
ఆపరేషన్ సిందూర్..ఇప్పుడు భారత్‌లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ ఇది. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఆత్మాహుతి డ్రోన్లు.. స్కాల్ప్ క్షిపణులు.. హ్యామర్ బాంబులతో విరుచుపడింది. ఆ దేశ పౌరులకు నష్టం కలిగించకుండా..కేవలం ఉగ్రవాదులను టార్గెట్‌గా చేసుకొని ఈ ఆపరేషన్ చేపట్టారు.భారత్-పాకిస్తాన్ మధ్య గతంలో జరిగిన యుద్ధాలు, మెరుపు దాడులు భారత సైన్యం యొక్క ధైర్యసాహసాలను ప్రపంచానికి చాటాయి. ఈ యుద్ధ గాథలు వెండితెరపై దేశభక్తి ఉట్టిపడే సినిమాలుగా మలిచాయి. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో, భారత్-పాక్ యుద్ధాల ఆధారంగా తెరకెక్కిన ఆర్మీ సినిమాలపై ఓ లుక్కేద్దాం.
బోర్డర్ (1997)
ఈ చిత్రం 1971 యుద్ధంలో లాంగేవాలా సరిహద్దు పోస్ట్‌ను రక్షించిన 120 మంది భారతీయ సైనికుల ధైర్యసాహసాలను తెలియజేస్తుంది . వారు పాకిస్తాన్ యొక్క భారీ ట్యాంక్ రెజిమెంట్‌ను ఎదుర్కొని, రాత్రంతా పోరాడి, ఉదయం భారత వైమానిక దళ సహాయంతో విజయం సాధించారు. ఈ సినిమా దేశభక్తి గీతాలు, ఉద్వేగభరిత సన్నివేశాలు మరియు యుద్ధ దృశ్యాలతో బాక్సాఫీస్ విజయం సాధించింది. “సందేశే ఆతే హై” గీతం ఇప్పటికీ దేశభక్తి గీతాలలో ఒక ఐకాన్‌గా నిలిచింది. సన్నీ డియోల్, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జేపీ దత్తా దర్శకత్వం వహించారు.
లక్ష్య (2004)
ఈ చిత్రం కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు టైగర్ హిల్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్న సంఘటనలను చిత్రీకరిస్తుంది. హృతిక్ రోషన్ పోషించిన కరణ్ షెర్గిల్ అనే లక్ష్యం లేని యువకుడు సైన్యంలో చేరి, యుద్ధంలో హీరోగా మారే ప్రయాణం ఈ సినిమా కథాంశం. ఈ సినిమా యువతను సైన్యంలో చేరేందుకు ప్రేరేపించింది మరియు దేశభక్తితో పాటు వ్యక్తిగత పరివర్తనను కూడా చూపించింది. హృతిక్ రోషన్, ప్రీతి జింటా, అమితాబ్ బచ్చన్ నటించిన ఈ చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించారు.
1971 (2007)
ఈ చిత్రం 1971 యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం చేతిలో ఖైదీలుగా ఉన్న ఆరుగురు భారతీయ సైనికుల కథను చెబుతుంది. వారు తమ దేశానికి తిరిగి రావడానికి చేసిన ప్రయత్నాలు, త్యాగాలను ఈ సినిమా చిత్రీకరిస్తుంది. ఈ చిత్రం యుద్ధ ఖైదీల జీవితాలలోని కష్టాలను మరియు వారి ధైర్యాన్ని వాస్తవికంగా చూపించింది. దర్శకుడు: అమృత్ సాగర్ ; నటీనటులు: మనోజ్ బాజ్‌పాయ్, రవి కిషన్, దీపక్ దోబ్రియాల్
ది గాజీ అటాక్ (2017)
ఈ చిత్రం 1971 యుద్ధంలో భారత నావికాదళ సబ్‌మెరైన్ INS కరంజ్, పాకిస్తాన్ సబ్‌మెరైన్ PNS గాజీ మధ్య జరిగిన జల యుద్ధాన్ని చిత్రీకరిస్తుంది. భారత నావికాదళం విశాఖపట్నం ఓడరేవును రక్షించడానికి చేసిన ప్రయత్నాలను ఈ సినిమా ఉత్కంఠభరితంగా చూపిస్తుంది. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడు: సంకల్ప్ రెడ్డి; నటీనటులు: రానా దగ్గుబాటి, కే కే మీనన్, అతుల్ కులకర్ణి.
ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ (2019)
ఈ చిత్రం 2016లో జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో తెరకెక్కింది. “హౌస్ ది జోష్?” అనే డైలాగ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఆధునిక యుద్ధ వ్యూహాలు, సైనిక సామర్థ్యం మరియు దేశభక్తిని చూపించడంలో విజయవంతమైంది. దర్శకుడు: ఆదిత్య ధర్; నటీనటులు: విక్కీ కౌశల్, యామి గౌతమ్, పరేష్ రావల్
షేర్షా (2021)
ఈ చిత్రం కార్గిల్ యుద్ధంలో పరమవీర చక్ర గ్రహీత కెప్టెన్ విక్రమ్ బత్రా జీవితం ఆధారంగా రూపొందింది. విక్రమ్ బత్రా యొక్క ధైర్యం, నాయకత్వం , త్యాగాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. “యే దిల్ మాంగే మోర్” అనే విక్రమ్ బత్రా యొక్క ప్రసిద్ధ నినాదం ఈ సినిమాతో మళ్లీ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి విష్ణువర్దన్ దర్శకత్వం వహించగా.. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ కీలక పాత్రలు పోషించారు.
‘ఆపరేషన్ వాలెంటైన్’(2024)
పుల్వామా ఉగ్రవాద దాడి, ఆ తర్వాత భారత వైమానిక దళం చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడి నేపథ్యంలో ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) సినిమా తెరకెక్కింది. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ (Varun Tej), మానుషి చిల్లర్ (Manushi Chhillar) ప్రధాన పాత్రల్లో నటించారు.