ప్రియదర్శి (Priyadarshi Pulikonda), ఆనంది (Anandhi) హీరో హీరోయిన్లుగా, సుమ కనకాల ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘ప్రేమంటే..’ థ్రిల్ ప్రాప్తిరస్తు ఉపశీర్షికను చేర్చారు. రానా స్పిరిట్ మీడియా సమర్పణలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించారు. ఈ చిత్రం నేడు (శుక్రవారం) థియేటర్స్‌లోకి వచ్చేసింది. మల్లేశం, బలగం, కోర్ట్ సినిమాలతో ప్రియదర్శికి క్రేజ్ బాగానే ఉంది. కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ మూవీపై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నారు. తెలుగమ్మాయి ఆనంది ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రేమ, పెళ్లి జీవితంతో ముడిపడిన కథతో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి..?
ప్రేమంటే కథ సాధారణంగానే మొదలైనప్పటికీ కేవలం 15 నిమిషాల తర్వాత యూనిక్ కాన్సెప్ట్‌గా ఉందే అనిపిస్తుంది. ప్రియదర్శి (మధు సూదన్/మది) సీసీటీవీ సెక్యూరిటీ సర్వీస్ బిజనెస్ చేస్తుంటాడు. ఆనంది (రమ్య) చదువు పూర్తి చేసి ఉద్యోగంలో ఉంటుంది. అయితే, వీరిద్దరు పెళ్లి తర్వాత తమ జీవితం ఎలా ఉండాలో ఊహించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని సంబంధాలు కూడా రిజెక్ట్ చేస్తుంటారు. అయితే ఒక పెళ్లిలో అనుకోకుండా మధి, రమ్య కలుసుకుంటారు. ఇద్దరి అభిరుచులు కలుస్తాయి. ఆపై వారి కుటుంబాలు కూడా కలిసిపోతాయి. తర్వాత పెళ్లితో ఒక్కటైపోతారు.

రమ్యకు థ్రిల్లింగ్ అనిపించే పనులు చేయాలంటే ఇష్టం.. మధి తన కుటుంబం కోసం ఏమైనా చేయాలనే మనస్థత్వంతో ఉంటాడు. సీసీటీవీ సెక్యూరిటీ సర్వీస్ బిజనెస్ చేసే మధి రాత్రి సమయంలో తన టీమ్‌తో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. తన ప్రవర్తనలో ఏదో తేడా ఉందని రమ్య గుర్తిస్తుంది. అయితే, మధి గురించి అసలు విషయం తెలిసిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడుతుంది. ఇలాంటి సమయంలో రమ్యకు ఏం చెప్పి మధి ఒప్పించాడు..? మధి ఎందుకోసం దొంగతనాలు చేస్తున్నాడు..? ఫైనల్‌గా రమ్య కూడా మధితో పాటు చోరీలు చేయడానికి కారణం ఏంటి..? పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఈ జోడీ వేస్తున్న స్కెచ్ ఏంటి..? ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రేమంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..?
పెళ్లి తర్వాత తమ జీవితం ఎలా ఉండాలో అని ముందే ఊహించుకుంటాం. కానీ, అందుకు విరుద్దంగా లైఫ్ కొనసాగితే ఎలా ఉంటుందో ఈ మూవీలో చక్కగా చూపించారు. ప్రేమలో ఉన్నప్పుడు వారి ప్రయాణం థ్రిల్లింగ్‌గా, ఓ సాహసోపేతమైన ప్రయాణంలా ఉండొచ్చు. కానీ, ఆ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారన్నది ప్రమంటేలో దర్శకుడు చూపించారు. కథలోని పాయింట్ కాస్త యూనిక్‌గా ఉన్నప్పటికీ చెప్పిన విధానం మాత్రం రెగ్యులర్ సినిమా కథలాగే ఉంటుంది. లాజిక్స్ వెతుకుతే సినిమా నచ్చకపోవచ్చు. ఫస్టాఫ్ ఫుల్ కామెడీగా మంచి ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. దొంగతనం అంటే ఇష్టం లేని రమ్య తన భర్త మధితో పాటు చేసేందుకు రెడీ అవుతుంది.. ఎందుకు అనేది బలమైన కారణం ఉండదు.

కానీ, చోరీ చేసే ప్లాన్స్, సన్నివేశాలు తప్పకుండా థ్రిల్‌ను పంచుతాయి. నగరంలో వరుసగా చోరోలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ కేసును ఛేదించేందుకు హెడ్ కానిస్టేబుల్ సుమ (ఆశ) రంగంలోకి దిగుతుంది. ఆమెకు పై అధికారిగా వెన్నెల కిషోర్ (సంపత్) ఉంటాడు. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ అందరినీ మెప్పిస్తాయి. దొంగతనాల వెనుక ఎవరున్నారని తెలుసుకునేందుకు ఆశ జరిపిన విచారణ ప్రేక్షకులను మెప్పించేలా సరదాగానే కొనసాగుతుంది. థ్రిల్ ప్రాప్తిరస్తు క్యాప్షన్‌కు న్యాయం చేసేలా ప్రీఇంటర్వెల్ సీన్ అదరగొడుతుంది. ముఖ్యంగా సుమ, వెన్నెల కిషోర్, ఆది, రామ్ ప్రసాద్ సరదా సంభాషణలు నవ్వులను తెప్పిస్తే.. ప్రియదర్శి, ఆనంది చేసే చోరీలు తప్పకుండా థ్రిల్‌ను పంచుతాయి. పాటలు పెద్దగా మెప్పించవు. సెకండాఫ్ కొంచెం మైనస్. ఫైనల్‌గా ప్రేమంటే సినిమా అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ రైడ్ అని చెప్పొచ్చు.

ఎవరెలా చేశారంటే..?
ప్రియదర్శి కామెడీ, ఎమోషనల్ సీన్స్‌లలో చక్కగా బ్యాలెన్స్ చేస్తూ నటించారు. తెలుగమ్మాయి ఆనంది తన నటనతో దుమ్మురేపింది. ఫుల్ ఎనర్జీగా స్క్రీన్‌పై కనిపించడమే కాకుండా భావోద్వేగ సీన్స్‌లలో మెప్పించింది. ఈ మూవీకి మరో ప్రధాన బలం సుమ, వెన్నెల కిషోర్ జంట.. వీరిద్దరి మధ్య మరికొన్ని సరదా సీన్లు ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. సుమ వేసే పంచ్‌లకు వెన్నెల కిషోర్ ఇచ్చే రియాక్షన్ పంచ్‌లకు అదిరిపోయేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సీన్స్‌కు తగ్గట్లు సంగీతం ఉండటంతో ప్రెక్షకులు కనెక్ట్ అవుతారు. కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ ప్రేమంటే చిత్రంతో తన టాలెంట్ చూపించాడు. దొంగతనం సీన్స్ తెరకెక్కించిన తీరు భేష్ అనిపించేలా ఉంటాయి. 'ప్రేమంటే' థ్రిల్ ఉంటది.


