Son Of India: 'ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్‌ అయితే మేం అసమర్థులం కాదు'

Mohan Babu Comments On Son Of India Pre Release Event - Sakshi

‘‘సినిమా నా ఊపిరి’ అని మా గురువు (దాసరి నారాయణరావు)గారు అన్నారు. నా కుటుంబానికి సినిమా ఊపిరి. పొట్టచేత పట్టుకుని ఇక్కడికి వచ్చాం. నటుడిగా, నిర్మాతగా సంపాదించినదాన్ని విద్యా సంస్థల్లో పెట్టాం. అంచలంచెలుగా ఎదిగి అది ఓ యూనివర్సిటీ అయింది. ఇంతకంటే విజయాల గురించి చెప్పదలచుకోలేదు’’ అని నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు అన్నారు. మోహన్‌బాబు హీరోగా నటించిన చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో ఇంకా మోహన్‌బాబు మాట్లాడుతూ – ‘‘1982లో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ను స్థాపించి, నేనే నిర్మాతగా, హీరోగా ఓ సినిమా తీయాలని ఏ ధైర్యంతో అనుకున్నానో అనుకున్నాను. అప్పటి టాప్‌ రైటర్‌ ఎమ్‌డీ సుందర్‌గారు ఓ 50 కథలు చెప్పారు.. నచ్చలేదు. అప్పుడు కన్నడంలో రాజ్‌కుమార్‌గారి ‘అనబలం జనబలం’ సినిమా కథ విని, ఓకే అన్నాను.. ‘ఈ సినిమాకు నేనే కథ ఇచ్చాను. అక్కడ ఆశించిన ఫలితం రాలేదు. ఆలోచించండి’ అని సుందర్‌గారు అన్నారు. అయినా చేస్తానని రిస్క్‌ తీసుకున్నాను.. ఒకవేళ సినిమా ఫ్లాప్‌ అయితే ఇళ్లు అమ్ముకుని వెళ్లాల్సిందే. అది హిట్‌ అయింది. ఆది శేషగిరిరావు (నటుడు కృష్ణ సోదరుడు)గారు ‘సినిమా చూశాను.. ఓ పెద్ద సినిమా చెబుతాను. ఆ సినిమాపై వెయ్‌’ అన్నారు. నా సినిమాయే హిట్టయింది.

ఆ సినిమా పేరు ఇప్పుడు అనవసరం. ఓ పెద్ద సినిమాకు పోటీగా నా సినిమాను విడుదల చేసి, రిస్క్‌ చేశాను. నా రిస్క్‌ చేసే తత్వమే నన్ను నిలబెట్టింది. జీవితంలో రిస్క్‌ చేయకపోతే ముందుకు సాగలేం. ఇక డైమండ్‌ రత్నబాబు ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ కథ చెప్పగానే విష్ణుకు ఫోన్‌ చేసి, సినిమా తీద్దాం అన్నాను. ప్రతి విషయానికి ఆలోచించమనే విష్ణు ఏమీ అనకుండా, వెంటనే ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ లోగో వేసి పంపాడు. అయితే ఈ సినిమా కాస్త రిస్కే అన్నాడు విష్ణు. ఇందులో ఫ్యామిలీయే కాదు... రాజకీయ అంశాలను ప్రస్తావించాం. ఈ చిత్రంలో ప్రైవేట్‌ జైలు అనే కొత్త కాన్సెప్ట్‌ను ప్రయత్నించాం.

రిస్క్‌ తీసుకుని సినిమా చేశాం. ఒకవేళ ఫ్లాప్‌ అయితే మేం అసమర్థులం కాదు. రిస్క్‌ తీసుకున్నాం’’ అన్నారు. డైమండ్‌ రత్నబాబు మాట్లాడుతూ– ‘‘రాయలసీమ రామన్నచౌదరి’ సినిమా చూసి ఇన్‌స్పయిర్‌ అయి, ఇండస్ట్రీకి వచ్చాను. ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ సినిమాతో ఓ సందేశం ఇద్దామని అనుకున్నాం’’ అన్నారు.‘‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ ఓ కొత్త ప్రయత్నం’’ అన్నారు మంచు విష్ణు. ఇంకా ఈ వేడుకలో మంచు లక్ష్మీ, నటులు పోసాని కృష్ణమురళి, అలీ, సునీల్, దర్శకులు కోదండ రామి రెడ్డి, ఛాయాగ్రాహకుడు, దర్శకుడు ఎస్‌. గోపాల్‌రెడ్డి, దర్శకుడు బి. గోపాల్, తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top