
తమిళనాడులో నటుడు, టీవీకే అధినేత విజయ్ రాజకీయ సభ పెను విషాదాన్ని మిగిల్చింది. శనివారం సాయంత్రం కరూర్ జిల్లా వెలుచామైపురం వద్ద జరిగిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి దాదాపు 40 మంది మరణించారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దర్శకుడు పూరి జగన్నాథ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్, టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
డబుల్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న పూరి.. ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఓ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. #పూరిసేతుపతి అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ కూడా ప్రారంభించారు. ఈ రోజు (సెప్టెంబర్ 28)న చెన్నైలో టైటిల్, టీజర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు చిత్ర యూనిట్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అయితే కరూర్ తొక్కిసలాట ఘటనతో తమిళనాడులో విషాద ఛాయలు అలుముకోవడంతో పూరి.. ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేశారు.
సెప్టెంబర్ 27వ తేదీన తమిళనాడు కరూరులో టీవీకే సభలో జరిగిన దుర్ఘటన కారణంగా ఈరోజు చెన్నైలోని గ్రీన్ పార్క్ హోటల్ లో జరగాల్సిన పూరీ సేతుపతి టైటిల్ , టీజర్ లాంచ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేస్తున్నాం. త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తాం’అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. కాగా, ఈ చిత్రానికి 'స్లమ్ డాగ్' అనే టైటిల్ పెట్టినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త నటించగా.. టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.