ఆసక్తి గొలిపే చర్చలతో వేవ్స్‌ | Hero Nagarjuna On why Pushpa And KGF Turned Into Hindi Blockbusters Waves 2025 | Sakshi
Sakshi News home page

ఆసక్తి గొలిపే చర్చలతో వేవ్స్‌

May 3 2025 12:30 AM | Updated on May 3 2025 9:26 AM

Hero Nagarjuna On why Pushpa And KGF Turned Into Hindi Blockbusters Waves 2025

‘వేవ్స్‌’లో హీరో నాగార్జున మాట్లాడుతూ– ‘‘పుష్ప’ సిరీస్‌ సినిమాలు తెలుగు కంటే వేరే భాషల్లో ఎక్కువగా వసూళ్లు సాధించాయి. వందలో దాదాపు తొంభై మంది తమ ఒత్తిడి పొంగొట్టుకునేందుకు తెరపై జరిగే మ్యాజిక్‌ (సినిమాలు) చూసేందుకు ఇష్టపడుతుంటారు. నేటితరం ప్రేక్షకులు కథానాయకులను పుష్పరాజ్‌ (‘పుష్ప’లో అల్లు అర్జున్‌), రాఖీ భాయ్‌ (‘కేజీయఫ్‌’లో యశ్‌), బాహుబలి (‘బాహుబలి’లో ప్రభాస్‌) లాంటి లార్జర్‌ దేన్  లైఫ్‌ రోల్స్‌లో చూడాలనుకుంటున్నారు. నేనూ దాన్నే ఇష్టపడతాను. కేవలం హీరోల ఎలివేషన్‌ ఒక్కటే కాదు.. బలమైన కథలతోనే ఆయా చిత్రాలు బ్లాక్‌బస్టర్‌ అయ్యాయి. రాజమౌళి ‘బాహుబలి’ సినిమాని తెలుగులోనే తెరకెక్కించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆదరించారు’’ అన్నారు.

భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నాలుగు రోజుల వరల్డ్‌ ఆడియో, విజువల్‌ అండ్‌ ఎంటర్టైన్మెంట్‌ సమ్మిట్‌ (వేవ్స్‌) – 2025 రెండో రోజు సైతం అట్టహాసంగా సాగింది. ముంబైలోని జియో వరల్డ్‌ సెంటర్‌ వేదికగా జాతీయ, అంతర్జాతీయ సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు, ఔత్సాహిక సినీ రూపకర్తలు శుక్రవారం పెద్ద ఎత్తున సమ్మిట్‌కు హాజరయ్యారు. వివిధ వేదికలపై చర్చాగోష్ఠులు, ముఖాముఖీలు కొనసాగాయి.

మీడియా – వినోద రంగంలో వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలనూ, వ్యూహాలనూ పరస్పరం పంచుకొనేందుకు వీలుగా గ్లోబల్‌ మీడియా డైలాగ్‌ అలాగే, క్రియేట్‌ ఇండియా ఛాలెంజ్‌ పొంటీలోని విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. వేవ్స్‌ బజార్‌ వేదికగా వివిధ చిత్ర నిర్మాణ సంస్థలు, వ్యక్తుల మధ్య కంటెంట్‌ మార్కెటింగ్‌ అవకాశాల అన్వేషణ నడిచింది.

భవిష్యత్తులో స్టూడియోలు, సాఫ్ట్‌ పవర్‌గా సినిమా, డిజిటల్‌ యుగంలో మారుతున్న కథాకథన రీతులు, మారుతున్న భారతీయ సినిమా ముఖచిత్రం తదితర అంశాలపై చర్చాగోష్ఠులు జరిగాయి. దక్షిణాది సినీ ప్రముఖులు నాగార్జున, విజయ్‌ దేవరకొండ, అమల అక్కినేని, సుప్రియ యార్లగడ్డ, ఖుష్బూ, కార్తి, రవి మోహన్, హిందీ చిత్ర సీమ నుంచి అనుపమ్‌ ఖేర్, ఆమిర్‌ ఖాన్, కరణ్‌ జోహార్, కరీనా కపూర్, సోనాలీ కులకర్ణి, ‘ఆదిపురుష్‌’ చిత్రదర్శకుడు ఓం రౌత్, ఆస్కార్‌ అవార్డు గెల్చిన మహిళా నిర్మాత గునీత్‌ మోంగా సదస్సుప్రాంగణంలో ఉత్సాహంగా చర్చల్లో పాల్గొన్నారు.

కృత్రిమ మేధ (ఏఐ) రాకపై ఆసిడెంట్‌ రిచర్డ్‌ జి. కెర్రీస్‌ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌లో ఆసక్తికరంగా వివరించారు. హాలు మొత్తం ప్రేక్షకులతో కిక్కిరిసి పొంగా, మీడియా దిగ్గజం అరుణ్‌ పురీ సహా పలువురు కెర్రీస్‌ తెరపై చూపిన ఏఐ ఆధారిత సినిమా వీడియోలను చూశారు. ఫుగటో లాంటి సాఫ్ట్‌ వేర్లతో ఆడియోలో సౌండ్‌ ఎఫెక్ట్‌ల మొదలు సంగీత బాణీల దాకా ఎలా మార్చుకోవచ్చో సమావేశంలో వివరించిన తీరు హర్షధ్వానాలు అందుకుంది. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చేరువ చేయడమనే అంశంపై నీతా అంబానీ ఇచ్చిన కీలకోపన్యాసం ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

