ఆ హిట్‌ డైరెక్టర్‌తో స్టార్ హీరో మరో సినిమా.. ! | Sakshi
Sakshi News home page

Surya: ఆ హిట్‌ డైరెక్టర్‌తో మరోసారి జతకట్టనున్న సూర్య!

Published Wed, Jan 3 2024 2:39 PM

kollywood Star Surya Acts In Again Sin Super Hit Director Movie - Sakshi

వైవిధ్య భరిత కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. గతంలో సూర్య నటించిన సూరారై పోట్రు, జై భీమ్‌ చిత్రాలు ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కంగువ అనే భారీ చారిత్రాత్మక కథా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. చిరుతై శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ సంస్థ అధినేత జేఈ జ్ఞానవేల్‌ రాజా యూవీ క్రియేషన్స్‌ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

త్రీడీ ఫార్మాట్లో రూపొందుతున్న కంగువ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, గ్లిమ్స్‌ ఇప్పటికే విడుదల కాగా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కాగా ఈ చిత్ర షూటింగ్‌లోనే నటుడు సూర్య గాయాల పాలై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం మిగిలిన షూటింగ్‌ పూర్తి చేసే పనిలో ఉన్నారు.

కంగువ తర్వాత  మరోసారి సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది సూర్య నటించే 43వ చిత్రం కానుంది. దీనిని సూర్య తన 2డీ ఎంటర్‌టైన్‌ పతాకంపై నిర్మించనున్నారు. ఇందులో నటి నజ్రియా నాయకిగా నటించనుండగా.. మలయాళ యువ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ ప్రధాన పాత్రను పోషించనున్నారు. 

అదే విధంగా విజయవర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఈయనకు సంగీత దర్శకుడుగా 100వ చిత్రం కావడం విశేషం. కాగా ఈ చిత్ర పాటల రికార్డింగ్‌ మొదలైంది. తొలిపాటను ఓ యువ గాయని పాడారు. ఈ విషయాన్ని జీవీ ప్రకాష్‌కుమార్‌ మంగళవారం తన ఎక్స్‌(ట్విటర్)లో పేర్కొన్నారు. అందులో సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్ర పాటల రికార్డింగ్‌ గాయని ‘దీ‘తో ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

 
Advertisement
 
Advertisement