సరోగసీలో కొత్త సమస్య..ఆ బిడ్డను ఏం చేయాలి?

Kriti Sanon and Pankaj Tripathi film mixes up surrogacy - Sakshi

శ్రీమంతులు, సంతానం కలగడం వీలులేని వారు సరొగసీ ద్వారా తల్లిదండ్రులు కావడం తెలుసు. గర్భాన్ని అద్దెకి ఇచ్చినవారు బిడ్డను కని ఇక ఆ బిడ్డను మర్చిపోవాల్సిందే. అయితే బిడ్డను కనడానికి డబ్బు తీసుకుని నెలలు నిండాక ఆ డబ్బు ఇచ్చినవారు బిడ్డ మాకు వద్దు అనంటే గర్భాన్ని అద్దెకు ఇచ్చిన స్త్రీ ఏం చేయాలి? కడుపులో ఉన్న బిడ్డ ఏం కావాలి? ఈ సమస్యతో ఈ ఒక సినిమా త్వరలో వస్తున్నా ఈ సమస్య కొత్త ప్రశ్నను లేవదీస్తున్నదనేది వాస్తవం.

స్త్రీ సమస్య స్త్రీకే అర్థమవుతుంది. ప్రసిద్ధ మరాఠి నటి, దర్శకురాలు సమృద్ధి పోరే 2011లో ఒక సినిమా తీసింది మరాఠిలో. పేరు ‘మాలా ఆయీ వాయ్‌చే’ (నాకు తల్లి కావాలని ఉంది). అందులో అమెరికా నుంచి వచ్చిన మేరీ అనే మహిళ  మహరాష్ట్రలోని హీరోయిన్‌ను అద్దె గర్భం ద్వారా బిడ్డను కని ఇవ్వమని అడుగుతుంది. హీరోయిన్‌ అందుకు సమ్మతిస్తుంది. కాని గర్భంలో బిడ్డ ఎదిగాక పరీక్షలు చేసిన డాక్టర్లు ఆ పుట్టబోయే బిడ్డ కొన్ని అవకరాలతో (వికలాంగ సమస్యతో) పుట్టే అవకాశం ఉందని మేరీకి చెబుతారు. ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఎదురు చూస్తున్న మేరీకి ఈ వార్త పెద్ద దెబ్బగా తాకుతుంది. ఆమె ఆ బిడ్డను వద్దనుకుని అమెరికా వెళ్లిపోతుంది. కాని ఇక్కడ గర్భంలో ఉన్న బిడ్డను మోస్తున్న తల్లి దానిని వద్దనుకోగలదా? ఇప్పుడు ఆ బిడ్డ ఉనికి ఏమిటి? అది ఆ సినిమా కథ. ఇప్పుడు ఇదే సమస్యను తీసుకుని హిందీలో తీసిన ‘మిమి’ జూలై 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

అద్దెగర్భం–పెద్ద వ్యాపారం
గత రెండు దశాబ్దాలుగా భారతదేశంలో సరొగసి ఒక పెద్ద ధోరణిగా సక్రమమైన విషయాలకు అక్రమమైన విషయాలకు కూడా వార్తల్లో ఉంది. ప్రస్తుతం దేశంలో సంవత్సరానికి 25,000 మంది పిల్లలు సరొగసి ద్వారా పుడుతున్నారని అంచనా. సరొగసి చుట్టూ దాదాపు 3000 కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఉన్న 3000 ఫర్టిలిటీ సెంటరల్లో కొన్ని ఈ సరొగసి పనిలో ఉన్నాయి.

