ఆడపులులం మేము | Indian actresses ready to play action | Sakshi
Sakshi News home page

ఆడపులులం మేము

May 27 2026 12:38 AM | Updated on May 27 2026 12:38 AM

Indian actresses ready to play action

డిష్యుం డిష్యుంకి సై అంటున్న కథానాయికలు

ఆడపిల్ల కదా... సిల్వర్‌ స్క్రీన్‌పై ఆడుతూపాడుతూ గ్లామరస్‌గా కనిపిస్తే చాలు అనే రోజులు పోయాయి. గ్లామర్‌ని పక్కన పెట్టి, సిల్వర్‌ స్క్రీన్‌పై డిష్యుం డిష్యుంకి సై అంటున్న రోజులు వచ్చాయి. మెరుపు తీగలా కనిపించే కథానాయికలు సినిమాలో విలన్లపై మెరుపు దాడి చేయడానికి ట్రైనింగ్‌ తీసుకుని మరీ సెట్లోకి ఎంటరవుతున్నారు. దీపికా పదుకోన్‌ వంటి సీనియర్‌ హీరోయిన్‌ మాత్రమే కాదు... రష్మికా మందన్నా, సంయుక్త, ఆలియా భట్, కృతీ సనన్‌... ఇలా పలువురు యంగ్‌ హీరోయిన్స్‌ పవర్‌ఫుల్‌ రోల్స్‌ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్స్‌ కోసం గుర్రపు స్వారీ, కత్తి సాము, గన్‌ షూట్‌ వంటి వాటిలో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ‘ఆడపులులం మేము’ అంటూ ఈ హీరోయిన్లు ఏయే చిత్రాల్లో పవర్‌ఫుల్‌గా కనిపించనున్నారో తెలుసుకుందాం...

‘మైసా’ కోసం మార్షల్‌ ఆర్ట్స్‌
ఒకపాత్ర ఒప్పుకుంటే ఆపాత్రలానే మారిపోవాలనుకుంటారు రష్మికా మందన్నా. ఆ క్యారెక్టర్‌కి న్యాయం చేయడానికి ఎంత రిస్క్‌ అయినా తీసుకుంటారు. ‘మైసా’ సినిమాలోని మైసాపాత్ర కోసం ఈ బ్యూటీ తీసుకున్న ఓ రిస్క్‌ 80 అడుగుల ఎత్తు నుంచి దూకడం. నిజానికి ఈ సన్నివేశాన్ని డూప్‌తో చేయిద్దామని యూనిట్‌ అన్నప్పటికీ ‘నో నో’ అంటూ, తానే  చేశారు. ఇంకా ఈ సినిమా కోసం బోలెడన్ని రిస్కీ ఫైట్స్‌ చేస్తున్నారామె. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ కోసం రష్మిక థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా స్టంట్స్, మార్షల్‌ ఆర్ట్స్‌లో కఠోర శిక్షణ తీసుకున్నారు.

రోజుకు దాదాపు 8 గంటలపాటు అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో ఈ శిక్షణ సాగింది. హ్యాండ్‌ టు హ్యాండ్‌ ఫైట్స్, అధునాతన స్టంట్‌ టెక్నిక్స్‌ వంటివి నేర్చుకున్నారు. ఆ ట్రైనింగ్‌ పూర్తయ్యాక కేరళలో తీసిన యాక్షన్‌ సీక్వెన్స్‌లో భాగంగా 80 అడుగుల ఎత్తు నుంచి దూకారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మైసా అనే గిరిజన గోండు యువతిపాత్రలో కనిపించనున్నారు రష్మిక. ఈ షెడ్యూల్‌ కోసమే రష్మిక బ్యాంకాక్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. అంతర్జాతీయ యాక్షన్‌ డైరెక్టర్‌ ఆండీ లాంగ్‌ ఈ చిత్రానికి స్టంట్స్‌ పర్యవేక్షిస్తున్నారు. ఈ యాక్షన్‌ ఎమోషనల్‌ థ్రిల్లర్‌ ఈ ఏడాదే విడుదల కానుంది.

