
ఫలానా హీరో–హీరోయిన్ కాంబినేషన్ కుదిరింద‘ట’... ఓ పాట సెట్ కోసం ఐదువందల మందికి పైగా పని చేస్తున్నార‘ట’... ఆ డైరెక్టర్ 60 రోజుల్లోనే సినిమా పూర్తి చేయాలనుకుంటున్నాడ‘ట’... ఆ స్టార్ హీరో సినిమాలో ఇంకో స్టార్ హీరో విలన్‌గా ఫిక్స్ అయ్యాడ‘ట’... ఇలా సినిమా పరిశ్రమ గురించి రోజుకో ‘ట...ట...ట...’ అంటూ వార్తలు ప్రచారంలో ఉంటాయి. మరి... ఈ ప్రచారంలో ఉన్న ఈ ‘ట’లు నిజమౌనా? అనేది తెలియాలంటే మాత్రం యూనిట్ చెప్పాల్సిందే. ఇక ప్రస్తుతం ఆ నోటా ఈ నోటా విహారం చేస్తున్న కొన్ని ‘ట’ల గురించి ఓ లుక్కేద్దాం.
హీరో మహేశ్‌బాబు, డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పంథాకి భిన్నంగా ఈ చిత్రాన్ని అతి వేగంగా పూర్తి చేసేం దుకు రాజమౌళి షూటింగ్ ప్లాన్ చేశారని టాక్. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే హై ఓల్టేజ్ యాక్షన్ అడ్వెంచరస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం పొడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ఉన్న మహేశ్ లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారాయి. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశాలోని కోరాపుట్‌లో రెండు షెడ్యూల్స్‌ని మెరుపు వేగంతో పూర్తి చేసిన రాజమౌళి మూడవ షెడ్యూల్‌కి సిద్ధం అయ్యారు. ఇందుకోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ని సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సెట్ కోసం దాదాపు 550 మంది పని చేస్తున్నారని టాక్. ఈ సెట్‌లో త్వరలోనే ఓ భారీ సాంగ్‌ని చిత్రీకరించనున్నారట రాజమౌళి. ఈ పాట సినిమాలో హైలైట్ అవుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు కూడా గత కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్పష్టత రావాలంటే చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
రజనీకాంత్‌కి విలన్‌గా...
రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ఓ కీలక పాత్ర చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ చిత్రంలో ఫాహద్‌ది పాజిటివ్ క్యారెక్టర్. ఒక రకంగా చెప్పాలంటే రజనీ పాత్రకు హెల్ప్‌ఫుల్‌గా ఉండే పాత్ర. అయితే ఇప్పుడు రజనీకాంత్‌కి విలన్‌గా మారారట ఫాహద్. ఏ సినిమాలో అంటే ‘జైలర్ 2’లో అని సమాచారం. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇదే కాంబినేషన్‌లో ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఫాహద్‌ని విలన్‌గా ఎంపిక చేశారని టాక్. ఇటీవల కేరళలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభమైంది. తదుపరి షెడ్యూల్‌లో ఫాహద్ పాల్గొంటారట. అప్పుడు ఈ చిత్రంలో ఫాహద్ విలన్‌గా నటిస్తున్న విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించాలని అనుకుంటోందని సమాచారం.
సూర్య–కీర్తి మళ్లీ కుదిరేనా?
సూర్య–కీర్తీ సురేష్ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారా? అంటే అవుననే అంటోంది తమిళ పరిశ్రమ. ఈ ఇద్దరూ జంటగా ‘తానా సేంద కూట్టమ్’ (2018) అనే చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో సినిమా రూపొందనుందనే ప్రచారం జరుగుతోంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూర్యకి జోడీగా కీర్తీ సురేష్ నటించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి ‘796 సీసీ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. ‘సార్, లక్కీ భాస్కర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కించనున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ప్రీ ్రపొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా కీర్తీ సురేష్‌ను ఎంపిక చేశారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి... ఈ వార్తలపై స్పష్టత రావాలంటే వేచి చూడాలి.
తమిళ దర్శకుడితో...
