నితిన్‌కు జోడీగా హైబ్రిడ్‌ పిల్ల... ఈసారైనా ఒప్పుకుంటుందా!

Sai Pallavi Tie Up With Nithin In His Next Romantic Drama Movie - Sakshi

‘ప్రేమమ్‌’ సినిమాతో కేవలం మలయాళ ప్రేక్షకులనే కాకుండా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది హైబ్రిడ్‌ పిల్లా సాయి పల్లవి. ఆ తర్వాత నటించిన ‘ఫిదా’ సినిమాలో సహజమైన నటన, తెలంగాణ యాసలో మాట్లాడి అందరి చూపు తనవైపుకు తిప్పుకుందామె. తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికి ఎంతో పాపులారిటీని సొంతం చేసుకుంది సాయి పల్లవి. దీనికి కారణం ఆమె ఎంచుకునే పాత్రలేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

రెమ్యునరేషన్‌ కంటే కూడా సినిమాలో తన పాత్రపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది ఈ అమ్మడు. తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త పడుతుంది. ఈ క్రమంలోనే ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటోంది పల్లవి. ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి హీరో నితిన్‌తో జత కట్టనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం ‘మ్యాస్ట్రో’ సినిమాలో నటిస్తోన్న నితిన్‌ తన తర్వాతి చిత్రాన్ని వక్కంతం వంశీతో చేయనున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌. రోమాంటిక్‌ లవ్‌స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రంలో సాయిపల్లవిని తీసుకోవాలని చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లు సమాచారం.

డైరెక్టర్‌ ఇప్పటికే సాయిపల్లవిని సంప్రదించి కథ వివరించినట్లు సమాచారం. దీనిపై ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాల్సిం ఉందట. అయితే గతంలో నితిన్‌ హీరోగా తెరకెక్కిన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు సరైన ప్రాధాన్యత లేదన్న కారణంగా సాయి పల్లవి ఆ సినిమాకు నో చెప్పిందని వార్తలు వచ్చాయి. కానీ దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. మరి ఇప్పుడైనా సాయిపల్లవి నిజంగానే నితిన్‌తో జతకడుతుందా లేదా అన్నది వేచి చూడాలి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top