కత్తి సాముకి సై
క్యారెక్టర్‌ డిమాండ్‌ మేరకు నటించడానికి కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు వచ్చేస్తా అంటున్నారు సంయుక్త. అనడమే కాదు... ఆ పని చేశారు కూడా. ‘స్వయంభు’ సినిమాలో చేసిన యోధురాలిపాత్ర కోసం ఆమె గుర్రపు స్వారీ నేర్చుకున్నారు, కత్తి సాములో శిక్షణ తీసుకున్నారు. ప్రముఖ స్టంట్‌ మాస్టర్‌ కింగ్‌ సాల్మన్‌ పర్యవేక్షణలో ఆమె ఈ యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. అంతే కాదు... ఈ పోరాట సన్నివేశాలు చిత్రీకరించే రోజు షూటింగ్‌కు దాదాపు నాలుగైదు గంటల ముందు ప్రాక్టీస్‌ సెషన్స్‌లోపాల్గొన్నారు. ఈ చిత్రంలోని యాక్షన్‌ సన్నివేశాలను దట్టమైన అడవుల నేపథ్యంలో చిత్రీకరించారు. అందువల్ల శిక్షణను కూడా అదే తరహా వాతావరణంలో, కొండలు గుట్టలు వంటి కఠినమైన భూభాగాలకు అలవాటు పడేలా నిర్వహించారు. ఇక ఈ భారీపాన్‌ ఇండియన్‌ మూవీలోనిపాత్ర కోసం హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ కఠినమైన యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

ఎనిమిది మంది ఫైటర్స్‌తో దీపిక ఫైట్‌
ఇరవై ఏళ్లయింది దీపికా పదుకోన్‌ సినిమాల్లోకి వచ్చి. ఇన్నేళ్లల్లో గ్లామరస్‌ క్యారెక్టర్స్‌తోపాటు పూర్తిగా పర్ఫార్మెన్స్‌ ఓరియంటెడ్‌ క్యారెక్టర్స్‌ కూడా చేశారు. అలాగే ‘పఠాన్, జవాన్, ఫైటర్‌’ వంటి సినిమాల్లో యాక్షన్‌ రోల్స్‌ చేశారు. ‘ఫైటర్‌’ సినిమా కోసం ఆమె మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా నేర్చుకున్నారు. తాజాగా చేస్తున్న ‘కింగ్‌’ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు కానీ... స్టంట్‌ రిహార్శల్స్‌ చేశారట. ఈ చిత్రంలో ఒకేసారి ఎనిమిది మంది ఫైటర్స్‌తో దీపిక ఫైట్‌ చేసే యాక్షన్‌ సీన్‌ ఉందని సమాచారం. అలాగే ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ని సౌత్‌ ఆఫ్రికాలో చిత్రీకరించారని టాక్‌. ఈ భారీ ఫైట్‌లో షారుక్, దీపిక, సుహానాపాల్గొన్నారట. 

ఒక నటి 20 ఏళ్ల తర్వాత కూడా ఉత్సాహంగా యాక్షన్‌ రోల్స్‌ ఒప్పుకోవడం, రిహార్సల్స్‌ చేసి మరీ చేయడం అనేది అభినందించదగ్గ విషయం. ఇదిలా ఉంటే... అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాకా’ సినిమాలోనూ దీపికా పదుకోన్‌ ఓ పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి. ‘కింగ్‌’ సినిమాకి ముందే ట్రైనింగ్‌ తీసుకుని, యాక్షన్‌ సీన్స్‌ చేశారు దీపికా పదుకోన్‌. అయితే గర్భవతి కావడంతో ‘రాకా’లోని యాక్షన్‌ సీన్స్‌ని ఆమెకు బదులు డూప్‌తో చేయించాలనుకుంటున్నారట. కాగా ‘కింగ్‌’ సినిమా కోసం యువ నటి సుహానా కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్‌ తీసుకున్నారు. ఆ విశేషాల్లోకి వస్తే...

