యూఎస్‌ – చైనా దోస్తీ? భారత్‌ దారెటు! | Sakshi Guest Column On USA, China Friendship | Sakshi
Sakshi News home page

యూఎస్‌ – చైనా దోస్తీ? భారత్‌ దారెటు!

May 21 2026 12:06 AM | Updated on May 21 2026 12:06 AM

Sakshi Guest Column On USA, China Friendship

విశ్లేషణ

మే 2026లో బీజింగ్‌ వేదికగా జిన్‌పింగ్, ట్రంప్, పుతిన్‌ మధ్య జరిగిన రెండు వేర్వేరు శిఖరాగ్ర సమావేశాలు 21వ శతా బ్దపు ప్రపంచ జియో పొలిటికల్‌ క్రీడలో కీలక మార్పులకు నాంది పలుకుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ప్రపంచ రాజ కీయ చదరంగంలో మూడు బలీయమైన రాజకీయ శక్తులు అమెరికా, చైనా, రష్యా వ్యూహాత్మక సమతాస్థితి దిశగా ప్రయత్నాలు చేయటం ఒక రకంగా శుభపరి ణామం. ఈ త్రికోణం కేంద్రంలో మధ్యస్థ తరగతికి చెందిన శక్తులు భారత్, జపాన్, కెనడా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా ఉన్నాయి.

చైనా ఇక సమవుజ్జీ
యూఎస్‌ఏ ఇప్పటివరకూ చైనా, రష్యాలను ముప్పుగానూ, శత్రువులుగానూ పరిగణిస్తూ వాటిని నియంత్రించే/నిలువరించే వ్యూహాన్ని పాటిస్తున్నది. కోవిడ్‌ అనంతర పరిస్థితులు, ఉక్రెయిన్‌ యుద్ధం, ట్యారిఫ్‌ యుద్ధం, ఇరాన్‌ (గల్ఫ్‌) యుద్ధం నేర్పిన గుణ పాఠాలతో యూఎస్‌ఏ వాస్తవ ప్రపంచంలోనికి వచ్చింది. యూఎస్‌ఏకు తన ఆర్థిక, సైనిక, రాజకీయ శక్తి, ప్రాబల్యాలపై ఉన్న భ్రమలు తొలగిపోతున్నాయి. సుంకాల బెదిరింపులతో ప్రారంభ మైన ట్రంప్‌ చాపల్య విధానాలు వెనిజులా, గ్రీన్‌లాండ్‌ గుండా చివరకు హార్మూజ్‌ సింధు శాఖలో నిమజ్జనమయ్యాయి. 

బీజింగ్‌ శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్, తన సహజ వైఖరికి విరుద్ధంగా జిన్‌పింగ్‌ను సమవుజ్జీగా పరిగణిస్తూ పరిణతితో వ్యవహ రించాడు. ఆర్థిక వాణిజ్య అంశాలైన సుంకాలు, పెట్టుబడులు,కృత్రిమ మేధ, సెమీ కండక్టర్‌ చిప్స్, సోయా చిక్కుళ్లు మొదలగు విషయాలను రాజకీయ–వ్యూహాత్మక అంశాలైన తైవాన్, ఇరాన్‌తో ముడిపెట్టి బేరం చేయటానికి ప్రయత్నించాడు. చైనాకు ఇబ్బంది కలిగించే మానవ హక్కులు, ఉయిఘర్లు, సైబర్‌ దాడుల వంటి అంశాల ఊసు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

సకల లాంఛనాలు, గౌరవ మర్యాదలను అందజేస్తూనే అమె రికా ఆధిపత్య ధోరణిని కట్టడి చేయటంలో జిన్‌పింగ్‌ సఫలీకృతు డయ్యాడు. ఒకవైపు అమెరికన్‌ బోయింగ్‌ కంపెనీ నుండి విమానాల కొనుగోలుకు అంగీకరిస్తూనే తైవాన్‌ విషయంలో అమెరికా జోక్యాన్ని సహించేది లేదని కుండబద్దలు కొట్టాడు. ట్రంప్‌ కూడా వేల మైళ్ళ దూరం నుండి తైవాన్‌ విషయంలో చైనాతో యుద్ధానికి సిద్ధంగా లేననే సంకేతాన్నిచ్చాడు. తైవాన్‌కు 25 బిలియన్‌ డాలర్ల ఆయుధాల అమ్మకాన్ని ఆపేశాడు.

