పిల్లలను ఎలా పెంచాలి?..ఆలియాకు సద్గురు సలహా ఇదే | Sadhguru Advises Alia Bhatt To Learn How To Live From Daughter Raha | Sakshi
Sakshi News home page

నీ కూతుర్ని చూసి నేర్చుకో ముందు...అలియాభట్‌కు సద్గురు సలహా...

Apr 12 2026 1:51 PM | Updated on Apr 23 2026 11:59 AM

Sadhguru Advises Alia Bhatt To Learn How To Live From Daughter Raha

నీ కూతుర్ని చూసి నేర్చుకో ముందు...అలియాభట్‌కు సద్గురు సలహా...

ఆమె ఒక అగ్రగామి బాలీవుడ్‌ ప్రముఖుడి కుమార్తె..ఆ తర్వాత అందాల బాలీవుడ్‌ నటి బోలెడన్ని విజయాలు చవిచూసింది. బోలెడు మంది అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే మాత్రమేం...  నిన్నటి బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ఆలియా భట్‌ గత కొన్ని వారాలుగా అయోమయానికి గురవుతోంది. తన నాలుగేళ్ల చిన్నారిని ఎలా పెంచాలో తెలీక సతమతమవుతోంది. గత నవంబర్‌ 6, 2022న మాతృత్వంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి, ఆమె తాను చదువుతున్న పిల్లల పెంపకానికి సంబంధించిన పుస్తకాలను ఇన్ స్ట్రాగామ్‌ వేదికగా తరచు పంచుకుంటూ ఉండడం దీనికో  నిదర్శనం. 

ఈ నేపధ్యంలోనే ఆమె తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జగ్గీ వాసుదేవ్‌ (సద్గురు)తో సంభాషణలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె సద్గురు ముందు తాను ఎదుర్కుంటున్న సమస్య... పిల్లల పెంపకంపై సలహా ఇవ్వమని కోరడం పెద్ద విశేషమేమీ కాకపోవచ్చు. అయితే దానికి సద్గురు ఇచ్చిన సలహా ఇంటర్నెట్‌ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. 

జైన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (జెఐటిఓ) చెన్నైప్లస్‌ ఆధ్వర్యంలో  ఇన్‌ కన్సర్వేషన్‌ విత్‌ మిస్టిక్‌ అనే థీమ్‌తో నిర్వహించిన ఈకార్యక్రమానికి హాజరైన ఆలియా భట్, సద్గురువుతో ఒక వ్యక్తి ఎంత సమయం నిద్రపోవాలి అనే అంశం మొదలుకుని ప్రధానంగా పిల్లల పెంపకం, ఇంటర్నెట్‌ యుగం, ట్రోల్స్, వైఫల్యం పట్ల భయం, అనే విషయాలపై చర్చించారు.

ఈ సందర్భంగా  ‘మంచి తల్లిదండ్రులుగా ఉంటున్నామో లేదో అని ఆందోళన చెందుతున్న తమ లాంటి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే ఒకే ఒక్క సలహా ఏమిటి?‘ అని ఆలియా భట్‌ సద్గురువును  అడిగారు. దీనికి సమాధానమిస్తూ.. ‘ఆందోళన చెందే తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులు కారు.‘ ఆందోళన చెందే తల్లిదండ్రుల వల్ల పిల్లలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.  పైగా వారు అంతగా ఆందోళన చెందడం ద్వారా తమకు తామే హాని చేసుకుంటారు’’ అంటూ సద్గురు అలియాకు స్పష్టం చేశారు.  

దీనికి స్పందిస్తూ, ఆలియా భట్, ‘పిల్లల పెంపకం అనే ఆందోళనను తల్లిదండ్రుల్లో తొలగించగలమని నేను అనుకోను. మీరు  కూడా దీనిని అంగీకరిస్తారని  భావిస్తున్నాను,‘ అని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమార్తె రాహాకు ఏం నేర్పించాలనే అంశంపై కూడా తాను మధనపడుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. దాంతో సద్గురు స్పందిస్తూ పిల్లలకు సంతోషంగా ఉండడం సహజంగానే వస్తుందని వారికి మీరు నేర్పించేంది ఏముంటుంది? అంటూ ఎదురు ప్రశ్నించారు. 

మీ కుమార్తె రాహాకు కష్టపడి ఏదేదో నేర్పించే బదులు  సంతోషంగా ఎలా జీవించాలో తన కుమార్తె రాహా నుంచి నేర్చుకోమని సద్గురు ఆలియా భట్‌కు ఎదురు సలహా ఇచ్చారు. అనవసరమైన హడావిడి లేని తల్లిగా ఉండమని,జీవితంలోని ఆనందాలు ఎలా ఆస్వాదించాలో తన కుమార్తె నుంచి  నేర్చుకోమని ఆలియా భట్‌కు సద్గురు సూచించారు. 

ఆ సంభాషణలో భాగంగా అలా నేర్చుకోవడం ఎలా అనేది కూడా సద్గురు ఆమెకు వివరించారని ఆయన అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌ వెల్లడించింది. ఏది ఏమైనా పిల్లల పెంపకంపై  నిత్యం ఆందోళన చెందే తల్లిదండ్రుల ఆలోచనలకు అద్దం పడుతూ అలియాభట్‌ వేసిన ప్రశ్నకు సద్గురు ఇచ్చిన సమాధానం ఓ పెద్ద చర్చనే లేవనెత్తిందని చెప్పాలి.

Advertisement
 
Advertisement
Advertisement