సుహానా... షూట్‌కి రెడీ
‘రెడీ టు షూట్‌’ అంటూ సిల్వర్‌ స్క్రీన్‌ పైకి రావడం రావడమే సుహానా ఖాన్‌ ‘కింగ్‌’ చిత్రంతో తుపాకీతో ఎంట్రీ ఇస్తున్నారు. మామూలుగా ‘స్టార్‌ కిడ్స్‌’పై ఎన్ని అంచనాలు ఉంటాయో షారుక్‌ ఖాన్‌ తనయగా సుహానా మీద అన్నీ ఉన్నాయి. 2023లో చేసిన ‘ది ఆర్చీస్‌’ సుహానాకి తొలి సినిమా. అయితే ఆ సినిమా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. సో... ‘కింగ్‌’ వంటి భారీ యాక్షన్‌ సినిమాతో సుహానా వెండితెరపైకి వస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్‌ ఒక క్రూరమైన, అసలు ఏమాత్రం పశ్చాత్తాపం లేని హంతకుడిపాత్రలో కనిపిస్తారట. ఆయనపాత్ర రెండు టైమ్‌లైన్స్‌లో ఉంటుందని సమాచారం.

ఒకటి గ్యాంగ్‌స్టర్‌ క్యారెక్టర్‌ అని టాక్‌. ఈ చిత్రంలో షారుక్‌ శిష్యురాలిపాత్రను సుహానా చేస్తున్నారు. షారుక్‌ దగ్గర యాక్షన్‌ ట్రైనింగ్‌ తీసుకునేలా ఈపాత్ర ఉంటుందని తెలిసింది. ఇక ఇది పూర్తిగా యాక్షన్‌ క్యారెక్టర్‌ కావడంతో ‘కింగ్‌’ షూటింగ్‌ ఆరంభించే ముందు దాదాపు ఆరు నెలలపాటు అంతర్జాతీయ శిక్షకుల వద్ద మార్షల్‌ ఆర్ట్స్, గన్‌ షూట్‌ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నారు సుహానా. ఈ షూటింగ్‌ లొకేషన్‌లో కుమార్తెకు షారుక్‌ కూడా కొన్ని యాక్షన్‌ మెళకువలు నేర్పిస్తున్నారట. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీలో అభిషేక్‌ బచ్చన్, అనిల్‌ కపూర్, రాణీ ముఖర్జీ, దీపికా పదుకోన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్‌కి ‘కింగ్‌’ని విడుదల చేయాలనుకుంటున్నారు.

ఫైట్‌కే కాదు...పాటకూ ట్రైనింగ్‌
స్పై ఏజెంట్‌ క్యారెక్టర్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు... బ్రెయిన్‌తో ఆలోచించి, ప్రత్యర్థిని ట్రాప్‌ చేయాలి, బాడీ పవర్‌ని ఉపయోగించి రఫ్ఫాడించాలి. సిల్వర్‌ స్క్రీన్‌పై మెరుపు తీగల్లా కనిపించే ఆలియా భట్, శార్వరి ఈ స్పై క్యారెక్టర్‌ చేశారు. ఆ సినిమానే యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ నిర్మించిన ‘ఆల్ఫా’. బాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థ అయిన యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ నుంచి స్పై సినిమాలు చాలా వచ్చాయి. కానీ అవన్నీ హీరో ఓరియంటెడ్‌ సినిమాలు. ఈ సంస్థలో స్పై యూనివర్స్‌లో రూపొందిన తొలి మహిళా ప్రధాన చిత్రం ‘ఆల్ఫా’. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ స్పై ఏజెంట్లుగా ఒదిగిపోవడానికి ఆలియా, శార్వరి ఫిట్‌నెస్‌తోపాటు మార్షల్‌ ఆర్ట్స్‌లో కూడా ట్రైనింగ్‌ తీసుకున్నారు.

