డైరెక్షన్‌ టు టాలీవుడ్‌!

Other directors in to direct tollywood movies - Sakshi

పొరుగింటి డైరెక్టర్ల డైరెక్షన్‌ మారింది. వాళ్ల డైరెక్షన్‌ టాలీవుడ్‌కి మారింది. ఎక్కడెక్కడి డైరెక్టర్లు ఇప్పుడు తెలుగులోకి వస్తున్నారు. తెలుగులో భారీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీ, కోలీ, మాలీ, శాండల్‌... ఈ అన్ని వుడ్స్‌ డైరెక్టర్లు మన తెలుగులో సినిమాలు చేస్తున్నారు. ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం.

తెలుగు పరిశ్రమలో తెలుగు దర్శకులే ఉన్నారా? అంటే.. కాదు. పరభాషా దర్శకులు కూడా అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎక్కువమంది రావడం విశేషం. ‘బాహుబలి’ అద్భుత విజయం తర్వాత భారతీయ చిత్రపరిశ్రమ చూపు తెలుగుపై పడిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. తెలుగులో ప్యాన్‌ ఇండియన్‌ సినిమాల నిర్మాణం పెరిగింది. అందుకే ఇతర ఇండస్ట్రీల దర్శకులు కూడా కథలు రాసుకుని తెలుగు హీరోలకు వినిపిస్తున్నారు. తమ డైరెక్షన్‌ను టాలీవుడ్‌ వైపు తిప్పుకుంటున్నారు.

మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్‌ కెరీర్‌లో ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలది ప్రత్యేక స్థానం. ఈ రెండు చిత్రాలూ ఆయన్ను ఇతర భాషల్లోనూ పాపులర్‌ చేశాయి. ‘దృశ్యం’ సినిమా తమిళ రీమేక్‌ ‘పాపనాశం’ని తెరకెక్కించి, తమిళ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు జీతు. ఇందులో కమల్‌ హాసన్‌ నటించారు. ఇప్పుడు ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించి, తెలుగు చిత్రపరిశ్రమలోకి దర్శకుడిగా తొలి అడుగు వేశారు జీతు. తెలుగు ‘దృశ్యం’ (ఈ చిత్రానికి సుప్రియ దర్శకురాలు) పార్ట్‌ వన్‌లో హీరోగా నటించిన వెంకటేశ్‌.. రెండో పార్టులోనూ హీరోగా నటించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.

‘బాహుబలి’ బ్లాక్‌బస్టర్‌ ప్రభాస్‌ను ప్యాన్‌ ఇండియన్‌ స్టార్‌ని చేసింది. దీంతో పక్క ఇండస్ట్రీ దర్శకులు కూడా ప్రభాస్‌తో సినిమాలు చేయాలని ఉత్సాహం చూపిస్తున్నారు. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కూడా ప్రభాస్‌ కోసం ఓ కథ రాసి, వినిపించారు. ప్రభాస్‌కి కథ నచ్చడంతో ఈ కన్నడ దర్శకుడికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘సలార్‌’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. అలాగే బాలీవుడ్‌లో ‘తన్హాజీ’ చిత్రంతో టెక్నికల్‌గా మంచి గ్రిప్‌ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్‌’ అనే మైథాలజీ ఫిల్మ్‌ చేస్తున్నారు ప్రభాస్‌. ఇలా ఒకేసారి ఇద్దరు పక్క ఇండస్ట్రీ దర్శకులతో ప్రభాస్‌ సినిమాలు చేయడం విశేషం.

అలాగే హిందీ సినిమా ‘వార్‌’ ఫేమ్‌ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌తో ప్రభాస్‌ ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక 2021లో జరిగిన ఓ విశేషం.. శంకర్‌ తెలుగు సినిమా చేయనుండటం. ‘ఇండియన్‌’ ‘జీన్స్‌’, ‘రోబో’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’ ఇలా చెప్పుకుంటూ పోతే దర్శకుడు శంకర్‌ కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు చాలా ఉన్నాయి. ఈ చిత్రాలు తెలుగులో అనువాదమై సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. కానీ తన 28 ఏళ్ళ కెరీర్‌లో శంకర్‌ తెలుగులో స్ట్రయిట్‌ సినిమా చేయడం ఇదే మొదటిసారి. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా ఓ ప్యాన్‌ ఇండియన్‌ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రం ఓ సోషల్‌ డ్రామాగా రూపొందనుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.

ఇక తమిళంలో ఉన్న మంచి మాస్‌ దర్శకుల్లో లింగస్వామి ఒకరు. అందుకు ఓ నిదర్శనం విశాల్‌తో ఆయన తెరకెక్కించిన తమిళ చిత్రం ‘సండై కోళి’ (తెలుగులో ‘పందెంకోడి’). ఆ తర్వాత లింగుస్వామి తెలుగులో ఓ స్ట్రయిట్‌ ఫిల్మ్‌ తీయాలనుకున్నారు. ఓ సందర్భంలో అల్లు అర్జున్‌తో లింగు స్వామి సినిమా ఓకే అయిందనే టాక్‌ కూడా వినిపించింది. కానీ వీరి కాంబినేషన్‌లోని సినిమా సెట్స్‌పైకి వెళ్ళలేదు. ఇప్పుడు రామ్‌ హీరోగా లింగుస్వామి సినిమా చేసేందకు సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘అవళ్‌’ (తెలుగులో ‘గృహం’), ‘కాదల్‌ టు కల్యాణం’ వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించిన మిళింద్‌ రావ్‌ డైరెక్షన్‌లో రానా హీరోగా ఓ సినిమా రానుంది.

ఇందులో రానా పోలీసాఫీసర్‌ అనే ప్రచారం జరగుతోంది. ఇటీవల విడుదలైన రానా ‘అరణ్య’ చిత్రానికి దర్శకత్వం వహించింది కూడా తమిళ దర్శకుడు ప్రభు సాల్మాన్‌ కావడం విశేషం. వీళ్లు మాత్రమే కాదు.. మరికొందరు పరభాషా దర్శకులు తెలుగు సినిమాలు తెరకెక్కించే అవకాశం ఉంది. తెలుగులో పరభాషా కథానాయికలు, విలన్లు, సహాయ నటులు ఎక్కువమందే ఉన్నారు. ఇప్పుడు పొరుగింటి దర్శకుల జాబితా కూడా పెరుగుతోంది. మన తెలుగులో ప్రతిభావంతులు ఎక్కువే. అయితే ప్రతిభ ఎక్కడున్నా ప్రోత్సహించే మనసు ‘తెలుగు పరిశ్రమ’కు ఉంది కాబట్టే... ఇంతమంది పరభాషల వారు ఇక్కడ సినిమాలు చేయగలుగుతున్నారు.

వీళ్లూ వస్తారా?
తమిళ దర్శకులు అట్లీ, లోకేష్‌ కనగరాజ్‌ తాము తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నామని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఒక దశలో అట్లీ దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్, లోకేష్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తారనే వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఇరుంబుతిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) ఫేమ్‌ పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఓ సినిమా రూపొందనుందని ఎప్పట్నుంచో ప్రచారం సాగుతోంది. సో... వీళ్లూ తెలుగులోకి వచ్చే చాన్స్‌ ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top