
మలయాళ సీనియర్ నటి శాంతి విలియమ్స్ మోహన్‌లాల్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె తమిళ, మలయాళంలో వందకు పైగా సినిమాలతో పాటు పలు సీరియల్స్ లో సహాయక పాత్రలు పోషించారు. అపరిచితుడు సినిమాలో విక్రమ్‌కు తల్లిగా కూడా నటించారు. తనకు 12 ఏళ్ల వయసు ఉండగానే చిత్రపరిశ్రమలో ఆమె అడుగుపెట్టారు. ఆమె 1979లో మలయాళీ కెమెరామెన్ జె. విలియమ్స్ ను వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. తన భర్త మరణం సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండగా దానిని మోహన్‌లాల్ తన స్వార్థానికి ఉపయోగించుకున్నాడని ఆమె ఆరోపించారు.
మలయాళ సినిమాల్లో ఒకప్పుడు సుపరిచితుడైన సినిమాటోగ్రాఫర్ జె విలియమ్స్‌ను వివాహం చేసుకున్న శాంతి, తన భర్త అనారోగ్యానికి గురైనప్పుడు కుటుంబం తీవ్ర పేదరికంలోకి నెట్టబడిందని, కానీ పరిశ్రమ నుండి ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. విలియమ్స్ 2005లో అనారోగ్యంతో మరణించారు. అయితే, ఆ సమయంలో మోహన్ లాల్‌తో జరిగిన ఒక సంఘటన గురించి శాంతి ఇలా అన్నారు, “ఒకప్పుడు నాకు తెలిసిన లాల్ నేటి సూపర్ స్టార్ కంటే చాలా భిన్నంగా ఉంటాడు. అప్పట్లో, అతనికి చిన్నపిల్లవాడి అమాయకత్వం ఉండేది. అతను మా ఇంటికి వచ్చి, మాతో ఎప్పుడూ మాట్లాడేవాడు. నవ్వుతూ అన్ని విషయాలు పంచుకునే మంచి వ్యక్తి. కానీ, అతను పాపులర్ అయిన తర్వాత అతని ప్రవర్తన మారిపోయింది. చాలా మంది ఇతరులు కూడా అదే చెప్తారు.
లక్షల విలువైన కృష్ణుడి విగ్రహాన్ని తీసుకెళ్లాడు
తన ఇంట్లో ఉండే కృష్ణుడి విగ్రహాన్ని మోహన్‌లాల్ ఎలా తీసుకెళ్లాడో శాంతి ఇలా చెప్పింది. "మా ఇంట్లో పది నుంచి పన్నెండు అడుగుల ఎత్తున్న కృష్ణుడి విగ్రహం ఉండేది. నేడు ఆ విగ్రహం మోహన్‌లాల్ ఇంట్లో ఉంది. నా భర్తకు ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాం. ఆ సమయంలో కృష్ణుడి విగ్రహాన్ని మేము సరిగ్గా నిర్వహించగలమో లేదోనని నా భర్తకు అనిపించింది. మా ఇంట్లో ఎయిర్ కండిషనర్ లేదని, పిల్లలకు ఇబ్బందిగా ఉందని మోహన్‌లాల్‌తో నా భర్త విలియమ్స్ చెప్పాడు. మా ఆర్థిక పరిస్థితిని లాల్ సద్వినియోగం చేసుకున్నాడు. లక్షల విలువైన కృష్ణుడి విగ్రహాన్ని తీసుకెళ్లి, బదులుగా తన ఆఫీసు నుండి పాత ఎయిర్ కండిషనర్‌ను మాకు ఇచ్చాడు. కేవలం పదిరోజుల తర్వాత అది రిపేయర్‌కు వచ్చింది. దీంతో మేము దానిని అమ్మినప్పుడు, మాకు రెండు వేల రూపాయలు మాత్రమే వచ్చాయి. నాకు చాలా బాధ కలిగించే విషయం ఏమిటంటే.., మేము మోహన్‌లాల్ కోసం చాలా చేసినప్పటికీ, నా భర్త మరణించినప్పుడు అతను రాలేదు. నేను దాని గురించి మాట్లాడే ప్రతిసారీ, నాలో కోపం ఉప్పొంగుతుంది.
ఆకలితోనే నా పిల్లలు నిద్రపోయేవారు
నాకు నలుగురు పిల్లలు ఉన్నారనే విషయం మోహన్‌లాల్‌కు తెలుసు. విలియమ్స్ మంచం పట్టిన తర్వాత, కుటుంబాన్ని పోషించడానికి నేను డబ్బింగ్, నటన అంటూ తిరగాల్సి వచ్చింది. పిల్లలకు కడుపు నిండా ఆహారం లేని రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు వారు ఆకలితోనే నిద్రపోయేవారు. ఇప్పటివరకు నేను దీని గురించి ఎవరికీ చెప్పలేదు. అయితే, దర్శకుడు శంకర్ సార్ నా భర్త మరణించారని తెలుసుకొని రూ. 25వేలు సాయం చేశారు. ఏదైనా సాయం అవసరమైతే కాల్ చేయమని కూడా చెప్పారు. అయితే, మలయాళ పరిశ్రమ నుంచి ఏ ఒక్కరు కూడా సాయం చేయలేదు. కానీ, తమిళ పరిశ్రమ నుంచి కొందరు చేశారు.
నా మాతృభూమి కేరళ, నేను మలయాళీని. అయినప్పటికీ నన్ను నేను అలా పిలుచుకోవడానికి సిగ్గుపడుతున్నాను. మా దగ్గర డబ్బున్న సమయంలో ఎందరికో సాయం చేశాం. కానీ, నా భర్త మరణించిన సమయంలో ఎవరూ కూడా పలకరించలేదు.' అని ఆమె అన్నారు. ప్రస్తుతం శాంతి పిల్లలు పెద్దవారయ్యరు. ఉద్యోగాలు చేస్తూ జీవితంలో సెటిల్ అయ్యారు. భర్త మరణం తర్వాత తనకు చిన్న పాత్ర వచ్చినా సరే చేస్తూ పిల్లలను చదివించారని అక్కడి పరిశ్రమ గురించి తెలిసిన వారు చెప్తారు.