పది లక్షల రూపాయల నుంచి పాతిక లక్షల రూపాయలు ఒక్క సరొగసికి మొత్తం ప్యాకేజీ లెక్కన క్లినిక్‌లు మాట్లాడుకుంటున్నాయని తెలుస్తోంది. విదేశీ జంటలు భారతదేశానికి వచ్చి సరొగసి ద్వారా పిల్లల్ని పొందడం వల్ల కావచ్చు, భారతదేశంలో కూడా సబబైన కారణాల వల్ల గాని, కెరీర్‌లో ఉన్న శ్రీమంతులు గాని సరొగసి ద్వారా బిడ్డలను కనాలనుకోవడం వల్ల  ఈ ‘ఇండస్ట్రీ’ బయటకు కొంత తెలిసి, కొంత తెలియక విజయవంతంగా సాగుతోంది. సరొగసి క్రమబద్ధీకరణ కోసం, కమర్షియల్‌ సరొగసిని నివారించడం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 2019 బిల్లు ఇంకా రాజ్యసభ అనుమతి పొందాల్సి ఉంది. ఈలోపు సరొగసితో ముడిపడిన సమస్యలు ప్రసార మాధ్యమాలకు, వినోద మాధ్యమాలకు మంచి ముడిసరుకు అవుతున్నాయి.

ఎన్నో సమస్యలు
సరొగసిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అద్దె గర్భం ఇచ్చే స్త్రీకి సాధారణ గర్భంలో ఉండే అన్ని రిస్కులతో పాటు భావోద్వేగాల సమస్యలు ఉంటాయి. కృత్రిమ పద్ధతిలో గర్భం ధరిస్తుంది కనుక ఆ పరీక్షల కోసమని, హార్మోన్ల కోసమని, ఫలదీకరణ కోసం చేసే రిపీటెడ్‌ తంతు ఆమె శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. అద్దె గర్భం ప్రసవంలో కూడా చనిపోయిన తల్లులు ఉన్నారు. ఇక పుట్టిన బిడ్డ ‘జాతీయత’  పెద్ద సమస్య అవుతోంది. ఇక్కడ పుట్టిన బిడ్డను తమ దేశానికి తీసుకెళ్లాలనుకునే విదేశీ జంటలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

బిడ్డను వద్దనుకుంటే
పంకజ్‌ త్రిపాఠి, క్రితి సనాన్‌ నటించగా లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించిన ‘మిమి’ సరొగసిలోని ఈ సమస్యనే చర్చించనుంది. అవివాహిత అయిన హీరోయిన్‌ను ఆమె మిత్రుడు సరొగసిలో మంచి డబ్బు ఉందని ఒప్పిస్తాడు. విదేశీ జంట నుంచి 20 లక్షల రూపాయలకు డీల్‌ కుదురుతుంది. ఆ గర్భం దాల్చి బిడ్డను ఇవ్వడంలో భాగంగా ఆమె ఊరు విడిచి ఇంకో కొత్త ప్రాంతానికి వెళ్లి మిత్రుడిని భర్తగా చెప్పి నివాసం ఉంటుంది. అంతా బాగానే ఉందనుకున్న సమయాన డబ్బు ఇచ్చిన విదేశీ జంట తమకు ఆ బిడ్డ వద్దని చెబుతుంది. ఇప్పుడు బిడ్డను ఏం చేయాలి? గర్భాన్ని మోస్తున్న హీరోయిన్‌ను ఆమె తల్లిదండ్రులు ఆ బిడ్డకు తండ్రి ఎవరు అని నిలదీస్తారు? కన్నాక ఆ బిడ్డ భవిష్యత్తు ఏమిటి... తల్లి ఎవరు తండ్రి ఎవరు అనేది ఒక సమస్య... వీటన్నింటికీ జవాబు వెతికే ప్రయత్నం ‘మిమి’ చేస్తుంది.

గర్భం దాల్చడం భారతీయ సమాజంలో పుణ్యకార్యం. గర్భంతో ఉన్న స్త్రీకి దక్కే గౌరవం, మర్యాద... పిల్లలున్న తల్లికి ఇచ్చే విలువ... వాటి చుట్టూ ఉండే కథలు, గాథలు అందరికీ తెలిసినవే. అద్దె గర్భమే అయినా ఇక్కడి స్త్రీ ఆ గర్భసమయంలో పొందే భావోద్వేగం వేరు. అలాంటిది ఆ బిడ్డకు అసలు హక్కుదారులు తప్పించుకుంటే తాను ఆ బిడ్డను సులువుగా వదులుకునే వీలు ఉండదు. ఈ సెంటిమెంటే ఇప్పుడు ‘మిమి’ సినిమా కథగా చర్చకు వస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top