించిన చిత్రం ‘జటాధర’. వెంకట్‌ కల్యాణ్, అభిషేక్‌ జైస్వాల్‌ దర్శకత్వం వహించారు. సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్‌ కీలకపాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్‌ కుమార్‌ బన్సల్, శివన్‌ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్‌ నంద నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా శిల్పా శిరోద్కర్‌ పంచుకున్న విశేషాలు...

తెలుగులో నేను నటించిన తొలి చిత్రం ‘బ్రహ్మ’ (1992). ఆ తర్వాత తెలుగు సినిమా చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత ‘జటాధర’ చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇందులో శోభ అనే ప్రాధాన్యం ఉన్నపాత్ర చేశాను. తనకి డబ్బంటే అత్యాశ. ఎలాగైనా సరే అనుకున్నది చేరుకోవాలి అనుకునేపాత్ర. ఈ క్యారెక్టర్‌ చేయడం సవాల్‌గా అనిపించింది. ఎందుకంటే ఇలాంటిపాత్ర నేనెప్పుడూ చేయలేదు. అయితే మా డైరెక్టర్స్‌ వెంకట్‌ కల్యాణ్, అభిషేక్‌ జైస్వాల్‌ క్లియర్‌ విజన్, సపోర్ట్‌తో ఈపాత్రని చేయగలిగా.

మహేశ్‌బాబుగారు మా ‘జటాధర’ ట్రైలర్‌ లాంచ్‌ చేయడం, ట్రైలర్‌ బాగుందని ఆయన కితాబివ్వడంతోపాటు టాలీవుడ్‌కి నాకు స్వాగతం చెప్పడం సంతోషాన్నిచ్చింది. నమ్రత శిరోద్కర్‌ (శిల్ప సోదరి)కి కూడా ట్రైలర్, నాపాత్ర నచ్చాయి. సుధీర్‌బాబుగారు మాకు బంధువే అయినప్పటికీ సెట్‌లో మేం కేవలం ఆర్టిస్టులం మాత్రమే. సుధీర్‌గారితో కలిసి పని చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్‌. సోనాక్షీ సిన్హా చేసిన ధన పిశాచిపాత్ర చాలా బాగుంటుంది. నిర్మాతలు రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు.

చిత్ర పరిశ్రమలో తెలుగు, హిందీ వంటి సరిహద్దులు ఇప్పుడు లేవు. ప్రస్తుతం తెలుగు సినిమా బెస్ట్‌ ఫేజ్‌లో ఉంది. కంటెంట్‌ పరంగా, టెక్నికల్‌గా అడ్వాన్స్‌ అయ్యాం. ‘జటాధర’ సినిమా కోసం తెలుగు, హిందీ... ఇలా అన్ని చోట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నవంబరు 7న ప్రేక్షకులు అద్భుతమైన సినిమాని చూడబోతున్నారు. నాకు రొమాంటిక్‌ కామెడీపాత్రలంటే ఇష్టం. ఇన్నేళ్ల నా సినీ ప్రయాణం పట్ల హ్యాపీగా ఉన్నాను. మంచిపాత్రలు, సినిమాలు చేసి, ప్రేక్షకులను అలరించాలన్నదే నా కల. ఇకపై తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తాను.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement