O2 Telugu Movie Review: పెళ్లి తర్వాత నయన తార మొదటి చిత్రం.. 'ఓ2' రివ్యూ.. ఎలా ఉందంటే ?

Nayanthara O2 Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: ఓ2 (O2-ఆక్సిజన్‌)
నటీనటులు: నయన తార, రిత్విక్‌ జోతిరాజ్‌, భరత్ నీలకంఠన్‌ తదితరులు
దర్శకత్వం: జీఎస్‌ విక్నేష్‌
సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: తమిళ ఎ అళగన్
విడుదల తేది: జూన్‌ 17, 2022 (డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌)

లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార ఇటీవల ప్రముఖ డైరెక్టర్‌ విఘ్నేష్ శివన్‌ పెళ్లి చేసుకుని ఓ ఇంటి కోడలైంది. పెళ్లికి ముందు విఘ్నేష్‌ దర్శకత్వంలో వచ్చిన 'కణ్మని రాంబో ఖతిజా' సినిమాతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా 'ఓ2 (O2, ఆక్సిజన్‌)' సినిమాతో నేరుగా ఓటీటీలో సందడి చేస్తోంది. జీఎస్‌ విక్నేష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌ 17 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. నయన తార పెళ్లి తర్వాత విడుదలకావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలకు తగినట్లుగా ఓ2 (O2) ఉందా? లేదా? రివ్యూలో చూద్దాం.

O2 Telugu Movie Review

కథ:
ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్‌. పార్వతి (నయన తార) కొడుకు వీర (రిత్విక్‌ జోతిరాజ్‌) ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతుంటాడు. ఆక్సిజన్‌ సిలిండర్‌ లేకపోతే వీరకు ఊపిరి అందదు. వీరిద్దరు అవయవ దానానికి సంబంధించిన ఆపరేషన్‌ కోసం చిత్తూరు నుంచి కొచ్చిన్‌కు బస్సులో వెళతారు. బస్సు ప్రయాణిస్తున్న దారిలో వర్షం కారణంగా కొండ చరియలు విరిగిపడి రోడ్డుతో సహా మట్టిలోకి కూరుకుపోతుంది. ఈ బస్సు జర్నీలో లేచిపోవాలనుకునే ప్రేమ జంట, మాజీ ఎమ్మెల్యే, పోలీసు ఇలా ఉంటారు. ఈ ప్రమాదం నుంచి ఎవరు బతికారు ? ఆక్సిజన్‌ దొరకనప్పుడు మనుషుల మానసిక స్థితి ఎలా ఉంటుంది ? ఆ స్థితిలో వారు ఏం చేయడానికి సిద్ధపడతారు ? తన కొడుకు వీరను పార్వతి ఎలా కాపాడుకుంది ? అనే విషయాలు తెలియాలంటే కచ్చితంగా ఓ2 (O2) చూడాల్సిందే.

O2 Movie Cast

విశ్లేషణ:
మానవ మనుగడకు ప్రాణదారం ఆక్సిజన్. ఈ సందేశంతో ఆక్సిజన్ దొరక్కపోతే మనుషుల మానసిక స్థితి ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. మట్టిలో కూరుకుపోయిన ఒక బస్సు, అందులో విభిన్న మనసత్వాలు ఉన్న వ్యక్తులు ఎలా బతికి బయటపడ్డారనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ పాయింట్‌ను తెరకెక్కించడంలో డైరెక్టర్‌ కొంతవరకే సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. మట్టిలో బస్సు కూరుకుపోయాక వచ్చే సీన్లు బాగున్నాయి. అయితే బస్సు లోయలో పడిపోయిందనే విషయం రెస్క్యూ టీమ్‌కు తెలియడం, తర్వాత వారి చర్యలు అంతా ఆసక్తిగా అనిపించవు. అక్కడక్కడా స్క్రీన్‌ ప్లే కాస్తా స్లో అయినట్లు అనిపిస్తుంది. ఇలాంటి తరహాలో వచ్చే సౌత్ ఇండియా సినిమాల్లో క్లైమాక్స్‌ను ఊహించడం పెద్ద కష్టం కాదు. కానీ సన్నివేశాలను మరింత గ్రిప్పింగ్‌గా, కొన్ని మలుపులతో కథ రాసుకుంటే ఇంకా బాగుండేది. 

ఎవరెలా చేశారంటే?
నయన తార నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొడుకును కాపాడుకునే తల్లిగా నయన తార అదరగొట్టింది. అలాగే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న వీర పాత్రలో మాస్టర్‌ రిత్విక్‌ జోతిరాజ్‌ నటన ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్లలో రిత్విక్ యాక్టింగ్‌ హత్తుకునేలా ఉంటుంది. మిగతా నటీనటుల నటన కూడా బాగుంది. విశాల్ చంద్రశేఖర్‌ బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే బస్సులోని సీన్లు విజువల్‌గా బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్‌గా తమిళ్ ఎ. అళగన్‌ పనితనం చక్కగా కనిపిస్తుంది. 'దేవుడిచ్చిన లోపాన్ని కూడా.. తల్లి సరిచేయగలదు' అనే డైలాగ్‌ ఎమోషనల్‌గా హత్తుకుంటుంది. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఒక డిఫరెంట్‌ థ్రిల్లర్‌ను చూసిన అనుభూతి కలుగుతుంది.

-సంజు (సాక్షి వెబ్‌ డెస్క్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top