
తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ హిట్ కొట్టి చాన్నాళ్లయింది. గత కొన్నేళ్లలో ఘోరమైన డిజాస్టర్స్ ఇచ్చాడు. ఈ ఏడాది 'సికిందర్' అనే హిందీ మూవీ చేశాడు గానీ ఇది ఫెయిల్ కావడానికి హీరో సల్మాన్ ఖాన్ కారణమని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు 'మదరాసి' అనే తమిళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శివకార్తికేయన్, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఎలా ఉంది? మురుగదాస్ కమ్ బ్యాక్ ఇచ్చాడా? అనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
తమిళనాడులో గన్ కల్చర్ తీసుకురావాలనేది విరాట్(విద్యుత్ జమ్వాల్) అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్లాన్. ఇందులో భాగంగా గన్స్ ఉన్న ఆరు కంటెయినర్లని రాష్ట్రంలోకి తీసుకొస్తుంటాడు. ఈ సంగతి ఎన్ఐఏ(NIA)కి తెలుస్తుంది. ఆఫీసర్ ప్రేమ్(బిజు మేనన్).. తన టీమ్‌తో కలిసి వీటిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ పెద్ద గొడవ. ఆఫీసర్ ప్రేమ్ తీవ్ర గాయాలపాలవుతాడు. మరోవైపు లవ్ ఫెయిలైందని రఘు(శివకార్తికేయన్) ఆత్మహత్యాయత్నం చేస్తాడు. ఫ్లైఓవర్ పై నుంచి దూకేస్తాడు. ఇతడికీ గాయాలవుతాయి. అనుకోకుండా ప్రేమ్-రఘని ఒకే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకొస్తారు. తర్వాత ప్రేమ్ లీడ్ చేస్తున్న మిషన్‌లోకి రఘు ఎలా ఎంటర్ అయ్యాడు? రఘు ప్రేమించిన మాలతి (రుక్మిణి వసంత్) ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఏఆర్ మురుగదాస్ హిట్ కొట్టి చాలాకాలమైంది. ఇతడిపై ఎవరికీ పెద్దగా నమ్మకాల్లేవు. కానీ 'మదరాసి'పై కాస్తోకూస్తో హైప్ ఉందంటే అదంతా హీరో శివకార్తికేయన్ వల్లే. మరి ఈ సినిమా ఎలా ఉంది అంటే బాగుంది అంతే. మరీ సూపర్ కాదు, అలా అని తీసిపారేయదగ్గ మూవీ కాదు. పోలిక కాదు గానీ మురుగదాస్ గతంలో తీసిన 'తుపాకీ' గుర్తొస్తుంది. బహుశా రెండింటిలోనూ ఒకే విలన్ ఉండటం వల్లే ఏమో!
'మదరాసి'లో విలన్‌కి హీరోకి ఏ మాత్రం సంబంధం ఉండదు. తనకున్న సమస్యతో తన బాధేదో తను పడుతుంటాడు. అలాంటి హీరో.. ఎన్ఐఏ అధికారులతో ఎందుకు కలిసి పనిచేయాల్సి వచ్చింది? చివరకు ఏమైంది అనే పాయింట్‌తో తీశారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌లా సినిమా తీయాలని ఫిక్సయ్యారు. లవ్‌స్టోరీ కూడా పెట్టారు కానీ ఇదెందుకో అంతగా అతకలేదు. లవ్ సీన్స్ అన్నీ సాగదీసినట్లు అనిపిస్తాయి. ఫస్టాప్ బాగుంటుంది. హై మూమెంట్‌తో ఇంటర్వెల్ పడుతుంది.
సెకండాఫ్‌కి వచ్చేసరికి యాక్షన్ పార్ట్ ఎక్కువైంది. స్టోరీ తక్కువైంది. కానీ చూడటానికి బాగానే ఉంటుంది. సెకండాఫ్ మధ్యలోనే స్టోరీ అయిపోతుంది. కానీ అక్కడి నుంచి మరో అరగంట సినిమా సాగుతూ వెళ్తుంది. మురుగదాస్ గత చిత్రం 'సికిందర్'తో పోలిస్తే ఇది పర్వాలేదనిపిస్తుంది. స్టోరీలో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ ఓవరాల్‌గా చూసేటట్టుగానే ఉంటుంది. అనుకున్న పాయింట్ చెప్పడంలో టీమ్ అంతా పర్లేదు సక్సెస్ అయ్యారు. కాకపోతే మరీ అంత ఎక్స్‌ట్రార్డినరీగా అయితే ఉండదు.

ఎవరెలా చేశారు?
ఈ సినిమాలో ఏదైనా ప్లస్ ఉందంటే అది శివకార్తికేయన్ మాత్రమే. ఇతడి క్యారెక్టర్ డిజైన్ బాగుంటుంది. అలానే శివకార్తికేయన్‌లో టిపికల్ కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. దాన్ని కూడా ఈ మూవీలో అక్కడక్కడ ఉపయోగించుకున్నారు. రుక్మిణి వసంత్ ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించింది. స్క్రీన్ పై ఈమె అందంగా కనిపించింది. విలన్స్ విరాట్-చిరాగ్‌గా విద్యుత్ జమ్వాల్, షబ్బీర్ బాగానే చేశారు. మంచి ఎలివేషన్స్ పడ్డాయి. బిజు మేనన్.. ఎన్ఐఏ ఆఫీసర్‌గా బాగానే చేశారు. మిగిలిన వాళ్లంతా ఓకే.
టెక్నికల్ అంశాలకొస్తే.. పాటలు అస్సలు బాగోలేవు. లిరిక్స్ ఒక్క ముక్క అర్థం కాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పర్లేదనిపించింది. కానీ అనిరుధ్ మార్క్ కనిపించలేదు. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి. ఫైనల్‌గా ఏఆర్ మురుగదాస్.. ఈ సినిమాతో కాస్త కుదురుకున్నాడు. కానీ ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది అనిపించింది. అలానే టైటిల్ పడేటప్పుడు తమిళనాడు మ్యాప్ తప్పుగా చూపించారు. అందులో దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని కూడా తమిళనాడులో కలిపేసి చూపించారు. మరి టీమ్ ఇది తెలిసి చేసిందా? తెలియక చేసిందా? అనేది అర్థం కాలేదు.
- చందు డొంకాన