‘కింగ్డమ్‌’ మూవీ రివ్యూ | Kingdom Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Kingdom Review: కింగ్డమ్‌ మూవీ హిట్టా? ఫట్టా?

Jul 31 2025 12:14 PM | Updated on Jul 31 2025 1:51 PM

Kingdom Movie Review And Rating In Telugu

టైటిల్‌: కింగ్డమ్‌
నటీనటులు: విజయ్‌ దేవరకొండ, సత్యదేవ్‌, భాగ్యశ్రీ బోర్సే , వెంకటేశ్‌ పీసీ, కసిరెడ్డి తదితరులు
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు:సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: గౌతమ్‌ తిన్ననూరి
సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌
సినిమాటోగ్రఫీ:జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC
ఎడిటర్‌ : నవీన్‌ నూలి
విడుదల తేది: జులై 31, 2025

విజయ్‌ దేవరకొండ ఖాతాలో హిట్‌ పడి చాలా కాలమైంది. నిజం చెప్పాలంటే ‘గీత గోవిందం’ తర్వాత ఆ స్థాయిలో విజయం సాధించిన సినిమానే లేదు. భారీ ఆశల మధ్య గతేడాది వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్‌’ బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరిచింది. దీంతో విజయ్‌ ఆశలన్నీ ‘కింగ్‌డమ్‌’పైనే పెట్టుకున్నాడు.డైరెక్టర్‌ గౌతమ్‌కి కూడా ఈ సినిమాపై గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను కింగ్‌డమ్‌ అందుకుందా? విజయ్‌ ఖాతాలో హిట్‌ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.

కథేటంటే..
సూరి(విజయ్దేవరకొండ) కానిస్టేబుల్‌. అన్న శివ(సత్యదేవ్‌) అంటే ప్రాణం. కారణంతో శివ చిన్నప్పుడే తండ్రిని చంపి ఇంటి నుంచి పారిపోతాడు. అతని ఆచూకి కోసం సూరి వెతుకుతూనే ఉంటాడు. క్రమంలో సూరి శ్రీలంకలో ఉన్నాడని తెలుస్తుంది.  కట్చేస్తే.. శ్రీలంకలో తెగ ఉంటుంది. 70 ఏళ్ల క్రితం ఇండియా నుంచి శ్రీలంకకు పారిపోయిన తెగ అది.  గోల్డ్‌ మాఫియా సిండికేట్‌ చేతిలో వారు బానిసలు. మురుగన్‌(వెంకటేశ్‌) చెప్పింది చేయడమే వాళ్ల పని.  శివ ఆ గ్యాంగ్‌ లీడర్‌. అతన్ని తిరిగి ఇండియాకు తీసుకురావడమే సూరి లక్ష్యం.  మరి ఆ లక్ష్యం నెరవేరిందా?  తమ్ముడు సూరి ఇండియన్‌ పోలీసుల గూఢచారి అని తెలిసిన తర్వాత శివ ఏం చేశాడు? అసలు ఈ తెగ ఇండియా నుంచి శ్రీలంకకు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది.  గుఢచారిగా వెళ్లిన సూరి.. చివరకు ఆ తెగకు దేవుడిగా ఎలా మరాడు అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
తెరపై భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించడంలో దర్శకుడు గౌతమ్తిన్ననూరి సిద్ధహస్తుడు. ‘మళ్లీ రావా’లో ప్రేమ, విరహం, గతం-వర్తమానం మధ్య తడమాటాన్ని అద్భుతంగా చూపించాడు.  జెర్సీలోని ట్రైన్‌ సీన్‌ ఒక్కటి చాలు గౌతమ్‌ తన కథల్లో ఎమోషన్‌ని ఎంత బలంగా చూపిస్తాడో చెప్పడానికి. కింగ్డమ్‌లో కూడా తన బలమైన ఎమోషన్‌పైనే గౌతమ్‌ ఎక్కువ దృష్టిపెట్టాడు. ఈ విషయంలో ఆయన సక్సెస్‌ అయ్యాడు.  

గ్యాగ్ స్టర్ బ్యాక్ డ్రాప్‌తో అన్నదమ్ముల కథని చెప్పాడు. అయితే ఇక్కడ ఎమోషన్‌ వర్కౌట్‌ అయినా.. కథ-కథనంలో మాత్రం కొత్తదనం కొరవడింది. సినిమా చూస్తున్నంత సేపు ఇటీవల వచ్చిన రెట్రో సినిమాతో పాటు పాత చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు మన కళ్లముందు తిరుగుతాయి. కథను బలంగా చెప్పే క్రమంలో కొన్ని చోట్ల ట్రాక్‌ మిస్‌ అయ్యాడు.  అయితే అనిరుధ్‌ నేపథ్య సంగీతం, విజయ్‌ నటన ఆ తప్పిదాలను కొంతవరకు కప్పిపుచ్చాయి. 



1920లో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన బంగారు గని కార్మికుల నేపథ్యంతో కథ చాలా ఎమోషనల్‌గా మొదలవుతుంది. ఆ తర్వాత కథ 70 ఏళ్లు ముందుకు జరిగి.. 1991లోకి వస్తుంది.  చిన్నప్పుడే పారిపోయిన అన్నకోసం సూరి వెతకడం.. ఓ పోలీసు ఆఫీసర్‌ దృష్టిలో పడడం.. అన్న ఆచూకి చెప్పి అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ కోసం శ్రీలంకకు పంపిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. భారీ యాక్షన్‌ సీన్లు, ఎలివేషన్లతో కథను నడిపించే అవకాశం ఉన్నా.. దర్శకుడు మాత్రం భావోద్వేగాలనే బలంగా చూపించాడు. అన్నదమ్ములు కలిసే సీన్‌ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది. 

సముంద్రంలో వచ్చే ఛేజింగ్‌ సీన్‌, నేవి అధికారుల నుంచి బంగారం కొట్టేసే సీన్‌ ఫస్టాఫ్‌కే హైలెట్‌. ఇంటర్వెల్‌ సన్నివేశం సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో కథ అక్కడక్కడే తిరిగినట్లు అనిపిస్తుంది.  పైగా కొన్ని చోట్ల కథనం ట్రాక్‌ తప్పుతుంది.  ఆపదలో ఉన్నవారిని చివరి నిమిషంలో అయినా సరే హీరో వచ్చి ఆదుకోవడం మన తెలుగు సినిమాల సాంప్రదాయం. కానీ కింగ్డమ్‌లో అది ఫాలో కాకపోవడంతో.. కొంతమందికి ప్రీక్లైమాక్స్‌ కొత్తగా అనిపిస్తే.. చాలా మందికి  ఇలా చేశారేంటి? అనిపిస్తుంది. పార్ట్‌ 2 కోసమే క్లైమాక్స్‌ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. 



ఎవరెలా చేశారంటే.. 
సూరి పాత్రలో విజయ్‌ దేవరకొండ ఒదిగిపోయాడు. యాక్షన్‌ సీన్లతో పాటు ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు.  సాధారణ పోలీసు కానిస్టేబుల్‌గా,  ఆ తర్వాత పోలీసుల గూఢచారిగా, కింగ్డమ్‌ రాజుగా ఇలా పలు వేరియేషన్లు ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. తన కెరీర్‌లో బెస్ట్‌ ఫెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం సత్యదేవ్‌ పాత్ర. హీరో అన్న శివగా అద్భుతంగా నటించాడు.  ఆయన పాత్రకు స్క్రీన్‌ స్పేస్‌ కూడా చాలా ఎక్కువే ఉంది.  ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకు రెండో హీరో సత్యదేవ్‌ అనే చెప్పొచ్చు.  ఇక మాఫీయా లీడర్‌ మురుగన్‌గా వెంకటేశ్‌ విలనిజం బాగా పండించాడు. ఈ సినిమాలో భాగ్యశ్రీకి పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. డాక్టర్‌గా రెండు మూడు సీన్లలో కనిపిస్తుంది అంతే. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.  

సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం అనిరుధ్‌ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు.  పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మొత్తం చాలా వరకు రియల్‌ లొకేషన్లలోనే షూట్‌ చేశారు.  జాన్, గిరీష్ గంగాధరన్ తమ కెమెరా పనితనంతో వాటిని అంతే అందంగా చూపించారు. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

 

Rating:

What's your opinion?

‘కింగ్డమ్‌’ మూవీ ఎలా ఉంది?

Choices
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement