
‘‘హీరో.. డైరెక్టర్.. నిర్మాత.. ఇలా ఓ సినిమాకి పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ సినిమా విజయం సాధించాలనే కోరుకుంటారు. అయితే అన్ని సినిమాలూ విజయం సాధిస్తాయని చెప్పలేం. వందశాతం ఎఫర్ట్ పెట్టి పనిచేయడమే నా చేతుల్లో ఉంటుంది. హిట్లు, ఫ్లాపులు అనేవి నా చేతుల్లో ఉండవు.. వాటిని నిర్ణయించేది ప్రేక్షకులే. ఓ సినిమా ఫలితం ఎలా ఉన్నా పాజిటివ్‌గానే తీసుకోవాలి’’ అని హీరో హృతిక్ రోషన్ తెలిపారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వార్ 2’.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల అయింది. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ విషయంపై హృతిక్ రోషన్ తాజాగా స్పందించారు.
‘‘వార్ 2’ కోసం అయాన్ ముఖర్జీ చాలా కష్టపడ్డారు. తన ఎనర్జీ చూసి నాకు కూడా ఎంతో ఉత్సాహంగా పని చేయాలనిపించేది. ఈప్రాజెక్ట్ గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి కబీర్ పాత్రను చాలా సరదాగా పూర్తి చేశాను. ఒక నటుడిగా మన బాధ్యతను 100 శాతం పూర్తి చే యాలి. ఫలితం ఎలా ఉన్నా ప్రతి దాన్ని సీరియస్‌గా కాకుండా ఈజీగానే తీసుకోవాలి. అన్ని సినిమాలూ హిట్ అవుతాయనే నమ్మకంతోనే చేస్తాం. కానీ, ఫలితం మాత్రం ప్రేక్షకులే ఇస్తారు. వీటన్నిటినీ మనం పాజిటివ్‌గానే తీసుకోవాలి’’ అంటూ హృతిక్ రోషన్‌పోస్ట్ చేశారు.