
రకుల్ ప్రీత్ సింగ్.. పేరు వినగానే, హీరోయిన్‌గానే కాకుండా ఫిట్‌నెస్ అండ్ హెల్త్ గుర్తొస్తుంది. ఆమె గురించి తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు ఉంటూనే ఉంటాయి. నటిగానే కాకుండా ఆమె ఫిట్‌నెస్, డ్యాన్స్, స్పోర్ట్స్, సోషల్ యాక్టివిటీస్, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లో తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకుంది. రకుల్ గురించి ఇంకొన్ని విషయాలు...
నాన్న ఆర్మీ ఆఫీసర్
రకుల్ ప్రీత్ సింగ్ న్యూఢిల్లీలోని సిక్కు కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రి కుల్వీందర్ సింగ్ ఆర్మీ ఆఫీసర్‌గా పని చేసేవారు. దాంతో ఆమె ఆర్మీ స్కూల్‌లోనే స్కూలింగ్ చేసి, ఆపైన జీసస్ అండ్ మేరీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. రకుల్ ప్రీత్ జాతీయ స్థాయి గోల్ఫ్ ప్లేయర్. అంతేకాదు, ఎంతో ఆసక్తితో భరతనాట్యం కూడా నేర్చుకుంది. అలాగే ఆమెకు గుర్రపు స్వారీ చేయడం కూడా చాలా ఇష్టం.
మోడలింగ్
మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాక, రకుల్ 18 ఏళ్లకే కన్నడ సినిమా ‘గిల్లి’ ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో నటించి.. ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ‘ఫెమినా’ మిస్ ఇండియా–2011లో రకుల్ ఐదో స్థానంలో నిలిచింది. అందులోనే పాంటలూన్స్ మిస్ ఫ్రెష్ ఫేస్, ఫెమినా మిస్ టాలెంటెడ్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, పీపుల్స్ చాయిస్ మిస్ ఇండియా టైమ్స్ వంటి టైటిల్స్ గెలుచుకుంది.
కోవిడ్ టైంలో..
‘మనకంటూ ప్రత్యేకంగా టైమ్ కేటాయించుకోవాలి. ఎవరి సంతోషం వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. దానికోసం ఎవరిపైనా ఆధారపడొద్దు’ అన్నది రకుల్ అభిప్రాయం. రకుల్ తన సామాజిక బాధ్యతను ఎప్పుడూ మరిచిపోలేదు. కోవిడ్ సమయంలో వంద కుటుంబాలను ఆదుకోవడమే కాకుండా, క్రౌడ్ ఫండింగ్ చేసి పేదలకు డొనేషన్స్ అందించింది. 2017లో రకుల్ ‘తెలంగాణ బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా అపాయింట్ అయింది.
నాన్న నుంచే వచ్చాయి..
2024లో తను ప్రేమించిన జాక్కీ భగ్నానీ (Jackky Bhagnani)ని గోవాలో వివాహం చేసుకుంది. మొదట ఓవర్సీస్‌లో పెళ్లి వేడుకలు జరపాలనుకున్నారట! కాని, దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడాలనే ఆలోచనతో గోవాలోనే ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ‘సక్సెస్ అంటే పేరు, డబ్బు కాదు. మనసుకు నచ్చిన పని చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడపడం. చిన్నప్పటి నుంచి నాన్న నుంచి వచ్చిన డిసిప్లిన్, పంక్చువాలిటీ నన్ను ఎప్పటికీ హ్యాపీ లైఫ్ వైపే తీసుకెళ్తాయి.
ఇష్టం
దానివల్లే చేయాల్సిన పనిలో రెండు నిమిషాలు ఆలస్యమైనా నాకు ప్యానిక్ అటాక్ వచ్చేస్తుంది. సోషల్ ఎంటర్‌టైనర్స్ చేయడం నాకు చాలా ఇష్టం. వాటితో సమానంగా సోషల్ రెస్పాన్సిబుల్ సినిమాలూ చేయాలని ఉంది. ఫ్యాషన్, డ్రెస్సింగ్ విషయానికొస్తే, నాకు ఏది కంఫర్ట్ ఉంటే అదే ఎంచుకుంటాను’ అని చెబుతుంది
పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. 2047 నాటికైనా మనమంతా కాలుష్యరహిత దేశంలో ఉంటామని ఆశిస్తున్నాను. ప్రతి భారతీయ పౌరుడు బాధ్యతగా ఉంటేనే ప్లానెట్ ఎర్త్ బాగుంటుంది.
– రకుల్‌ప్రీత్ సింగ్