
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రూ.310 కోట్లు కొల్లగొట్టింది మహావతార్ నరసింహ మూవీ (Mahavatar Narsimha). అటు బాలీవుడ్‌లో కొత్తవారితో తీసిన సయారా చిత్రం ఏకంగా రూ.580 కోట్లు దాటేసింది. ఈ రెండు సినిమాలు ఎంత సెన్సేషన్ అయ్యాయో అందరికీ తెలిసిందే! అయతే కొత్తవారితో తీసిన ప్రతి సినిమా సయారాలా సెన్సేషన్ హిట్ అందుకోలేదంటున్నాడు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్.
భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్.. ఎందుకు?
తేజ సజ్జ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్. ఈ సినిమాను హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి కరణ్ జోహార్ (Karan Johar) విడుదల చేస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో కరణ్ జోహార్ పాల్గొన్నాడు. అక్కడ.. భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అవడానికి పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం లేదా స్టార్స్ తీసుకుంటున్న రెమ్యునరేషన్.. ఏది కారణం? అని ఓ ప్రశ్న ఎదురైంది.
ఎవర్నీ తప్పుపట్టలేం
అందుకు కరణ్ స్పందిస్తూ.. ప్రతి సినిమాకు దాని ఫలితం ముందే రాసిపెట్టి ఉంటుంది. పెద్ద హీరోలతో తీసిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా హిట్టయిన రోజులున్నాయి. కాకపోతే పరిస్థితులు సరిగా లేవు. అందుకే ఇప్పుడందరూ సినిమాను మరోసారి అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మనం ఎవరినీ తప్పుపట్టలేము. అలాగే కొత్తవారితో పెద్ద సినిమా తీసినప్పుడు అవి సక్సెస్ అయిన రోజులున్నాయి, అలాగే ఫెయిలైన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడేం జరుగుతుందనేది కచ్చితంగా ఎవరూ చెప్పలేరు.
దరిదాపుల్లోకి కూడా రాలేవ్
సంగీతాన్ని ప్రధానంగా తీసుకుని వచ్చే ప్రతి సినిమా సయారాలా హిట్టవలేదు. యానిమనేషన్ సినిమాలు కూడా ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నీ మహావతార్ నరసింహకు దరిదాపుల్లోకి కూడా రాలేవు అని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.