ఒకప్పుడు సినిమా తీసేవాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేసేవారని..ఇప్పుడు ఒళ్లు బలిసి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నాడు నటుడు, దర్శకుడు రవిబాబు. చాలా గ్యాప్ తర్వాత ఆయన దర్శకత్వంలో రేజర్ అనే సినిమా రాబోతుంది. ఇందులో ఆయనే హీరోగా నటించాడు. మే 8న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయాడు రవిబాబు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటికీ ఇప్పటికి ఫిలిం మేకింగ్ లో వచ్చిన మార్పులపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘అప్పుడు సినిమాలు చేసేవాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకొని తీసేవాళ్లు. ఇప్పుడు సినిమాలు చేసేవాళ్లు ఒళ్లు బలిసి చేస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో 'ఫిల్మ్'లో సినిమా తీస్తాం కాబట్టి, దానిపై ఒక రెస్పెక్ట్ ఉండేది. ఫిల్మ్ చాలా ఖరీదైనది కావడంతో, యాక్టర్స్ , డైరెక్టర్స్, కెమెరామెన్ అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఎవరి పనులు వాళ్లు చేసేవాళ్లు. ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది. చిప్ వేస్తున్నాడు, తీస్తున్నాడు.. మళ్లీ అదే చిప్ పెడుతున్నాడు. దాని కాస్ట్ కూడా కాలిక్యులేట్ చేయలేకపోతున్నాం. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు బిహేవ్ చేస్తున్నారు.
ఎందుకంటే బేసిక్ ఇన్ ఫుట్ టెక్నాలజీ మీద, టైమ్ మీద రెస్పెక్ట్ లేకుండా పోయింది. అప్పట్లో టైమ్‌కి,డబ్బులకి వ్యాల్యూ ఇచ్చేవారు. ఇప్పుడు అసలు అదేం లేదు. ఒకప్పుడు ప్రొడక్షన్ ప్లానింగ్ అంతా డిసిప్లైన్ గా జరిగేది. ఇప్పుడు అలాంటి డిసిప్లైన్ లేదు’ అని రవిబాబు అన్నారు. అయితే ‘ఒళ్లు బలిసి సినిమాలు చేస్తున్నారు’ అని విమర్శించడాన్ని కొంతమంది నెటిజన్స్ తప్పుపడుతున్నారు. టెక్నీషియన్లను ఉద్దేశించి ఇలాంటి పదజాలం వాడటం సరికాదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరికొంతమంది రవిబాబు వ్యాఖ్యలలో వాస్తవం ఉందని కొందరు సమర్థిస్తున్నారు.


