
వినోద పరిశ్రమలో మూడు దశాబ్దాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది ఏక్తా కపూర్. ఈ ప్రయాణంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంది. తనను తాను తీర్చిదిద్దుకుంది. పదిహేడు సంవత్సరాల వయసులో కెరీర్ ప్రారంభించిన ఏక్తా కపూర్ హిందీలో ఎన్నో టీవీ సోప్ ఒపెరాలను నిర్మించింది. ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ’ ‘కహాని ఘర్ ఘర్ కీ’... వంటివి వాటిలో బాగా పాపులర్ అయ్యాయి.
‘బాలాజీ మోషన్ పిక్చర్స్’ బ్యానర్‌పై నిర్మాతగా ‘ది డర్టీ పిక్చర్’ ‘డ్రీమ్ గర్ల్’ ‘క్రూ’లాంటి సినిమాలు నిర్మించింది. 2017లో వీడియో ఆన్ డిమాండ్ ప్లాట్‌ఫామ్ ‘ఆల్ట్ బాలాజీ’ప్రారంభించింది.
ఏక్తా కపూర్‌ది నల్లేరు మీద నడకేమీ కాదు. మొదట్లో కొన్ని ప్రాజెక్ట్‌లు ఫెయిల్ అయ్యాయి. ఆరు పైలట్ ఎపిసోడ్‌లు రిజెక్ట్ అయ్యాయి.
‘హమ్ పాంచ్’ టీవీ సిరీస్ రూపంలో తొలి సక్సెస్ వచ్చింది. ఇక ఆ తరవాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆంగ్ల ఆక్షరం ‘కె’ను లక్కీ ఆల్ఫాబెట్‌గా భావించే ఏక్తా ‘కె’తో ప్రారంభమయ్యే టైటిల్‌తో ఎన్నో షోలు నిర్మించింది. ఏక్తాకపూర్ అదృష్టాన్ని నమ్ముకుందా, తన కష్టాన్ని నమ్ముకుందా అనే విషయానికి వస్తే... ఒక ప్రసిద్ధ మాటను గుర్తు తెచ్చుకోవడం అవసరం.‘కష్టపడేవారినే అదృష్టం ఇష్టపడుతుంది’‘కింగ్‌డమ్ ఆఫ్ ది సోప్ క్వీన్: దీ స్టోరీ ఆఫ్ బాలజీ టెలిఫిల్మ్’ పేరుతో ఏక్తా కపూర్ బయోగ్రఫీ వచ్చింది.