
‘‘నాకు నా హార్డ్‌వర్క్‌పై పూర్తి నమ్మకం ఉంది. ఈ బర్త్ డే (మే 20) నుంచి నాకు ఇది కొత్త జన్మ. నా బర్త్ డే స్టార్ట్ కాక ముందే నేను ఏదైతే స్టేజ్ (సినిమా వేదిక) మిస్సవుతున్నానో ఆ స్టేజ్‌కు తీసుకువచ్చాడు దేవుడు. అంతకంటే పెద్ద బర్త్ డే గిఫ్ట్ ఏదీ ఉండదు’’ అని మంచు మనోజ్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన చిత్రం ‘భైరవం’. జయంతిలాల్ గడా సమర్పణలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. అలాగే నేడు (మంగళవారం) మంచు మనోజ్ బర్త్ డే. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో మనోజ్ పంచుకున్న విశేషాలు.
⇒ ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో తమ్ముడు శ్రీనివాస్ (బెల్లంకొండ సాయి) నన్ను కలవడం, ‘గరుడన్ ’ సినిమా తెలుగు రీమేక్ ‘భైరవం’ గురించి దర్శకుడు విజయ్‌తో మాట్లాడమని చెప్పడం, కథ నచ్చి, నేనీ సినిమాకు ఓకే చెప్పడం చకా చకా జరిగిపోయాయి. ∙ఈ చిత్రంలో నేను గజపతి వర్మ అనే క్యారెక్టర్ చేశాను. ‘భైరవం’ని డైరెక్టర్ విజయ్ బాగా తీశాడు. యాక్టర్స్‌గా నాకు, శ్రీనివాస్, నారా రోహిత్‌గారికి కొంత స్క్రీన్ గ్యాప్ వచ్చింది. అయినా మాతో రాధామోహన్ గారు మంచి మూవీ నిర్మించారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాల్సిన అవసరం ఉంది.
⇒ నా జీవితంలో నాకు మా నాన్నే హీరో (ప్రముఖ నటుడు–నిర్మాత మోహన్ బాబు). నాన్నగారు కష్టపడి, పోరాడి ఇంత గొప్ప స్థాయికి వచ్చింది మనందరం చూశాం. ఆయన్ను చూస్తూ పెరిగాను. నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకున్నాను. నమ్మినవాళ్లను బాగా చూసుకోవడం, వాళ్లతోనే ఉండటం, పదిమందికి హెల్ప్ చేయడం, స్కూల్‌ని బిల్డ్ చేయడం... ఇలా నాన్నగారు చాలా చేశారు. ఇక దాన్నుంచి (ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల గురించి కావొచ్చు) నేను బయటకు రాలేకపోతున్నాను. విష్ణు అన్న నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అయితే ఏ సిట్యువేషన్ లోనైనా మాట్లాడి, ఆ పరిస్థితులను ఎలా సెట్ చేయవచ్చో విష్ణు అన్న దగ్గర్నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాను. అలాగే సమస్యలను పరిష్కరించడానికి మాట్లాడాలంటే నేను సిద్ధంగా ఉన్నాను.
⇒ నేను తిరుపతిలో చదువుకున్నాను. తను (భార్య మౌనిక) ఆళ్లగడ్డలో చదువుకున్నారు. ఈ సిటీ జీవితమే కాకుండా మాకు పల్లె జీవితం కూడా ఉంది. అక్కడి ప్రజల ప్రేమాభిమానాలు, ఆదరణ మాపై ఉన్నాయి. మా పిల్లలకు ఏదైనా ఇవ్వగలను అంటే అది ఇదే.
⇒ నేను సమస్యల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చాలామంది ఫోన్ చేశారు. కానీ నా ఇబ్బందుల్లో వారిని ఇన్ వాల్వ్ చేయాలనుకోలేదు. నా భార్య మౌనిక సపోర్ట్ సరిపోయింది. మనపై తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు గమ్మునుండిపోతే, తప్పు చేసిన వ్యక్తులుగా మిగిలిపోతాం. భవిష్యత్‌లో మా పిల్లలు ‘నువ్వు చేయనప్పుడు ఎందుకు గమ్మునున్నావ్’ అంటే, ఓ బ్యాడ్ ఎగ్జాంపుల్‌గా ఉండకూడదనిపించింది. తప్పు చేయనప్పుడు ఎక్కడైనా మాట్లాడగలను.