Save The Tigers Web Series Review: ‘సేవ్‌ ద టైగర్స్‌’ వెబ్‌ సిరీస్‌ రివ్యూ

Save The Tigers Web Series Review And Rating In Telugu - Sakshi

వెబ్‌ సిరీస్‌ రివ్యూ: సేవ్‌ ద టైగర్స్‌
నటీనటులు : ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, 'జోర్దార్' సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని, హర్షవర్ధన్, గంగవ్వ, వేణు టిల్లు, రోహిణి తదితరులు
నిర్మాతలు : మహి వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి 
ద‌ర్శ‌క‌త్వం : తేజ కాకుమాను
క్రియేటర్స్ : మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం
విడుదల తేది: ఏప్రిల్‌ 27, 2023(డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌)

ఈ మధ్య కాలంలో ఓటీటీలలో ఎక్కువగా అడల్ట్‌ కంటెంటే ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా వెబ్‌ సీరస్‌తో బోల్డ్‌ కంటెంట్‌ శృతిమించిపోతుంది. ఇలాంటి తరుణంలో ఫ్యామిలీ అంతా కలిసి చూసే సిరీస్‌ని తెరకెక్కించాడు తేజ కాకుమాను. అదే ‘సేవ్‌ ద టైగర్స్‌. ‘యాత్ర’ఫేమ్‌ మహి వి. రాఘవ్‌ ఈ సిరీస్‌కి షో రన్నర్‌గా వ్యవహరించాడు. నేటి నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి ఈ సిరీస్‌ కథేంటి? ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే.. 
గంటా రవి(ప్రియదర్శి). రాహుల్‌(అభినవ్‌ గోమఠం), విక్రమ్‌(చైతన్య కృష్ణ).. ఈ ముగ్గురిని డ్రంక్‌ డ్రైవ్‌ కేసులో హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. అలాగే విక్రమ్‌ కారుని సీజ్‌ చేస్తారు. అది అతని భార్య పేరుపై ఉంటుంది. కారు కావాలంటే కోర్టు కెళ్లి ఫైన్‌ కట్టాలని పోలీసులు చెబుతారు. ఈ విషయం తెలిస్తే తన భార్య గొడవ చేస్తుందని భావించిన విక్రమ్‌.. స్నేహితులు రవి, రాహుల్‌లతో కలిసి సీఐ(శ్రీకాంత్‌ అయ్యంగార్‌)దగ్గరకు వెళ్లి తమ బాధలను తెలియజేస్తూ.. ఎందుకు తాగాల్సి వచ్చిందో వివరిస్తారు. 

గంటారవి  పాల వ్యాపారి. భార్య హైమావతి(సుజాత), పిల్లలలో కలిసి బోరబండలో నివాసం ఉంటాడు. హైమావతి బ్యూటీపార్లర్‌ రన్‌ చేస్తుంది. బోరబండను వదిలి గేటెడ్‌ కమ్యూనిటీకి వెళ్లాల‌ని తరచు భర్తతో గొడవ పడుతూ ఉంటుంది. విక్రమ్‌ ఓ యాడ్‌ ఏజెన్సీ కంపెనీ పని చేస్తుంటాడు. అతని భార్య(దేవియాని శర్మ)  లాయర్‌. ఫెమినిస్ట్‌. భర్త, కూతురిని పట్టించుకోకుండా ఎప్పుడూ కేసులంటూ కోర్టుల చుట్టే తిరుగుతుంది. ఆమెకు, విక్రమ్‌ తల్లికి అస్సలు పడదు.

ఇక రాహుల్‌..రైటర్‌ కావాలనే ఉద్దేశంతో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఖాలీగా ఉంటాడు. అతని భార్య మాధురి(పావనీ గంగిరెడ్డి) డాక్టర్‌. మొదట్లో రాహుల్‌కి మద్దతుగా ఉన్న మాధురి.. కొన్నాళ్ల తర్వాత ఖాలీగా ఉన్నావంటూ విసుక్కుంటుంది. అంతేకాదు తన స్నేహితుడు డాక్టర్‌ నవీన్‌(రాజా చెంబోలు)కు క్లోజ్‌గా ఉంటుంది. ఇది రాహుల్‌కి నచ్చదు.