జిమ్‌లో ఫంక్షనల్‌ ట్రైనింగ్, స్ట్రెంగ్త్‌ ఎక్సర్‌సైజెస్‌ చేస్తూ, పూర్తిగా యాక్షన్‌ మోడ్‌లో ఉన్న వీడియోలను ఆలియా షేర్‌ చేయగా, అవి వైరల్‌ అయ్యాయి. విశేషం ఏంటంటే... ఫైట్స్‌కి మాత్రమే కాదు... ఈ సినిమాలోని ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం కూడా ఆలియా, శార్వరి కఠినమైన వర్కౌట్స్‌ చేశారట. ఈపాట డ్యాన్స్‌ మూమెంట్స్‌ ఎక్కువ స్టామినాని డిమాండ్‌ చేయడంతో ఈ వర్కౌట్స్‌ చేశారని తెలిసింది. ఇద్దరూపాల్గొన్న ఫైట్స్, ఈ స్పెషల్‌ సాంగ్‌ సినిమాకే హైలైట్‌గా ఉంటాయని బాలీవుడ్‌ టాక్‌. శివ్‌ రావైల్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ఆల్ఫా’ జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఏజెంట్‌గా ఫైట్‌
ఆలియా, శార్వరిలానే వామికా గబ్బి కూడా స్పై క్యారెక్టర్‌ చేస్తున్నారు. ప్రత్యర్థులపై తుపాకీ ఎక్కు పెట్టి, ఏజెంట్‌గా సిల్వర్‌ స్క్రీన్‌పై విజృంభించడానికి వామికా శిక్షణ తీసుకున్నారు. ‘జీ 2’ సినిమా కోçసమే వామికా గబ్బి ట్రైనింగ్‌ తీసుకుని మరీ సెట్స్‌లోకి ఎంటరయ్యారు. అడివి శేష్‌ హీరోగా నటించిన ‘గూఢచారి’కి (2018) సీక్వెల్‌గా ‘జీ 2’ రూపొందుతోంది. ఈ చిత్రంలో ఏజెంట్‌ గోపి 116పాత్ర చేశారు శేష్‌. సీక్వెల్‌లోనూ ఈపాత్ర చేస్తున్నారు. ఏజెంట్‌ మహాలక్ష్మి నాగిన్‌గా వామికా గబ్బి నటిస్తున్నారు. ఈ సినిమాకి వినయ్‌ కుమార్‌ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులోని యాక్షన్‌ సీన్స్, స్పై మిషన్స్, ఫిట్‌నెస్‌కి సంబంధించి వామికా గబ్బి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. కాగా ఈ సినిమా కోసం యూరప్‌లో చిత్రీకరించిన ఒక భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ హైలైట్‌గా ఉంటుందని తెలిసింది. ఇక 2015లో ‘భలే మంచి రోజు’ చిత్రం ద్వారా వామికా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత పంజాబీ, హిందీ మలయాళం వంటి భాషల్లో నటించిన వామికా ‘జీ 2’తో మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నారు. ‘భలే మంచి రోజు’లో ట్రెడిషనల్‌ క్యారెక్టర్‌లో కనిపించిన వామిక ‘జీ 2’లో పూర్తి భిన్నంగా చాలా పవర్‌ఫుల్‌గా కనిపించనున్నారు. ఈపాన్‌ ఇండియన్‌ స్పై యాక్షన్‌ మూవీ పలు భాషల్లో ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.

ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా ట్రైనింగ్‌
గ్లామరస్, డీ గ్లామరస్, ట్రెడిషనల్‌... ఏ క్యారెక్టర్‌ అయినా చేయడానికి రెడీ అంటారు కృతీ సనన్‌. ‘ఆది పురుష్‌’లో సీతగా కనిపించిన ఈ బ్యూటీ ‘మిమీ’లో సరోగేట్‌ మదర్‌ క్యారెక్టర్‌లో ఒదిగిపోయారు. త్వరలో విడుదల కానున్న ‘కాక్‌టెయిల్‌ 2’లో గ్లామరస్‌గా కనిపించనున్నారు. ఇప్పుడు తనలోని పూర్తి స్థాయి యాక్షన్‌ నటిని ఆవిష్కరించుకోవడానికి కృతి కసరత్తులు చేస్తున్నారట. మరి... ఈ బ్యూటీకి వచ్చిన ఆఫర్‌ అలాంటిది. బాలీవుడ్‌ భారీ మాస్‌ సినిమాల్లో ఒకటైన ‘డాన్‌’ సిరీస్‌లో నటించే చాన్స్‌ కృతీకి దక్కిందని సమాచారం. ‘డాన్, డాన్‌ 2’ చిత్రాల తర్వాత దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌ ‘డాన్‌ 3’ చేయనున్న విషయం తెలిసిందే.

రెండు భాగాల్లో డాన్‌గా షారుక్‌ ఖాన్, ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌ రోమాగా ప్రియాంకా చోప్రా నటించారు. అయితే మూడో భాగంలో రణ్‌వీర్‌ సింగ్‌ని డాన్‌పాత్రకు తీసుకున్నారు ఫర్హాన్‌ అక్తర్‌. కానీ, ఈ సినిమా నుంచి రణ్‌వీర్‌ తప్పుకున్నారు. ఇక షూటింగ్‌ ఆరంభించడమే ఆలస్యం అనే తరుణంలో సరిగ్గా మూడు వారాల ముందు రణ్‌వీర్‌ తప్పుకున్నారట. ఈ విషయంలో రణ్‌వీర్‌–ఫర్హాన్‌ మధ్య వివాదం నెలకొంది. ముందు నటిస్తానని చెప్పి, తర్వాత తప్పుకోవడంతో రణ్‌వీర్‌కి సహాయ సహకారాలు అందించకూడదని ముంబైకి చెందిన ‘ఫిల్మ్‌ బాడీ’ నిర్ణయించుకుంది.

అలాగే నష్టపరిహారం కింద రణ్‌వీర్‌ తనకు రూ. 45 కోట్లు ఇవ్వాలని ఫర్హాన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. మరి... ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందనేది కాలమే చెప్పాలి. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌ రోమాపాత్రకు కృతీ సనన్‌ని ఎంపిక చేశారని భోగట్టా. ‘డాన్‌’ సిరీస్‌లో ఈపాత్రకు యాక్షన్‌ సీన్స్‌ ఉన్నట్లే మూడో భాగంలోనూ ఉంటాయి. దాంతో కృతీ సనన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ట్రైనింగ్‌ తీసుకుంటున్నారనే వార్త వినిపిస్తోంది.

అయితే కృతీ సనన్‌ని ఈ చిత్రానికి ఎంపిక చేసినట్లు యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఫర్హాన్‌ అక్తర్‌ ఆఫీస్‌ వద్ద కృతి పలుమార్లు కనిపించడంతో ‘డాన్‌ 3’ చర్చల్లోపాల్గొనడానికే అని ప్రచారంలో ఉన్న వార్తకు బలం చేకూరినట్లయింది. ఇక ఈ సినిమాని 2023లోనే ప్రకటించారు ఫర్హాన్‌. అయితే ఇప్పటివరకూ షూటింగ్‌ ఆరంభించలేదు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ తారలే కాదు... మరికొంత మంది కూడా క్యారెక్టర్‌ డిమాండ్‌ మేరకు కసరత్తులు చేసి, సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారు. రిస్క్‌ తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడకుండాపాత్రల్లో ఒదిగిపోతున్న ఈ కథానాయికలను అభినందించాల్సిందే.   – డి.జి. భవాని 

Advertisement
 
Advertisement
Advertisement