వాటితో రాజీ పడినట్టేనా?
కోవిడ్‌ అనంతర పరిణామాల నేపథ్యంలో చైనా డీకప్లింగ్‌ విధానాన్ని అమలు చేయటానికి యూఎస్‌ఏ ప్రయత్నించింది. కానీ చైనా మార్కెట్, చైనా ఉత్పత్తులు, చైనా అరుదైన ఖనిజాలను కాదని తన ఆర్థిక వ్యవస్థను నడపటం సాధ్యం కాదని దానికి తేటతెల్ల మయింది. ప్రస్తుతం చైనా విషయంలో యూఎస్‌ఏ సహకారం, సహభాగిత్వం దిశగా అడుగులు వేస్తున్నది. ఈ సంబంధాలను యూఎస్‌ఏ కాకుండా చైనా శాసిస్తున్నది. చైనా, రష్యా సహకారం లేనిదే హార్మూజ్‌ చిక్కుముడి వీడదని యూఎస్‌ఏకు బోధపడింది. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను నిలవరించటానికి తైవాన్‌ సమస్యను యూఎస్‌ఏ ఇంతవరకు తురుపుముక్కగా పరిగణిస్తూ వస్తున్నది. ఈ విధానంలో భాగంగానే భారత్, జపాన్, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలతో క్వాడ్, ఆకస్‌ వంటి కూటములను ఏర్పరిచింది. దక్షిణ కొరియా, జపాన్‌లకు సైనిక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది.

ఒకవైపు ఇండో పసిఫిక్‌లో చైనా యెడల మెతక వైఖరికి సన్నద్ధ మవుతూనే, ఐరోపాలో నాటో కూటమి చేతులెత్తేయటం యాదృచ్ఛికం కాదు. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాను ప్రత్యక్షంగా ఎదుర్కొనే ఏ రకమైన చర్యలను యూఎస్‌ఏ తీసుకోవటం లేదు. జర్మనీ, ఫ్రాన్స్, యూకే వంటి ఐరోపా దేశాలను నేరుగా విమర్శిస్తున్న ట్రంప్, పుతిన్‌తో సామరస్య ధోరణితో వ్యవహరిస్తున్నాడు. యూరప్‌లో రష్యా ఆధిపత్యాన్ని, ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని యూఎస్‌ఏ అంగీకరిస్తున్నదా? రష్యా, చైనాలను నిలువరించటానికి యూఎస్‌ఏ ఇప్పటివరకు యూరోపియన్‌ యూనియన్, జపాన్, భారత్‌లతో కృషి చేస్తున్నది. ఇప్పుడు ఈ విధానానికి స్వస్తి పలికిన ట్లుగా భావించాలి. చైనా, రష్యాలతో యూఎస్‌ఏ రాజీపడితే భారత్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాలు ఇరకాటంలో పడినట్లే లెక్క.

మనమేం చేయాలి?
ఈ నెలాఖరులో ఢిల్లీలో జరుగనున్న క్వాడ్‌ విదేశాంగ వ్యవహా రాల మంత్రుల సదస్సులో యూఎస్‌ఏ వైఖరిపై మరింత స్పష్టత ఏర్పడనున్నది. ఈ నేపథ్యంలో భారత్‌ తన దౌత్యనీతికి పదును పెట్టాల్సి ఉంటుంది. జియో పొలిటికల్‌ చదరంగంలో శక్తి పరిభాష తప్ప వేరొక మార్గం లేదు. ముఖ్యంగా చైనా మరే భాషను పట్టించు కోదు, అర్థం చేసుకొనే ప్రయత్నం చేయదు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా భారత్‌కు చైనానే ముఖ్య భద్రతా సమస్య/ ముప్పు. చైనాను ఎదుర్కోవటానికి భారత్‌ కేవలం తన శక్తి సామ ర్థ్యాల మీదనే ఆధారపడాలి. చైనా–పాకిస్తాన్‌లతో ఏక కాలంలో హిమాలయాలు, సింధు మైదానం, హిందూ మహా సముద్రంలో విస్తృత యుద్ధానికి యూఎస్‌ఏ, రష్యాలపై ఆధారపడకుండా సిద్ధ పడాలి. జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాలు ఇప్పటికే యూఎస్‌ఏపై ఆధారపడకుండా సైనిక, ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకోవటానికి పావులు కదుపుతున్నాయి.

భారతదేశం కూడా సైనిక, ఆర్థిక, వ్యూహాత్మక రంగాలలో స్వయం శక్తిపై దృష్టిని కేంద్రీకరించింది. ఫ్రాన్స్‌తో రాఫెల్‌ ఒప్పందం, రష్యాతో ఎస్‌–400/బ్రహ్మోస్‌ ఒప్పందాలలో సాంకేతిక పరి జ్ఞానం బదలాయింపు, భారతదేశంలో ఉత్పత్తి షరతులను పెడు తున్నాము. హిందూ మహాసముద్రంలో అండమాన్‌–నికోబార్‌ దీవుల్లో వ్యూహాత్మకంగా చైనాను నిలువరించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్‌లోని రాంబిల్లి వద్ద న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ బేస్‌ (ఐఎన్‌ఎస్‌ వర్ష) ఏర్పాటు చేశాము. 

ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్షుని ఢిల్లీ పర్యటన సందర్భంగా వ్యూహాత్మక భద్రతా ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సంక్లి ష్టమైన హిమాలయ పర్వతాలలో చైనాను ఎదుర్కోవటానికి కీలక మైన ఆధునిక యుద్ధ ట్యాంకులు, శతఘ్నులు, మందుగుండు తయారీకి కీలక ఒప్పందం జరిగింది. యూఎస్‌ఏతో సుంకాల రచ్చ నేర్పిన గుణపాఠంతో యూరోపియన్‌ యూనియన్, కెనడా, ఒమన్, యూఏఈ, ఆస్ట్రేలియా వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాము. సెమికాన్‌ ఇండియా 2.0 ప్రోగ్రామ్‌ ద్వారా ఏఐ రంగంలో భారత్‌ వెనుకబడకుండా ఉండటానికి ప్రయత్నిస్తు న్నాము. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) చిప్‌ల తయారీకి కీలకమైన ఈయూవీ లితోగ్రఫీ యంత్రాల తయారీలో నెదర్లాండ్స్‌కు గుత్తాధిపత్యం ఉన్నది. 

నెదర్లాండ్స్‌కి చెందిన ఏఎస్‌యంఎల్‌ కంపెనీ మాత్రమే ఈ యంత్రాలను తయారు చేస్తున్నది. భారత ప్రధాని ఇటీవలి నెదర్లాండ్స్‌ పర్యటన ఈ రకంగా ప్రాధాన్యత సంతరించు కొన్నది. భారత ఆర్థిక వ్యవస్థ అతిపెద్ద బలహీనత చమురు–గ్యాస్‌ దిగుమతులు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి సుమారు 36 మిలియన్‌ బ్యారెళ్ల చమురును వ్యూహాత్మక నిలువగా ఉంచు తున్నది. చైనా సుమారు 110 మిలియన్‌ బ్యారెల్స్‌ను వ్యూహత్మక నిలువగా ఉంచుతుంది. ఇటీవలి యూఏఈ పర్యటనలో మన వ్యూహాత్మక చమురు నిల్వలు (30 మిలియన్‌ బ్యారెల్స్‌) ఏర్పాటు చేయటానికి అంగీకారం కుదిరింది.

చైనా–పాక్‌లకు చెక్‌ పెట్టడానికి యూఎస్‌ఏ లేదా రష్యాలపై ఆధారపడకుండా ప్రాంతీయ శక్తులతో స్నేహ సంబంధాలను పటిష్టం చేయాలి. ముఖ్యంగా దక్షిణాసియాలోని మలేషియా, ఇండో నేషియా, వియత్నాం, ఫిలిప్ఫైన్స్‌లతో సైనిక సంబంధాలను బలో  పేతం చేయాలి. పాకిస్తాన్‌ ఇస్లామిక్‌ వ్యూహాన్ని ఎదుర్కోవటానికి యూఏఈ, ఒమన్, సౌదీలతో వ్యూహాత్మక, భద్రతా సంబంధాలను పటిష్టం చేయాలి. ప్రపంచ శక్తులయిన యూఎస్‌ఏ, రష్యా, చైనా లతో నిర్మాణాత్మక ఆర్థిక, వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తూనే, వ్యూహాత్మక అంశాలలో జాగ్రత్త వహించాలి.

గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌);
సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల నిపుణులు 

Advertisement
 
Advertisement
Advertisement