
సాక్షి, హైదరాబాద్: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయల చెక్ అందజేశారు. గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాహుల్‌కు చెక్ బహుకరించారు. కాగా పాతబస్తీ కుర్రాడైన రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ వేదిక వరకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే!
ఆయన పాడిన నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలుచుకుంది. ఈ క్రమంలో 2023లో మే 12l టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి.. రాహుల్‌కు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకం అందించారు. కాంగ్రెస్ అధికారకంలోకి వస్తే కోటి రూపాయల బహుమతిస్తానని ప్రకటించారు.
ఇటీవల గద్దర్ అవార్డుల ఫంక్షన్‌లోనూ రాహుల్‌ను గుర్తు చేస్తూ త్వరలోనే బహుమతి ఉంటుందన్నారు. పాతబస్తీ బోనాల పండగలోనూ మరోసారి ఆ విషయాన్ని నొక్కి చెప్పారు. నేడు స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా కోటి రూపాయల నగదును చెక్ రూపంలో రాహుల్‌కు బహుకరించారు.