
సామాజిక మాధ్యమాలను బాగా వాడుకునే నటీమణుల్లో సమంత ఒకరు. తమిళం, తెలుగు భాషల్లో నటించి అగ్ర కథానాయకిగా ఏలిన ఈ అమ్మడు ఆ మధ్య మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురికావడంతో అది కెరీర్‌కు బాగా ఎఫెక్ట్ అయ్యింది. ఆ వ్యాధి నుంచి కోలుకున్నా, కథానాయకిగా మాత్రం బిజీ కాలేకపోతున్నారు. ఇటీవల నిర్మాతగా మారి శుభం అనే చిత్రాన్ని నిర్మించి అతిథి పాత్రలో నటించారు. ఆ చిత్రం మంచి పేరునే తెచ్చిపెట్టింది. అయినా తర్వాత చిత్రం గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. అదేవిధంగా ఈమె మళ్లీ తమిళ చిత్రంలో హీరోయిన్‌గా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ దాని గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అయితే సమంత మాత్రం ఏదో ఒక వార్తతో నిత్యం ప్రైమ్ టైమ్‌లో ఉండే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలా తాజాగా సమస్యల కారణంగా తాను చాలా విషయాలను నేర్చుకున్నానని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.అదేవిధంగా ఇక్కడ కథానాయకి కెరీర్‌గానీ, గ్లామర్, అభిమానులు, పాపులారిటీ ఏదీ శాశ్వతం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా కొంత కాలమేనని అన్నారు. ఒక నటిగా ఎదగడానికి చాలా అదృష్టానికి మించి చాలా కావాలన్నారు. తాను తన జీవితంలో నటిగా కంటే పెద్ద ప్రభావాన్ని చూపాలని కోరుకున్నానన్నారు. దాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని తెలిసిందన్నారు.
ఇలా వేదాంతం పలుకుతున్న సమంత గురించి సామాజిక మాధ్యమాల్లో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులు మాత్రం సమంతకు ఫుల్ సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఏదేమైనా సమంత మళ్లీ తెరపై ఎప్పుడు మెరుస్తుందో అని ఆమె అభిమానులు మాత్రం ఎదురు చూస్తున్నారు.