
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ(ఆర్‌జీవీ)పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన నిర్మాతగా తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘దహనం’.. 2022లో ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీని దర్శకుడు అగస్త్య మంజు తెరకెక్కించారు. అయితే, ఇందులో ఫ్యూడలిస్టులు, నక్సలైట్లకు మధ్య జరిగే పోరాటాన్ని తెరకెక్కించారు. ఓ కమ్యూనిస్ట్ నేత రాములును ఏ విధంగా హత్య చేశారు.. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఓ కొడుకు కథగా ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు.
అయితే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చెప్పిన వాస్తవ ఘటనల ఆధారంగా వెబ్ సిరీస్ రూపొందించినట్లు ఆర్‌జీవీ చెప్పారని, ఇది అవాస్తవమని రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా రెండు రోజుల క్రితం రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తాను ఎవరితోనూ వాస్తవ ఘటనలంటూ చెప్పలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వ్యక్తిగత గుర్తింపును దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆమె ఫిర్యాదు చేశారు. తన అనుమతి లేకుండానే చిత్రంలో ఆమె పేరును ఉపయోగించుకోవడం విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం తన ప్రతిష్టకు భంగం కలిగించడమేనంటూ ఆమె పేర్కొన్నారు.