నా కడుపులో తన్నాడు, మెడ పట్టుకుని గెంటేశాడు!: నటి | Naagin 2 Actor Arzoo Govitrikar Filed Divorce With Her Husband | Sakshi
Sakshi News home page

Arzoo Govitrikar: కడుపులో తన్నాడు, కులం పేరుతో దూషించాడు

Aug 5 2021 10:02 AM | Updated on Aug 5 2021 11:52 AM

Naagin 2 Actor Arzoo Govitrikar Filed Divorce With Her Husband - Sakshi

పెళ్లైన రెండేళ్ల తర్వాత సిద్ధార్థ్‌ తొలిసారిగా నా మీద చేయెత్తాడు, కడుపులో తన్నాడు. నన్ను దారుణంగా కొట్టిన రోజులున్నాయి..

Arzoo Govitrikar: భర్త వేధింపులు, హింసను భరించలేకపోతున్నానంటోంది హిందీ నటి అర్జూ గోవిత్రికర్‌. ఈ క్రమంలో భర్త సిద్ధార్థ్‌ శబర్వాల్‌ నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. కాగా అర్జూ 2019లో గృహహింస కింద భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఈ రెండేళ్ల కాలంలో అతడిలో మార్పు లేకపోగా మరింత హింసకు పాల్పడుతుండటంతో విడిపోవడానికే నిశ్చయించుకుంది.

ఈ సందర్భంగా అర్జూ గోవిత్రికర్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'అవును, నేను విడాకుల కోసం దరఖాస్తు చేశాను. ఇప్పటివరకు నేను భరించింది చాలు. ఎంతో ప్రయత్నించి చూశాను కానీ సిద్దార్థ్‌తో కలిసుండటం సాధ్యపడదు అనిపిస్తోంది. మా మధ్య పెరుగుతున్న దూరం గురించి నేనెప్పుడూ మీడియాతో మాట్లాడలేదు. కానీ ఈరోజు మాట్లాడి తీరతాను. నా భర్త నన్ను మెడ పట్టుకుని ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి ప్రయత్నించాడు. అతడు నాపై చేయి చేసుకున్నాడు, కట్టుకున్నదాన్ని అని చూడకుండా కడుపులో తన్నాడు. అంతెందుకు, నన్ను విచక్షణారహితంగా కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. కానీ నేనెప్పుడూ ఆ గాయాలను బయటకు చూపించాలనుకోలేదు.

పెళ్లైన రెండేళ్ల తర్వాత సిద్ధార్థ్‌ తొలిసారిగా నా మీద చేయెత్తాడు. ఆ తర్వాత కొడుకు పుట్టిన మూడేళ్లకు అతడు వేరే గదిలో నిద్రించడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో అతడికో రష్యన్‌ ప్రియురాలు ఉందని తెలిసింది. అతడు ఒంటరిగా ఆ గదిలో ఆమెతో చాటింగ్‌ చేస్తున్నాడని అర్థమైంది. ఇదే విషయాన్ని నేరుగా అతడి దగ్గరకు వెళ్లి నిలదీశాను, కానీ ప్రయోజనం లేకపోయింది. కానీ వాళ్లు కలిసుంటున్నారా? విడివిడిగా ఉంటున్నారా? అన్నది నాకు తెలీదు.

అతడి చాటింగ్‌, నా మీద దాడి చేసిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు మాత్రం నా దగ్గర ఉన్నాయి. ఈ ఆధారాలే నాకు అంతో ఇంతో న్యాయం చేస్తాయని ఆశిస్తున్నాను' అని అర్జూ చెప్పుకొచ్చింది. తనను కులం పేరుతో కూడా దూషించేవాడని ఆమె ఆరోపిస్తోంది. ఇక ఈ ఆరోపణలను సిద్ధార్థ్‌ తోసిపుచ్చాడు. 'ఆమెకు ఏం కావాలో అది చెప్పనివ్వండి. ఈ విషయంపై నేనేమీ మాట్లాడదల్చుకోలేదు' అని పేర్కొన్నాడు. కాగా అర్జూ గోవిత్రికర్‌ బాగ్బాన్‌, నాగిని 2లో నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement