
‘‘ఒకప్పుడు మాకు అర బిస్కెట్ (ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి) దొరికింది. హ్యాపీగా చేశాం. అప్పుడు చాన్స్ రావడమే గొప్ప... అందుకే అర బిస్కెట్టేనా? అనుకోలేదు. ఆ తర్వాత ఫుల్ బిస్కెట్ (సోలో హీరోలుగా చేయడం గురించి) దొరికింది. ఇద్దరం ఫుల్ బిస్కెట్‌ని ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం’’ అని గతంలో తాను, రజనీకాంత్ కలిసి నటించిన విషయం గురించి పేర్కొని, ‘‘ఇప్పుడు మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే హ్యాపీ’’ అంటూ ఇటీవల కమల్‌హాసన్ పేర్కొన్నారు.
తాజాగా తమ కాంబినేషన్ గురించి రజనీకాంత్ కూడా స్పందించారు. బుధవారం చెన్నై ఎయిర్‌పోర్టులో మీడియాతో రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (కమల్‌హాసన్ బేనర్), రెడ్ జెయింట్ మూవీస్ మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా నిర్మిస్తాయి. అయితే డైరెక్టర్, కథ ఫైనలైజ్ కాలేదు. మళ్లీ కలిసి సినిమా చేయడానికి నేను, కమల్ రెడీ. కానీ మాకు తగ్గ కథ, పాత్రలు దొరికితే చేస్తాం. డైరెక్టర్ కూడా కుదరాలి’’ అని పేర్కొన్నారు.
ఇక కెరీర్ ఆరంభంలో ‘అపూర్వ రాగంగళ్, మూండ్రు ముడిచ్చు, అంతు లేని కథ’ వంటి పలు చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు రజనీ–కమల్. ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ (1979) తర్వాత మళ్లీ కలిసి నటించలేదు. సో... రజనీ–కమల్ ఆశిస్తున్నట్లు కథ, పాత్రలు, డైరెక్టర్ సెట్ అయితే దాదాపు 45 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది.