
మహావతార్ నరసింహ.. వెండితెరపై ఇప్పటికీ అద్భుతాలు సృష్టిస్తూనే ఉంది. ప్రమోషన్లు లేవు, హైప్ లేదు, బడ్జెట్ కూడా తక్కువే.. అందులోనూ భారీ సినిమాలతో పోటీ.. అన్నింటినీ తట్టుకుని నిలబడింది. యానిమేషన్ మూవీ అయినా రికార్డులు భారీ కలెక్షన్లు రాబడుతూ రికార్డులు తిరగరాస్తోంది. జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ గతవారం క్రితమే రూ.200 కోట్ల మైలురాయిని దాటేసింది. హరిహర వీరమల్లు, కింగ్డమ్ చిత్రాల పోటీని తట్టుకుని బలంగా నిలబడింది.
నవంబర్‌లో సెట్స్‌పైకి
ఇటీవలే రిలీజైన వార్ 2, కూలీ సినిమాల కాంపిటీషన్‌ను సైతం తట్టుకుని ఇంకా వెండితెరపై మ్యాజిక్ చేస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రదర్శకుడు తన నెక్స్ట్ మూవీని ప్రకటించాడు. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో శ్రీవిష్ణువు దశావతారాల ఆధారంగా సినిమాలు తెరకెక్కనున్నాయని గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే! అందులో భాగంగా తన రెండో సినిమా మహావతార్ పరశురామ్‌ను నవంబర్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్తున్నట్లు ప్రకటించాడు.
నాకంటూ క్లారిటీ ఉంది
వ్యవస్థ తప్పుదారిలో వెళ్తున్నప్పుడు దాన్ని సరిదిద్దేందుకు నిలబడ్డ హీరో పరశురామ్. ఇది చాలా శక్తివంతమైన కథ. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ కూడా మొదలైంది. నరసింహ సినిమా సక్సెస్‌తో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రజల ప్రేమను చూస్తుంటే ఇలాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలనిపిస్తోంది. నాపై ఒత్తిడి ఉంది. కాకపోతే ఇంకా ఏడు సినిమాలు తీయాలన్న క్లారిటీ కూడా ఉంది. అయితే అన్నీ యానిమేషన్స్ తీయాలనుకోవడం లేదు. కనీసం రెండు చిత్రాలైనా లైవ్ యాక్షన్ ఫిలింస్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.
పరశురామ్‌పై రెండు సినిమాలు
ఇదిలా ఉంటే పరశురామ జీవితకథపై హిందీలో మహావతార్ టైటిల్ పేరిట ఓ సినిమా తెరకెక్కుతోంది. ఛావాతో ప్రేక్షకుల్ని మెప్పించిన విక్కీ కౌశల్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది క్రిస్‌మస్‌కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ రెండు పరశురామ్ చిత్రాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద నెగ్గుతుందో చూడాలి!