
అహ్మదాబాద్ విమాన ప్రమాదం బాధిత కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టేసింది. జీవితం శాశ్వతం కాదని, మరణం ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందనేది చెప్పలేమని సమస్త ప్రజానీకానికి గుర్తు చేసింది. భూమిపై ఉన్నన్ని రోజులు గొడవలు తగ్గించి ప్రశాంతంగా, అయినవారితో సంతోషంగా గడపమని సందేశాన్ని పంపింది. విమాన ప్రమాదం అనే విషాదం కొందరి జీవితాల్లో మార్పు తెచ్చిందంటోంది సింగర్, నటి రాగేశ్వరి. విడాకులకు సిద్ధమైన వారు కూడా మనసు మార్చుకుని కలిసిపోయారని చెప్తోంది.
సడన్‌గా ఎందుకీ మార్పు?
మీకో విషయం తెలుసా? విమాన ప్రమాదం (Ahmedabad Air India Plane Crash) తర్వాత చాలామంది వారి కుటుంబాలకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడుగుతున్నారు, కాసేపు మాట్లాడుతున్నారు. నాకు తెలిసిన రెండు జంటలు విడాకుల వరకు వెళ్లగా.. ఇప్పుడు కలిసిపోయారు. సడన్‌గా వారిద్దరి కుటుంబాలు అహంకారాన్ని పక్కనపెట్టేశాయి. సమస్యలను పరిష్కరించుకున్నారు. అకస్మాత్తుగా ఎందుకింత మార్పు వచ్చింది? విపత్తులు వచ్చినప్పుడే మనకు జీవితం విలువ తెలిసొస్తుందని సైకాలజిస్టులు అంటున్నారు.
ప్రమాదాలే గుర్తు చేస్తాయి
ఎన్నో అపజయాలను చవిచూస్తే తప్ప విజయం అందదు. కొన్ని ఒడిదుడుకులను అధిగమిస్తే కానీ పైకి వెళ్లలేరు. ఇలాంటి విషాదాలు మనల్ని ఒక్కసారిగా ఆపేస్తాయి. జీవితంలో మనకు ఏది ముఖ్యమనేది గుర్తు చేస్తాయి. కాబట్టి ఇప్పుడైనా మీ కుటుంబానికి కాస్త సమయం కేటాయించండి. నువ్వెలాంటి బట్టలు వేసుకున్నావు? ఎలా కనిపిస్తున్నావు? ఏం మాట్లాడావు? అనేది జనాలు గుర్తుపెట్టుకోరు. కానీ ఎదుటివారితో ఎలా ప్రవర్తిస్తున్నావు?
కుటుంబాన్ని ప్రేమించండి
వారిని ఎంత స్పెషల్‌గా చూస్తున్నావనేదే గుర్తుపెట్టుకుంటారు. మీ కుటుంబం ఎంత విలువైనదో గ్రహించండి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. భూమిపై ఉన్నన్నాళ్లూ మనం పీల్చుకునే ఊపిరి, పొందే ప్రేమ మాత్రమే శాశ్వతం. కాబట్టి వీలైతే క్షమించండి, సున్నితంగా మాట్లాడండి, ప్రేమగా ఉండండి అని చెప్పుకొచ్చింది. రాగేశ్వరి లూంబ్.. ఆంఖెన్, మై ఖిలాడీ తు అనారీ, దిల్ కిత్నా నడాన్ హై వంటి పలు చిత్రాల్లో నటించింది. దునియా, ప్యార్ కా రంగ్, సచ్ కా సాత్ వంటి ఎన్నో పాటలు పాడింది.
విమానయానం విషాదం..
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం జూన్ 12న మెడికల్ కాలేజీపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఓ వ్యక్తి తప్ప అందరూ సజీవ సమాధి అయ్యారు. అలాగే మెడికల్ కాలేజీ క్యాంటీన్‌లో భోజనం చేస్తున్న పలువురు మృతి చెందగా కొందరికి తీవ్రగాయాలయ్యాయి.
చదవండి: ప్రభాస్.. ఇద్దరు హీరోయిన్లు కావాలన్నాడు: మారుతి