Punjabi Singer Amar Singh Chamkila Death Mystery - Sakshi
Sakshi News home page

Amar Singh Chamkila: రెండో భార్యతో ప్రదర్శనకు వెళ్తుండగా సింగర్‌పై తూటాల వర్షం.. చంపిందెవరు?

Jun 4 2023 2:44 PM | Updated on Jun 4 2023 5:16 PM

Punjabi Singer Amar Singh Chamkila Death Mystery - Sakshi

తన కారణంగా లక్షలు సంపాదిస్తూ, తనకు నెల జీతం మాత్రమే ఇస్తున్నారని గ్రహించాడు. దాంతో చమ్కీలా.. తానే ఒక

మనసులో పుట్టిన మాటలకు బాణీ కట్టి రాగం అందుకుంటే, అది మహామహ జనసందోహాలను కూడా ఏకం చేసి ఉరకలేయిస్తుంది. సై.. సై.. అంటూ ఉర్రూతలూగిస్తుంది. విప్లవాలను, ఉద్యమాలను, సంస్కరణలను జతచేర్చి.. తరతరాలకు పాఠమవుతుంది. అయితే అదే రాగం కొందరికి చేదును, మరికొందరికి చికాకును ఇంకొందరిలో అసూయనూ రగిలించి నిప్పు రాజేస్తుంది. ఆ నిప్పే కాల్చేసిందో, లేక అంతటి ఔదార్యమున్న కలానికి కులం రంగు అద్దిన ఉన్మాదమే కడతేర్చిందో.. తెలియదు కానీ అమర్‌ సింగ్‌ చమ్కీలా జీవితంలో పెద్ద ఉపద్రవమే ముంచుకొచ్చింది. అసలు ఎవరీ చమ్కీలా? ఏం జరిగింది?

దుస్తుల మిల్లులో చేరి..
భారతీయ సంగీత చరిత్రలో చమ్కీలా కథకు ప్రత్యేకమైన అధ్యాయముంది. చమ్కీలా అంటే పంజాబీలో ప్రకాశవంతమైనదని అర్థం. పంజాబ్, లూథియానా సమీపంలోని దుగ్రీ గ్రామంలో చమార్‌ (దళిత్‌) కులానికి చెందిన కర్తార్‌ కౌర్, హరిరామ్‌ సింగ్‌ దంపతులకు 1960 జూలై 21న చమ్కీలా జన్మించాడు. అతని అసలు పేరు ధనీరామ్‌. చిన్నవయసులోనే గుర్మైల్‌ కౌర్‌ అనే బంధువుల అమ్మాయితో పెళ్లి జరిగింది. వీరికి అమన్‌దీప్‌ కౌర్, కమన్‌ చమ్కీలా (ప్రస్తుతం ఫోక్‌ సింగర్‌) అనే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. మరో కొడుకు పుట్టి.. అనారోగ్యంతో చనిపోయాడు. మొదటి నుంచి ఎలక్ట్రీషియన్‌ కావాలని ఆశపడిన ధనీరామ్‌.. ఆ ఆలోచనను పక్కనపెట్టి.. ఆర్థిక కష్టాలను ఎదుర్కోవడానికి దుస్తుల మిల్లులో చేరాడు. అక్కడ ఓ స్నేహితుడు ఇతని రాతకు ముగ్ధుడై.. సురీందర్‌ షిండా అనే ఓ సంగీతవిద్వాంసుడి దగ్గరకు తీసుకెళ్లాడు. ధనీరామ్‌ కథలో, పేరులో మార్పులు అక్కడి నుంచే మొదలయ్యాయి.

పంజాబ్‌ను ఓ ఊపు ఊపిన చమ్కీలా
చమ్కీలా (ధనీరామ్‌) టీమ్‌లో చేరినప్పటి నుంచి షిండా పేరు దేశవిదేశాలకు పాకింది. చమ్కీలాకు మాత్రం గుర్తింపు దక్కలేదు. పైగా ఇతర దేశాల్లో ప్రదర్శనలకు చమ్కీలాను తీసుకెళ్లడానికి షిండా ఇష్టపడేవాడు కాదు. 1980లో ఒకసారి షిండా.. కెనడా పర్యటనకు వెళ్లినప్పుడు ఆ గ్రూప్‌లోని సోనియా అనే మరో గాయని చమ్కీలాను కలిసింది. ‘షిండాను దాటి నీకు గుర్తింపు రావాలంటే.. నేను కొత్తగా ప్రారంభిస్తున్న బృందంలో చేరు’ అని చెప్పడంతో చమ్కీలా సరే అన్నాడు. సోనియా పెట్టుబడి పెడితే.. చమ్కీలా తన ఆలోచనలకు మరింత పదునుపెట్టి.. ఆమె దగ్గరే జీతానికి కుదిరాడు. అనుకున్నట్లే షిండా కెనడా నుంచి పంజాబ్‌ వచ్చేలోపు.. సోనియా ఆధ్వర్యంలో ఎనిమిది యుగళగీతాలను విడుదల చేసి పంజాబ్‌ని ఓ ఊపు ఊపాడు చమ్కీలా.

