‘పెద్ది’ టికెట్ ధరల పెంపునకు పిటిషన్
ఉత్తర్వులివ్వని హైకోర్టు..
పిటిషన్ ఉపసంహరణ
పెద్ది సినిమా టికెట్ ధరలు పెంచేలా అధికారులకు ఆదేశాలివ్వాలని కోరుతూ మైత్రీ మూవీ మేకర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. న్యాయస్థానం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలనుకున్నారు. ఈ మేరకు హైకోర్టుకు తమ విజ్ఞప్తిని తెలియజేయడంతో..దానికి ధర్మాసనం అనుమతించింది.
జూన్ 4న విడుదలవుతున్న పెద్ది సినిమా టికెట్ ధరలను 7 రోజులపాటు పెంచుకోవడానికి అనుమతివ్వాలని కోరుతూ అధికారులకు నిర్మాణ సంస్థ వినతిపత్రం అందించింది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సుద్దాల చలపతిరావు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈనెల 15న వినతిపత్రం ఇచ్చి, 25న మరోసారి విజ్ఞప్తి చేసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.
ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజే వాదనలు వినిపిస్తూ దీనిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసినా తాము కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. గతంలో ఇలాంటి అంశంలోనే ఇదే హైకోర్టు సుమోటో కోర్టు ధిక్కరణ తీసుకుందని గుర్తుచేశారు. కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. అయితే పిటిషన్ ఉపసంహరణకు పిటిషనర్ కోరడంతో న్యాయమూర్తి అంగీకరించారు. ప్రస్తుతం జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. తెలంగాణలో టికెట్స్ ధరల పెంపు ఉండకపోవచ్చునని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