హీరో కల్యాణ్ రామ్ జోరు మీదున్నారు. ఆయన హీరోగా నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ ఈ నెల 18న విడుదలై, హిట్‌గా నిలిచింది. తన తర్వాతి చిత్రాన్ని తమిళ దర్శకుడు గిరీశాయతో చేయనున్నారట కల్యాణ్ రామ్. తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని తమిళంలో ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్ చేశారు గిరీశాయ. ఈ సినిమా కోలీవుడ్‌లోనూ హిట్‌గా నిలిచింది. కాగా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘రంగ రంగ వైభవంగా’ (2022) సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయ్యారు గిరీశాయ. తాజాగా కల్యాణ్ రామ్ కోసం ఓ కథని సిద్ధం చేశారట ఆయన. యాక్షన్ డ్రామా నేపథ్యంలో రొటీన్ ఫార్ములాకు భిన్నంగా సాగే ఈ కథ కల్యాణ్ రామ్‌కి కూడా నచ్చిందట. దీంతో తన తర్వాతి మూవీని గిరీశాయ దర్శకత్వంలో చేయనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ తర్వాత ‘బింబిసార 2’ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే డైరెక్టర్ వశిష్ఠ ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’ సినిమా తెరకెక్కిస్తున్నారు. దీంతో ‘బింబిసార 2’ మొదలయ్యేందుకు మరికొంత సమయం పట్టనుంది. ఈలోపు గిరీశాయ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కల్యాణ్ రామ్ ఆసక్తిగా ఉన్నారని టాక్. ఇక కల్యాణ్ రామ్, గిరీశాయ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అరవై రోజుల్లో...
డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్టైలే వేరు. సినిమాలను జెట్ స్పీడ్‌లో తెరకెక్కిస్తారనే పేరుంది ఆయనకి. ఎంత పెద్ద సినిమా అయినా మూడు నాలుగు నెలల్లోనే చిత్రీకరణ పూర్తి చేస్తుంటారు. అయితే తన తాజా చిత్రాన్ని కేవలం అరవై రోజుల్లోనే పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట పూరి. ఆయన దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటించనున్నారు. ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటించనున్నారు. కాగా ఈ మూవీకి ‘బెగ్గర్’ అనే టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. పూరి సొంత నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నారట. అందుకే ‘బెగ్గర్’ అనే టైటిల్‌ను లాక్ చేశారని టాక్. మే లేదా జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని కేవలం అరవై రోజుల్లో పూర్తి చేయాలన్నది పూరి జగన్నాథ్ ఆలోచన అట. ఎందుకంటే వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి ‘బెగ్గర్’ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పూరీని కోరారట. అందుకు తగ్గట్టు జెట్ స్పీడ్‌లో షూటింగ్ పూర్తి చేసేందుకు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట పూరి జగన్నాథ్.
రీమేక్ చిత్రంతో...
వైవిధ్యమైన కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు రాజశేఖర్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన తర్వాతి సినిమా ఏంటి? అన్నదానిపై క్లారిటీ లేదు. ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం ‘శేఖర్’. ఆయన భార్య జీవిత దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2022 మే 20న విడుదలైంది. ఆ తర్వాత నితిన్ హీరోగా నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్’ (2023) సినిమాలో కీలక పాత్రలో కనిపించారు రాజశేఖర్. ఆ చిత్రం విడుదలై ఏడాదిన్నర దాటినా రాజశేఖర్ తర్వాతి సినిమాపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన లేదు. ఇదిలా ఉంటే... తమిళంలో ఘన విజయం సాధించిన ‘లబ్బర్ పందు’ సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు రాజశేఖర్ సన్నాహాలు చేస్తున్నారని టాక్.
తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించిన ‘లబ్బర్ పందు’ చిత్రం గత ఏడాది సెప్టెంబరు 20న తమిళంలో రిలీజై, సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు హక్కులు కొనుగోలు చేశారట రాజశేఖర్. పెళ్లీడుకి వచ్చిన కూతురు ఉన్న ఒక వ్యక్తికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయిని ప్రేమించే అబ్బాయికి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్, ప్రేమ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం కోలీవుడ్‌లో హిట్‌గా నిలిచింది. ఈ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథ, కథనంలో మార్పులు చేసి, రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట రాజశేఖర్. మరి... ఈ వార్తల్లో వాస్తవం ఏంటన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాలి.
– డేరంగుల జగన్ మోహన్