
లయ(laya)...ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. ఆమె అందానికి, నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె కోసం సినిమాకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే.. పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. 1999లో వేణు 'స్వయంవరం' మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన లయ.. 2006 వరకు దాదాపు 40 సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత 25 ఏళ్ల వయసులోనే గణేశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్లి పోయింది. అక్కడ కొన్నాళ్ల పాటు ఐటీ జాబ్ చేసింది. ఆ తర్వాత డ్యాన్స్ స్కూల్ కూడా రన్ చేసింది. కరోనా కారణంగా అది మూతపడింది.
ఆ తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చిన లయ.. ఇన్‌స్టాలో వరుసగా రీల్స్ చేయడంతో ఆమె గురించి మరోసారి బయటి ప్రపంచానికి తెలిసింది. ఆమె చేసిన రీల్స్ వల్లే..మళ్లీ సినిమా చాన్స్‌లు వచ్చాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తోంది. నితిన్ హీరోగా నటిస్తున్న ‘తమ్ముడు’ సినిమాలో లయ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో నటి లయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సీనియర్ నటుడు బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ సినిమా షూటింగ్ సమయంలో పొరపాటున బాలయ్య కాలు తొక్కితే.. సీరియస్ అవ్వడమే కాకుండా సినిమాలో నుంచి తీసేయండి అని చెప్పాడని, నన్ను ఆటపట్టించడానికే ఇలా అన్నారనే విషయం తెలియక బోరున ఏడ్చానని చెప్పింది.
‘విజయంద్రవర్మ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించాను. ఆ సినిమా ఫస్డ్‌డే షూటింగ్ రోజే పాట పెట్టారు. దాని కోసం బాలకృష్ణతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ క్రమంలో నేను పొరపాటున బాలయ్య కాలు తొక్కేశాను. దాంతో బాలకృష్ణ వెంటనే సీరియస్ అయ్యాడు. ‘నా కాలే తొక్కుతావా..? ప్యాకప్.. ఈ అమ్మాయిని సినిమాలో నుంచి తీసేయండి’అని చెప్పి పక్కకి వెళ్లిపోయాడు.
బాలకృష్ణ అలా అనడం నేను తట్టుకోలేకపోయాను. గట్టిగా ఏడ్చేశాను. వెంటనే బాలయ్య వచ్చి..‘అయ్యో..నేనేదో సరదాగా అన్నాను.. నిజమనుకున్నావా? ఇలాంటివి నేను బోలెడు అంటున్నాను’ అని నవ్వేశాడు. ఆయన జోక్ చేశాడనే విషయం గ్రహించక నేను ఏడ్చేశాను. సెట్‌లో ఎప్పుడు ఆయన అలానే సరదాగా ఉండేవాడు’ అని లయ చెప్పుకొచ్చింది.