ఈ ముగ్గురి పిల్లలు ఓకే స్కూల్‌లో చదువుతారు. దాని కారణంగా గంటా రవి, రాహుల్‌, విక్రమ్‌ల మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఓ రోజు ఈ ముగ్గురు కలిసి బార్‌లో బాగా తాగి రచ్చ చేస్తారు. అది ఓ టీవీ ప్రోగ్రామ్‌లో టెలికాస్ట్‌ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గంటా రవి మాటతీరు కారణంగా భార్య, పిల్లలకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? ఓ కమర్షియల్‌ యాడ్‌ కారణంగా విక్రమ్‌, అతని భార్యల మధ్య ఎలాంటి మనస్పర్థలు వచ్చాయి? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై రాహుల్‌ ఎందుకు అనుమానం వ్యక్తం చేశాడు? ఆ అనుమానం ఎక్కడికి దారితీసింది? బార్‌లో గొడవకి, హీరోయిన్‌ హంస నందిని మిస్సింగ్‌కి ఎలాంటి సంబంధం ఉంది? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
భార్యల వల్ల భర్తలు పడే ఇబ్బందుల నేపథ్యంలో టాలీవుడ్‌లో చాలా సినిమాలు వచ్చాయి. సేవ్‌ ద టైగర్స్‌ వెబ్‌ సిరీస్‌ కూడా ఆ నేపథ్యంతో తెరకెక్కిన కథే. పెళ్లైన మగవారి కష్టాలను మెయిన్‌ పాయింట్‌గా తీసుకొని ఎంట‌ర్‌టైనింగ్ పంథాలో ఈ సిరీస్‌ని తెరకెక్కించారు. ఇందులో మొత్తం మూడు జంటలు ఉంటాయి.  వీరిలో మగవాళ్లంతా ఆడవారి వల్ల ఇబ్బంది పడుతున్నవారే.

గంటా రవికి భార్యతో పాటు కూతురు,తల్లితో కూడా ఇబ్బందులే. ఇక విక్రమ్‌కు అయితే ఫెమినిస్ట్‌ అయిన భార్యతో పాటు అత్తగారి చేతిలో కూడా నలిగిపోతాడు. మరోవైపు రైటర్‌ కావాలని ఉద్యోగం మానేసిన రాహుల్‌కి భార్యతో పాటు ఇంటి పనిమనిషి కూడా చుక్కలు చూపిస్తుంది. ఈ కష్టాలను ఆరు ఎపిసోడ్‌లుగా చాలా వినోదాత్మకంగా, సహజసిద్దంగా చూపించారు. 

అంతేకాదు అంతర్లీనంగా మంచి సందేశాన్ని కూడా చూపించాడు. భార్యభర్తల మధ్య గొడవలు వస్తే కలిసి సాల్వ్‌ చేసుకోవాలిని కానీ సైకిలాజిస్టుల వద్దకు వెళ్తే పరిష్కారం దొరకదని ఓ సన్నివేశం ద్వారా చూపించారు. అలాగే పిల్లలకు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ ఏదో తెలియజేసే బాధ్యత తల్లిదండ్రులదే అని మరో సన్నివేశం ద్వారా చూపించారు.

చేసే వృత్తిని గౌరవించాలని, పేరెంట్స్‌ పిల్లల కోసం ఎలాంటి బాధలు పడతారనేది  గంటా రవి, అతని కూతురి పాత్ర ద్వారా చూపించారు. రాహుల్‌, మాధురిల ట్రాక్‌ చూస్తే.. భార్యను అలా అనుమానించాల్సింది కాదనిపిస్తుంది. అదే సమయంలో విక్రమ్‌, అతని భార్యల ట్రాక్‌ చూస్తే.. ఆమె విక్రమ్‌ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతుందనే బాధ కలుగుతుంది. మొత్తంగా ఈ మూడు జంటలను చూస్తే కొత్తగా పెళ్లైన మగవాళ్లు ఏదో ఒక జంటకు కచ్చితంగా కనెక్ట్‌ అవుతారు. ఈ మధ్య కాలంలో ఎలాంటి అశ్లీలత(కొన్ని డైలాగ్స్‌ కాస్త ఇబ్బందిగా ఉంటాయి) లేకుండా కామెడీగా సాగే ఇలాంటి వెబ్‌ సిరీస్‌ రాలేదనే చెప్పాలి. 

ఎవరెలా చేశారంటే.. 
పాల బిజినెస్ చేసే గంటా రవి పాత్రలో ప్రియదర్శి ఒదిగిపోయాడు. తెలంగాణలో యాసలో మాట్లాడుతూ నవ్వులు పూయించాడు. అలాగే కొన్ని ఎమోషనల్‌ సీన్లలో కూడా చక్కగా నటించాడు. రైట‌ర్ కావాల‌నుకుని ఇంట్లోనే ఖాలీగా ఉండే వ్యక్తిగా అభినవ్‌ తనదైన నటనతో అదరగొట్టేశాడు. పొట్టను తగ్గించే సీన్‌, యాడ్‌ కోసం కంటెంట్‌ రాసే సన్నివేశాలలో అభివన్‌ నవ్వులు పూయించాడు.

ఇక ఇంట్లో భార్య‌, ఆఫీసులో బాస్ మ‌ధ్య నలిగిపోయే విక్రమ్‌ పాత్రకి చైతన్య కృష్ణ న్యాయం చేశాడు. ఇక ఈ ముగ్గురి భార్యలుగా జోర్దార్‌ సుజాత, , పావని గంగిరెడ్డి, దేవయాని తమదైన నటనతో ఆకట్టుకున్నారు. పనిమనిషిగా రోహిని, గంటా రవి తల్లిగా గంగవ్వ, విక్రమ్‌ బాస్‌గా హర్షవర్దన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ, సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top