‘‘డ్యూడ్’(Dude) సినిమా రూ. 100 కోట్లు వసూళ్లు దాటేసింది. నేను నటించిన ‘లవ్ టుడే, డ్రాగన్’ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంత ఆదరించారో... ‘డ్యూడ్’కి అంతకంటే ఎక్కువ ఆదరణ అందించారు. మీరు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. నన్ను ఇంతలా ప్రోత్సహిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan ) చెప్పారు.
ఆయన హీరోగా మమితా బైజు(Mamitha Baiju) హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘డ్యూడ్’. శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘డ్యూడ్ బ్లాక్ బస్టర్ 100 కోట్ల జర్నీ’ ఈవెంట్‌లో వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘డ్యూడ్’ విజయం చాలా ఆనందాన్నిచ్చింది. మా సినిమాకి అన్ని భాషల్లో అద్భుతమైన స్పందన వచ్చింది. మా సంస్థలో దర్శకులుగా పరిచయమైన భరత్ కమ్మ, నితీష్ రానా, బుచ్చిబాబు పెద్ద దర్శకులు అయ్యారు. ఈ జాబితాలో కీర్తీశ్వరన్ ఉండటం ఆనందంగాఉంది’’ అని తెలిపారు.
‘‘మా సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి కృతజ్ఞతలు’’ అని కీర్తీశ్వరన్ అన్నారు. నిర్మాత ఎస్‌కేఎన్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, రచయిత కృష్ణ మాట్లాడారు.


