‘టీచరమ్మ’గా వెండితెరపై బెత్తం పట్టి అలరించిన హీరోయిన్లు | Sakshi
Sakshi News home page

Sakshi Special Story: ‘టీచరమ్మ’గా వెండితెరపై బెత్తం పట్టి అలరించిన హీరోయిన్లు

Published Sun, Sep 4 2022 12:31 PM

Savitri to Shruti Haasan Who Played Teacher Role In Movies - Sakshi

‘ఈ టీచర్‌ చాలా స్ట్రిక్ట్‌’ అనిపించుకుంది సావిత్రి ‘మిస్సమ్మ’లో. ‘ఈ టీచర్‌ భలే చక్కగా పాఠాలు చెబుతుంది’ అని మెచ్చుకోలు పొందింది జమున ‘మట్టిలో మాణిక్యం’లో. ‘పంతులమ్మ’ సినిమాలో లక్ష్మి పిల్లల పాఠాలే కాదు కథానాయకుని జీవితాన్ని కూడా చక్కదిద్దింది. ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ దగ్గరి నుంచి నిన్న మొన్నటి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు టీచర్‌ అంటే విజయశాంతే. ‘లేడీస్‌ టైలర్‌’లో రాజేంద్ర ప్రసాద్‌ వంటి అల్లరి స్టూడెంట్‌ని బెత్తం దెబ్బలు కొట్టి సరి చేయలేదూ అర్చన. టీచర్‌ పాత్రకు గ్లామర్‌ ఉండకపోవచ్చు గాని ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి ప్రాముఖ్యత కొందరు హీరోయిన్లకే దక్కింది. అదిగో చాక్‌పీస్‌ ఒక చేత్తో బెత్తం మరో చేత్తో పట్టుకుని వాళ్లిటు నడిచొస్తున్నారు చూడండి.

శిశువుకు అమ్మ తొలి టీచర్‌. స్కూల్లో ‘టీచరమ్మే’ తొలి టీచర్‌. నర్సరీల్లో, ఐదు లోపల తరగతుల్లో పిల్లలకు తొలిగా పరిచయం అయ్యేది ఎక్కువగా టీచర్లే. వీరే పిల్లలకు తొలుత ఆత్మీయులవుతారు. బడి పట్ల, పాఠాల పట్ల ఆసక్తి కలిగిస్తారు. ఈమె కూడా అమ్మలాంటిదే కాబట్టి భయం లేకుండా వెళ్లొచ్చు అని పిల్లలకు నమ్మకం కలిగిస్తారు. అయినా సరే ‘గురు దేవా’ అంటే మగ గురువు గుర్తుకొస్తాడు. స్త్రీల వాటా ఈ విషయంలో సమానం అయినప్పటికీ. సినిమాల్లో కూడా హీరోలు వేసిన టీచర్‌ పాత్రలు ఎక్కువ ఉన్నాయి. హీరోయిన్లకు తక్కువగా ఈ చాన్స్‌ వచ్చింది. ‘గ్లామర్‌’ సినిమా కమర్షియల్‌ సినిమా వచ్చాక ‘టీచర్‌’ పాత్రలో హీరోయిన్‌ను గ్లామరస్‌గా చూపించలేము అనే భావనతో నిర్మాత, దర్శకులు హీరోయిన్‌ను ‘ఒక ఆడి పాడే బొమ్మ’ స్థాయికే కుదించి పెట్టారు.

అయితే అప్పుడప్పుడు మంచి టీచర్‌ పాత్రలు సత్తా ఉన్న నటీమణుల చేతుల్లో పడి మెరిశాయి. వాళ్లు తెర మీద ఉంటే ప్రేక్షకులు బుద్ధిగా చూసే విద్యార్థులయ్యారు. రిజల్ట్‌ వందకు వంద వచ్చింది. మీకు మీరే మాకు మేమే: సినిమాల్లో హీరోను చూసి హీరోయిన్‌ జంకడం ఆనవాయితీ. కాని ‘మిస్సమ్మ’లో సావిత్రిని చూసి రామారావు జంకుతుంటాడు. దానికి కారణం ఆమె నిజాయితీ, టీచర్‌గా సిన్సియారిటీ. స్కూల్లో పిల్లలకు పాఠాలతో పాటు జమిందారు గారి కుతురికి సంగీతం పాఠాలు కూడా చెప్తుంది సావిత్రి. అంతేనా? కొంచెం నాన్‌ సీరియస్‌గా ఉన్న ఎన్‌.టి.ఆర్‌ తనను అందుకునేంతగా ఎదిగేలా చేసి ఒక రేవుకు చేరుస్తుంది. ‘రావోయి చందమామా మా వింతగాధ వినుమా’... ఆ రోజుల్లో టీచర్లు పాటలు పాడే పాటలు ఇంత శుభ్రంగా వినసొంపుగా ఉండేది.

నా మాటే నీ మాటై చదవాలి: ‘మట్టిలో మాణిక్యం’ లో చలం అమాయకుడు. పౌరుషంతో పట్నం వస్తే టీచరైన జమున పరిచయం అవుతుంది. ప్రేమిస్తుంది. మామూలు చదువే కాదు లౌక్యంగా ఉండటానికి అవసరమైన చదువు కూడా చెబుతుంది. పాఠాలను పాటగా మార్చి ఆమె పాడే ‘నా మాటే నీ మాటై చదవాలి నేనంటే నువ్వంటూ రాయాలి’ పాట బాగుంటుంది. ఆ తర్వాతి రోజుల్లో సింగీతం శ్రీనివాసరావు హీరోయిన్‌ లక్ష్మితో ‘పంతులమ్మ’ సినిమా తీశాడు. ‘పంతులమ్మ’ టైటిల్‌తో ఒక సినిమా వచ్చి హిట్‌ కావడం విశేషం. భార్య మరణించిన వ్యక్తి జీవితంలోకి వచ్చిన ఒక పంతులమ్మ అతని పిల్లలకు పాఠాలు చెబుతూ అతనిలోని ఒక అపోహను తొలగించడం కథ. ‘ఎడారిలో కోయిల’ పాట ఒయాసిస్‌ లా ఉంటుంది. ఆ తర్వాత ‘శుభలేఖ’ సినిమాలో సుమలత టీచర్‌గా నటించింది. కట్నం అడగడాన్ని ఎదిరించిందని ఆమె ఉద్యోగం పోతుంది.

కాని ఆమె వెరవదు. ఈ దుర్యోధన దుశ్శాసన క్లాసులోని రౌడీ పిల్లాణ్ణి సరి చేయడం టీచర్‌ బాధ్యత. మరి సమాజంలో ఉన్న రౌడీ పిల్లాణ్ణి దండించడం? చట్టం, న్యాయం, వ్యవస్థ విఫలమైతే ఆ బాధ్యత కూడా టీచరే తీసుకుంటుంది. ‘ప్రతిఘటన’లో లెక్చరర్‌ అయిన విజయశాంతి ఊళ్లో అనేక ఫతుకాలకు కారణం అవుతున్న రౌడీని అంతిమంగా తెగ నరికి నిర్మలిస్తుంది. చాక్‌పీస్‌ పట్టిన చేతులు గొడ్డలి కూడా పట్టగలవు అని హెచ్చరిస్తుంది. ఈ టీచర్‌ పాత్ర తెలుగులో వచ్చిన అన్ని టీచర్‌ పాత్రల కంటే శక్తిమంతమైనది. క్లాసురమ్‌లో పిచ్చి జోకులు, లెక్చరర్ల మీద పంచ్‌లకు తావు ఇచ్చే పాత్ర కాదు ఇది. ఈ పాత్రను చూడగానే మహా మహా పోకిరి స్టూడెంట్లు కూడా సైలెంటైపోవాల్సిందే. ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో’ అని విజయశాంతి పాడుతుంటే ఆ వేదనా శక్తి చసే ప్రతి విద్యార్థిలో పరివర్తన తెస్తుంది. విజయశాంతి ఆ తర్వాత ‘రేపటి పౌరులు’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల్లో కూడా టీచర్‌గా నటించింది.

అరె ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి: అతను బెస్తపల్లెలో రౌడీ. ఆమె క్రైస్తవ విశ్వాసాలు కలిగిన టీచర్‌. అతను హింస. ఆమె దయ. హింసను వీడి దయ వరకూ చేసే ప్రయాణాన్ని ఆ టీచర్‌ ఆ రౌడీలో ప్రేరేపిస్తుంది. అతని పాపాలన్నీ స్వీయ రక్తంతో ప్రక్షాళనం అవుతాయి. చివరకు అతను ఆమె ప్రేమను పొందుతాడు. రౌడీగా చిరంజీవి, టీచర్‌గా సుహాసిని ‘ఆరాధన’లో నటించారు. ‘అరె ఏమైంది’ పాట ఇప్పటికీ హిట్‌ ప్రేమమ్‌ మరికొన్ని: ఇటీవలి కాలంలో ఈ కాలపు హీరోయిన్లు కూడా టీచర్లుగా నటించారు. ‘ఘర్షణ’లో అసిన్, ‘గోల్కొండ హైస్కల్‌’లో కలర్స్‌ స్వాతి, ‘హ్యాపీ డేస్‌’లో కమలిని ముఖర్జీ, ‘రాక్షసుడు’లో అనుపమ పరమేశ్వరన్‌ టీచర్లుగా కనిపిస్తారు. మన సాయి పల్లవి మలయాళ ‘ప్రేమమ్‌’లో టీచర్‌గా నటించే పెద్ద క్రేజ్‌ సాధించింది. ఆ పాత్రను తెలుగులో శృతిహాసన్‌ చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement