ఈ సినిమా తారలకు ఏమైంది? మరీ ముఖ్యంగా బాలీవుడ్ నటీమణులకు ఏమైంది? దశాబ్ధాల తరబడి భారతీయ సినిమాల్లో ప్రముఖంగా ఉంటూ మన ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతూనే మన దేశ సంస్కృతీ సంప్రదాయాల పట్ల బాధ్యతా రహితంగా ఎలా ఉండగలుగుతున్నారు?
ఇలాంటి ఆలోచనలు ఇటీవలి కాలంలో చాలా మందికి వస్తున్నాయి. సినిమాల్లో శృంగార సన్నివేశాల విజృంభణతో పాటు ప్రేమ, పెళ్లి, వివాహేతర సంబంధాలు వంటి అనేక సున్నితమైన, యువతను ప్రభావితం చేసే అంశాలపై ఇష్టారాజ్యంగా వీరు వ్యాఖ్యలు, అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడం విస్తుగొలుపుతోంది. అలాంటి బాధ్యతా రహిత సెలబ్రిటీల జాబితాలో తాజాగా సీనియర్ నటి కాజోల్, బాలీవుడ్ ప్రముఖురాలు ట్వింకిల్ ఖన్నాలు చోటు చేసుకున్నారు. పెళ్లయిన వాళ్లు వివాహేతర సంబంధాలు లేదా తాత్కాలిక శారీరక సంబంధాలు పెట్టుకోవడం తప్పులేదనే విధంగా వీరు వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది.
(చదవండి: ప్రశాంత్ వర్మ సినిమా.. 'మహాకాళి'గా భూమి శెట్టి)
వివరాల్లోకి వెళితే... తాజాగా జాన్వీ కపూర్, కరణ్ జోహార్, కాజోల్(Kajol), ట్వింకిల్ ఖన్నా(Twinkle Khanna ) పాల్గొన్న టాక్ షో పెళ్లయిన దంపతులు ఒకరికి ఒకరు విశ్వాసంగా ఉండడం అనే అంశంపై చర్చ నెట్టింట రచ్చను రాజేసింది .ఈ చర్చలో భాగంగా వేరొకరితో శారీరక సంబంధం పెట్టుకోవడం ద్వారా జీవిత భాగస్వామిని మోసం చేయడం క్షమించరానిదని జాన్వీ కపూర్ అభిప్రాయపడగా దీన్ని , కాజోల్ ట్వింకిల్ ఖన్నా లు తోసిపారేశారు. ఇది దాంపత్య ఒప్పందాన్ని ఉల్లంఘించేది కాదని తేల్చేశారు. తద్వారా వీరిద్దరూ నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు.
(చదవండి: కొండచిలువను మెడకు చుట్టుకున్న గ్లోబల్ బ్యూటీ..)
ఈ సెలబ్రిటీ టాక్ షో లో అతిధులుగా కాజోల్, ట్వింకిల్ ఖన్నా, జాన్వీ కపూర్(Janhvi Kapoor), కరణ్ జోహార్ పాల్గొన్నారు. భాగస్వామిని శారీరకంగా మోసం చేయడం కన్నా మానసికంగా మోసం చేయడం పెద్ద తప్పు అని అంగీకరిస్తున్నారా లేదా అనే చర్చ లేవనెత్తారు. దీంతో దేవర నటి జాన్వి శారీరక మోసాన్ని సహించలేమని అంటూ తన వైఖరిని గట్టిగా చెప్పింది. అయితే కరణ్ జోహార్, ట్వింకిల్ ఖన్నా కాజోల్ ఆ అభిప్రాయం సరైంది కాదని నొక్కి చెప్పారు. ట్వింకిల్ అయితే ‘రాత్ గయీ బాత్ గయీ (రాత్రి పోయింది ఆ విషయమూ అయిపోయింది )’ అంటూ తేలిగ్గా తేల్చి చెప్పింది, కాబట్టి మానసిక వ్యభిచారమే తప్పన్నట్టు మాట్లాడింది.
అయితే జాన్వి తన అభిప్రాయం నుంచి వెనక్కి తగ్గలేదు. ఈ క్లిప్ ఇంటర్నెట్ అంతటా వైరల్ అయింది, ఒకవైపు, ‘పరమ సుందరి’ స్టార్ తన అభిప్రాయానికి ప్రశంసలు అందుకుంటుండగా, హోస్ట్‌లు కాజోల్ ట్వింకిల్ వారి అభిప్రాయానికి ఎదురుదాడిని ఎదుర్కొంటున్నారు. దీనిపై పలువురు మానసిక శాస్త్రవేత్తలు సైతం విశ్లేషణాత్మక విమర్శలు సంధిస్తున్నారు.
పైగా జాన్వి చిన్నది, ఆమె 20 ఏళ్లలో ఉందని, కానీ ఆమె 50 ఏళ్ల వయస్సుకు చేరుకున్నప్పుడు, ఆమెకు ఇప్పుడు ఉన్న అభిప్రాయం మారుతుందని ట్వింకిల్ అనడాన్ని ప్రస్తావిస్తూ ఓ మనస్తత్వవేత్త ఇలా అన్నారు, ‘కాదు, ఇది వయస్సు లేదా పరిపక్వత గురించి కాదు, ఇది గౌరవం సరిహద్దుల గురించి.’’అంటూ గుర్తు చేశారు. ‘మోసం అంటే మోసం..అది భావోద్వేగంగా మాత్రమే కాదు శారీరకంగా లేదా సరసాలాడటం కూడా మోసమే. దానికి వేర్వేరు పేర్లు పెట్టి, సరదాగా గడపడానికి లేదా ‘మనస్సును మరల్చడానికి లేదా టైమ్ పాస్?‘ అని పిలవడం తప్పించుకోవడమేనన్నారు.
పలువురు నెటిజన్లు జాన్విని అభినందించారు చాలా మంది అక్రమ సంబంధాల్ని సమర్థిస్తున్నారంటూ కాజోల్ ట్వింకిల్‌లను తీవ్రంగా విమర్శించారు. ‘ బాలీవుడ్ జీవనశైలిలో భాగంగా వారు దానిని సాధారణమైనదిగా చూస్తారు. వేరే విధంగా ఎవరైనా మాట్లాడటం అనేది వారికి వింతగా లేదా అమాయకంగా లేదా తెలివితక్కువగా అనిపిస్తుంది ‘ అని ఓ నెటిజన్ తీవ్రంగా దుయ్యబట్టారు.


