టాలీవుడ్ హీరో నాగచైతన్య చివరగా తండేల్ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం వృషకర్మ మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే టాలీవుడ్‌లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన లాల్ సింగ్ చద్దా (2022) మూవీతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ హిందీ సినిమా ట్రై చేయలేదు చై.
కారణమంటూ ఏం లేదు
బాక్సాఫీస్ వైఫల్యం వల్లే అతడు మళ్లీ హిందీ సినిమా చేయడానికి భయపడుతున్నాడని ప్రచారం జరిగింది. దానిపై నాగచైతన్య తాజాగా స్పందించాడు. అతడు మాట్లాడుతూ.. నేను హిందీలో మళ్లీ మూవీ చేయకపోవడానికి ప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు. తెలుగులో బిజీ అయిపోయానంతే! మళ్లీ మంచి అవకాశం వస్తే తప్పకుండా బాలీవుడ్‌లో యాక్ట్ చేస్తాను. లాల్ సింగ్ చద్దా వైఫల్యం వల్ల మాత్రం నేను వెనకడుగు వేయలేదు.
చాలా ఎంజాయ్ చేశా
ఆ మూవీ షూటింగ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. అక్కడి జనం దగ్గరినుంచి ఎంతో నేర్చుకున్నాను, వాళ్లు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆ అనుభవం మాటల్లో చెప్పలేను. ఇక సినిమా రిజల్ట్ అంటారా? బాక్సాఫీస్ వద్ద ఒడిదుడుకులు సహజం అని అర్థం చేసుకునేంత పరిణతి మాకుందని భావిస్తున్నాను. ఈ ఫలితాలు మా లక్ష్యసాధనను ఏమాత్రం అడ్డుకోలేవు. సక్సెస్, ఫెయిల్యూర్ నా మైండ్‌సెట్‌ను మార్చలేవు అని నాగచైతన్య పేర్కొన్నాడు.