రిలీజ్‌ చేసిన ప్రతి ఆల్బమ్‌ హిట్‌..
అయితే ఆ ఏడాది చివరికి.. సోనియా, ఆమె భర్త కలసి.. తన కారణంగా లక్షలు సంపాదిస్తూ, తనకు నెల జీతం మాత్రమే ఇస్తున్నారని గ్రహించాడు. దాంతో చమ్కీలా.. తానే ఒక రంగస్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లే హార్మోనియం, ఢోలక్‌ వాయించగలిగే బృందంతో పాటు.. అమర్‌జోత్‌ కౌర్‌ అనే ఒక మహిళా గాయనినీ తన టీమ్‌లోకి తీసుకుని.. ఆల్బమ్స్‌ రిలీజ్‌ చేయడం మొదలు పెట్టాడు. రిలీజ్‌ చేసిన ప్రతి ఆల్బమ్‌ హిట్‌ కొట్టడంతో చమ్కీలా పంజాబ్‌ సూపర్‌ స్టార్‌ అయ్యాడు. ఆ సమయం లోనే అతనికి అమర్‌ జోత్‌తో స్నేహం కుదిరింది. ఆ స్నేహం ప్రేమగా మారి.. పెళ్లిదాకా వెళ్లింది.

రెండో పెళ్లి.. ఊరూరా ప్రదర్శనలు
మొదటి భార్య గుర్మైల్‌ని ఒప్పించి (విడాకులు తీసుకున్నాడని కొందరంటారు).. 1983లో అమర్‌జోత్‌ని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి జైమన్‌ (ప్రస్తుత ఫోక్‌ సింగర్‌) అనే కొడుకు పుట్టాడు. వివాహేతర సంబంధాలు, మత సంఘర్షణలు, మద్యపానం, వరకట్నాలు, మాదకద్రవ్యాలు.. ఇలా ప్రతి సమస్యపైనా పాట కట్టి.. ప్రజలను ఆలోచింపచేసేవాడు చమ్కీలా. వేడుక ఏదైనా.. ప్రతి ఊళ్లో అతని దరువు వినిపించాల్సిందే. ఏడాదికి ఊరూరా 366 ప్రత్యక్ష ప్రదర్శనలు చేసేవారంటే చమ్కీలా దంపతులు ఎంత బిజీగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. 1988 మార్చి 8న మధ్యాహ్నం 2 గంటలకు మెహసంపూర్‌ సమీపంలోని ప్రదర్శనకు వెళ్తుంటే.. ముసుగులేసుకున్న కొందరు దుండగులు బైక్స్‌ మీదొచ్చి చమ్కీలా కారుకు అడ్డుపడ్డారు.

తూటాల వర్షం..
మరుక్షణమే తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. ఆ దాడిలో చమ్కీలా(27), అమర్‌జోత్‌ అక్కడికక్కడే కన్నుమూశారు. ఆ సమయంలో అమర్‌జోత్‌ గర్భవతి. సంఘటనా స్థలంలో ఉన్న కొందరు గ్రామస్థులు.. ఆ దుండగులను వెంబడించినా దొరకలేదు. దాంతో ఎవరు చంపారు? అనేది నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది. నిజానికి ఈ హత్యకేసుపై చాలా ఊహాగానాలున్నాయి. అప్పటి ఖలిస్తాన్‌ ఉద్యమానికి వ్యతిరేకంగా పాటలు రాసినందుకే సిక్కు ఉగ్రవాదులు చమ్కీలాను చంపేశారని కొందరి అభిప్రాయం.

చమ్కీలా గొంతు మూగబోయి 35 ఏళ్లు
కొన్ని సంగీత బృందాలు కేవలం చమ్కీలా వల్లే మరుగున పడ్డాయని.. ఆ అక్కసుతోనే వారంతా కలసి అతనిని చంపించారని మరి కొందరి ఊహ. మరోవైపు చమ్కీలా రెండో భార్య అమర్‌జోత్‌ ఉన్నత వర్గానికి చెందిన స్త్రీ కావడంతో.. ఇది పరువు హత్య అని.. అమర్‌జోత్‌ కుటంబీకులే ఈ నేరానికి పాల్పడి ఉంటారని ఇంకొందరి వాదన. ఇతడి జీవితకథపై చాలా సినిమాలు, పుస్తకాలూ విడుదలయ్యాయి. వాటిలో కొన్ని వివాదాలపాలయ్యాయి. ఏది ఏమైనా చమ్కీలా గొంతు మూగబోయి 35 ఏళ్లు దాటింది. అయినా నేటికీ జానపద సంగీత ప్రియులకు అతడి పాట వినిపిస్తూనే ఉంది. 

చమ్కీలా కూతురు, కొడుకు కూడా సింగర్లే
చమ్కీలా కుమార్తె కమల్‌. యూట్యూబ్‌లో ఈమె వీడియోలు, పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. చమ్కీలా కుమారుడు జైమన్‌ చమ్కీలా, కోడలు రియా. (వీరిద్దరూ జోడీగా చేసే ఫోక్‌ సాంగ్స్‌ కూడా ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి.. చమ్కీలా పాటల్లో కొన్ని.. ‘పెహెలే లల్‌కార్‌ నాల్‌ (తొలుత బాకా మోగింది)’ ఇది పెళ్ళైన జంట గురించి పాడిన పాట. ‘బాబా తేరా నన్‌కానా (బాబా నీ మందిరం, నీ గురువు గురునానక్‌)’ ఇది సిక్కులకు ధైర్యం చెప్పే పాట. ‘భూల్‌ గయీ మై ఘుండ్‌ కడ్నా (ముసుగు వేసుకోవడం మరచాను)’.. లాంటి పాటలూ ఎంతో ప్రాచుర్యం పొందాయి.
సంహిత నిమ్మన

చదవండి: ఒక్కరోజుకు నాలుగు వందలా? అవసరం లేదన్న హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement