టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా నటించిన రెండో చిత్రం ‘మోగ్లీ’. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటించగా.. బండి సరోజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. నేడు (డిసెంబర్ 13) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి..మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

మోగ్లీ (రోషన్ కనకాల) ఓ అనాథ. పార్వతీపురం గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో ఉంటూ.. ఎప్పటికైనా పోలీసు కావాలనే ఆశతో బతికేస్తుంటాడు. బతుకుదెరువు కోసం తన ప్రాణ స్నేహితుడు బంటి(వైవా హర్ష)తో కలిసి సినిమా షూటింగ్స్‌కి జూనియర్ ఆర్టిస్టులను అందిస్తూ..రిస్కీ సీన్లకు హీరో డూప్‌గా నటిస్తుంటాడు. అలా ఓ సినిమా షూటింగ్‌లో సైడ్ డ్యాన్సర్‌గా వచ్చిన జాస్మిత్(సాక్షి మడోల్కర్)తో ప్రేమలో పడతాడు. ఆమెకు వినికిడి లోపంతో పాటు మాటలు కూడా రావు. జాస్మిత్ కూడా మోగ్లీని ఇష్టపడుతుంది. అదే సమయంలో ఎస్సై క్రిప్టోఫర్ నోలన్(బండి సరోజ్ కుమార్).. జాస్మిత్‌పై మోజు పడతాడు. ఆమెను వాడుకోవాలని చూస్తాడు. అమ్మాయిల పిచ్చి ఉన్న ఎస్సై నోలన్ బారీ నుంచి జాస్మిత్‌ని మోగ్లీ ఎలా కాపాడుకున్నాడు? నోలన్ నుంచి మోగ్లీకి ఎదురైన సవాళ్లు ఏంటి? కర్మ సిద్ధాంతానికి ఈ కథకి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
సందీప్ రాజ్ గతంలో తెరకెక్కించిన కలర్ ఫోటో సినిమా మాదిరే.. ఇది కూడా ప్యూర్ అండ్ ఇన్నోసెన్స్ లవ్‌స్టోరీ. సినిమా షూటింగ్ నేపథ్యంలో కథనం సాగుతుంది. అయితే కర్మ సిద్దాంతం టాపిక్‌ని ఈ ప్రేమకథకి యాడ్ చేయడం కొత్త ప్రయత్నం. ఇదొక్కటి తప్పితే.. మిగతా స్టోరీ అంతా రొటీనే. హీరో తొలి చూపులోనే హీరోయిన్‌తో ప్రేమలో పడడం.. విలన్ ఆమెపై మోజు పడడం.. చివరకు హీరో అతన్ని అంతం చేయడం.. ఇలా గతంలో చాలా ప్రేమ కథలు వచ్చాయి. మోగ్లీ కథనం కూడా అలాగే సాగుతుంది. సినిమా చూస్తున్నంత సేపు సందీప్ తెరకెక్కించిన కలర్‌ఫోటోతో పాటు జయం, వాన..లాంటి సినిమాలు గుర్తుకు వస్తుంటాయి. టేకింగ్ మాత్రం కొత్తగా అనిపిస్తుంది.
బండి సరోజ్ కుమార్ పాత్రను భయంకరంగా చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఎస్సై నోలన్‌కు అమ్మాయిలంటే పిచ్చి అనేది ఒకే ఒక సీన్‌తో చూపించాడు. ఆ తర్వాత మోగ్లీగా హీరోగా పరిచయ సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. అతని నేపథ్యం కాస్త ఎమోషనల్‌కు గురి చేస్తుంది. హీరో హీరోయిన్లు ఇద్దరు ప్రేమలో పడినప్పటి నుంచి కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. సినీ నిర్మాత..హీరోయిన్‌పై మోజు పడడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. కానీ ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు మాత్రం సాగదీతగా అనిపిస్తాయి. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఓ ట్విస్టు ఆకట్టుకుంటుంది. ఇక ద్వితియార్థం ప్రారంభంలో కథనం పరుగులు పెట్టినా.. కాసేపటికే మళ్లీ సాగదీత సన్నివేశాలతో నెమ్మదిగా సాగుతుంది. పోలీసు స్టేషన్ సీన్ ఒక్కటి బాగుంటుంది కానీ దాన్ని కూడా మరీ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో కర్మ సిద్దాంతాన్ని జోడిస్తూ.. సాగే సన్నివేశాలు బాగుంటాయి.

ఎవరెలా చేశారంటే..
మోగ్లీ పాత్రకి రోషన్ న్యాయం చేశాడు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. తొలి సినిమాతో పోలిస్తే..ఇందులో నటన పరంగా చాలా మెచ్యూరిటీ కనిపించింది. సినిమా కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపించింది. ఇక చెవిటి, మూగ అమ్మాయి జాస్మిత్‌లాగా సాక్షి మడోల్కర్ బాగా చేసింది. ఇక విలన్‌గా బండి సరోజ్ కుమార్ ఇరగదీశాడు. హీరో రేంజ్‌లో ఆయన పాత్రకు ఎలివేషన్స్ ఉన్నాయి. వైవా హర్ష నవ్వించడంతో పాటు కొన్ని చోట్ల ఎమోషనల్‌కు గురి చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కాలభైరవ సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లను ప్రాణం పోశాడు. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.


