
మంచి చేయాలనుకుంటే అందులో కూడా చెడే చూస్తున్నారంటున్నాడు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, బిజినెస్‌మెన్ రాజ్ కుంద్రా (Raj Kundra). స్వామీజీ ప్రేమానంద్ మహారాజ్ అనారోగ్యం గురించి తెలుసుకున్న ఈయన స్వామికి కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
కరుణ కూడా పీఆర్ స్టంటా?
అయితే చాలామంది ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపడేస్తున్నారు. తనపై ఉన్న కేసులను కప్పిపుచ్చడానికే ఇదంతా చేస్తున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ట్రోలింగ్‌పై రాజ్ కుంద్రా అసహనం వ్యక్తం చేశాడు. ఒక మనిషి ప్రాణాలు కాపాడటం కోసం నా కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధపడితే దాన్ని కూడా తప్పుపడుతున్నారు. పీఆర్ స్టంట్ అని తీసిపారేస్తున్నారు. ఇలాంటి వింత ప్రపంచంలో ఉంటున్నాం! కరుణ, జాలి అనేవి స్టంట్ అయితే.. ప్రపంచమంతా అది వ్యాపించాలి.

వీలైతే ప్రేమించండి
మానవత్వాన్ని ఎగతాళి చేస్తున్నారు. మానవత్వాన్ని స్ట్రాటజీ అని భావిస్తుంటే.. మీరందరూ దాన్ని ఫాలో కావాలి. మీ మెప్పు పొందడం కోసమైతే నేనలా మాట్లాడలేదు. మీ మాటలు, విమర్శలతో నా వ్యక్తిత్వం మారదు. వీలైతే ప్రేమించండి, అంతేకానీ, చులకనగా మాట్లాడకండి.. అప్పుడే ఇతరుల జీవితాల్లో మీరూ వెలుగులు నింపగలరు అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.
కిడ్నీ ఆఫర్.. తిరస్కరించిన స్వామీజీ
కాగా ప్రేమానంద్ మహారాజ్ దశాబ్దకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. బృందావన్ ఆశ్రమంలో స్వామీజీని కలిసిన రాజ్‌కుంద్రా.. నా రెండు కిడ్నీలలో ఒకటి మీదే అంటూ అవయవదానానికి ఆఫర్ ఇచ్చాడు. కానీ స్వామీజీ అందుకు నిరాకరించారు. రాజ్‌కుంద్రా కిడ్నీ ఆఫర్ చేసిన సమయంలో శిల్పా శెట్టి భర్త పక్కనే కూర్చుంది.
చదవండి: అందం ఒక్కటే కాదు.. కలర్ ఉంటేనే షోలకు పిలుస్తారు: కీర్తి భట్