
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే సినిమా పరిశ్రమలో నిలదొక్కున్నారు. తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు. అయితే, ప్రస్తుతం ఆయన పిల్లలు కుమారుడు మహాధన్, కుమార్తె మోక్షధ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో రవితేజ ఈ విషయం గురించే మాట్లాడారు.

రవితేజ నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’.. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీని నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ క్రమంలోనే దర్శకుడు వెంకీ అట్లూరితో ప్రత్యేక చిట్‌చాట్‌లో రవితేజ పాల్గొన్నారు. ఆ సమయంలోనే రవితేజ పిల్లల గురించి మాట్లాడారు. ప్రస్తుతం తమిళ హీరో సూర్యతో ఒక సినిమా చేస్తున్నానని రవితేజతో దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పారు. అయితే అదే మూవీకి మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడని పంచుకున్నారు.
వెంటనే రవితేజ కూడా "నా కుమారుడితో పని చేయడం ఎలా అనిపించింది..?" అని సరదాగా అడగ్గానే.. వెంకీ నవ్వుతూ.. 'అతను చిన్నప్పటి నుంచే సినిమా సెట్‌ల మధ్యే పెరిగాడు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు.. చాలా నేచురల్‌గా అనిపించింది' అని పేర్కొన్నారు. మహాధన్, చిన్నప్పుడు 'రాజా ది గ్రేట్' సినిమాలో రవితేజ చిన్నప్పటి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన సూర్య సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయనున్నారు. రాబోయే రోజుల్లో మహాధన్ హీరోగా నటిస్తాడా.. దర్శకుడిగా పరిచయం కానున్నాడా అనేది క్లారిటీ ఇవ్వలేదు.

కుమారుడి గురించి రవితేజ ఇలా చెప్పాడు. మహాధన్ కెరీర్ గురించి అక్కగా మోక్షధ గ్గరగా గమనిస్తోంది. వాడు ఏ విషయం అయినా సరే వాళ్ల అక్కతోనే పంచుకుంటాడు. తను కూడా వాడికి అంతే ప్రాముఖ్యత ఇస్తుంది. వాడి కెరీర్ గురించి చూసుకునేందుకు మోక్షిధ ఉంది. అంటూ క్లారిటీ ఇచ్చారు. మోక్షధ కూడా నిర్మాణ రంగం వైపు అడుగులేస్తుంది. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ, వినోద్ అనంతోజు కాంబినేషన్‌లో నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందుతున్న 'తక్షకుడు' చిత్రానికి ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో రవితేజ ప్రొడక్షన్ హౌస్ పేరుతో సినిమాలు కూడా ఆమె నిర్మించే ఛాన్స్ ఉంది.