‘‘ఇవాళ మన దేశానికి అతి పెద్ద మార్కెటింగ్‌ సాధనం... సినిమా. నేను కశ్మీర్‌లో షూటింగ్‌ చేస్తున్నా, నన్ను జనం గుర్తు పడుతున్నారంటే దానికి సినిమాయే కారణం! మనం మన (సినీ) సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకోవాల్సి ఉంది. దేశం సరిహద్దులు దాటి మన సినిమా ముందుకు వెళ్ళాలంటే, అక్కడా మన సినిమాల డిస్ట్రిబ్యూషన్‌ను పెంచుకోవడమే మార్గం. అలాగే, బాక్సాఫీస్‌ వద్ద మన సినిమాల జోరు పెరగాలంటే, వివిధ భాషల నటులు కలసి సినిమాలు చేయాలి’’. – హీరో విజయ్‌ దేవరకొండ

హీరో ఆమిర్‌ ఖాన్  మాట్లాడుతూ– ‘‘ఇండియాలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా మంచి డిస్ట్రిబ్యూషన్  నెట్‌వర్క్‌ ఉండాలి. విదేశాల్లో డిస్ట్రిబ్యూషన్  గురించి మన నిర్మాతలు ఆలోచిస్తే మార్పు మొదలవుతుంది. దేశవ్యాప్తంగా మరిన్ని స్క్రీన్ ్స పెంచేందుకు ఇన్వెస్ట్‌ చేయాల్సిన అవసరం చాలా ఉంది’’ అన్నారు.

‘‘లార్జర్‌ దేన్‌ లైఫ్‌ పాత్రలతో పాటు కుటుంబాన్ని ప్రేమిస్తూ, కుటుంబ సభ్యుల కోసం ఏమైనా చేసే పాత్రలనూ ప్రేక్షకులు ఇవాళ ప్రేమిస్తున్నారు. ఇవాళ ప్యాన్‌ ఇండియా అనేది ఫ్యాషన్‌ అయిపొంయింది. అసలు ఈ కంగాళీ పదం రాక ముందే మన మణిరత్నం తీసిన ‘రోజా, బొంబాయి’ లాంటివి అఖిల భారత చిత్రాలే కదా. అవన్నీ భాష,ప్రాంతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్నాయి’’.  – నటి ఖుష్బూ

‘‘ఇవాళ ఓటీటీ సహా అనేక రకాల కంటెంట్‌ అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రేక్షకులు హీరో వీరోచిత విన్యాసాలు, ఊహల్లో విహరింపజేసే భారీ పాటలు, డ్యాన్సులు చూసేందుకు సినిమా హాళ్ళకు వస్తున్నారు. అయితే, ప్రతిదీ భారీ, ప్యాన్‌ ఇండియా సినిమా కావాల్సిన పని లేదు. మంచి కథతో, చిన్న సినిమాలూ రావాలి’’. – హీరో కార్తి

‘‘ఏ తెరపై ఏ కథ చెప్పినా... నిజాయతీగా, భావోద్వేగభరితంగా చెప్పడం కీలకం. ప్రేక్షకులు తెరపై ఎంత భారీతనాన్ని ఇష్టపడినప్పటికీ, సినిమా రూపకర్తలోని ఆ  నిజాయతీ, నిబద్ధతను ఇట్టే గమనిస్తారు. ఆస్వాదిస్తారు, అభినందిస్తారు. సినిమా విజయానికి అదే ప్రధాన సూత్రం’’.  – నటుడు అనుపమ్‌ ఖేర్‌

‘‘స్టోరీ టెల్లింగ్, కంటెంట్‌ క్రియేషన్‌ లాంటి పెద్ద పెద్ద మాటలు చెబుతాం కానీ, ప్రేక్షకులకు నచ్చిందా, లేదా అన్నదే ఆఖరికి మిగిలే అసలు పాయింట్‌. అంతే. ఎంచుకున్న ఆలోచనను బలంగా నమ్మాలి. అలా నమ్మిన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి’’. – సుప్రియ యార్లగడ్డ, నిర్మాత, అన్నపూర్ణా స్టూడియోస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌

‘‘ఉత్తరాది, దక్షిణాది లాంటి చీలికలు, భేదాల చుట్టూ తిరగకుండా, ఏది గొప్ప, ఏది తక్కువ అనే వాదన కన్నా, మనది భారతీయ సినిమా అనే భావన చాలా ముఖ్యం. భారతీయ సినిమా అంటే ఇదీ అని చూపాలంటే, నేను గురుదత్‌ తీసిన ‘కాగజ్‌ కే ఫూల్, ప్యాసా’ లాంటి సినిమాలు ప్రపంచానికి చూపాలంటాను’’. – దర్శక – నిర్మాత కరణ్‌ జోహార్‌

‘‘కరోనా తర్వాత తమిళ సినిమాను తీసే విధానం, జనం చూసే విధానం కూడా మారాయి. రకరకాల వేదికలపై ఇప్పుడు కంటెంట్‌ అందుబాటులో ఉంది. మొబైల్‌తో కూడా సినిమా తీసేయచ్చు. అందులోనే రిలీజ్‌ చేయవచ్చు. చూడవచ్చు. అది ఒక మార్గం, అదనపు చేర్పు. అంతే తప్ప భారీ వెండితెర వినోదం మాత్రం ఎన్నటికీ చెరిగిపొందు, కరిగిపొందు’’.      – తమిళ హీరో ‘జయం’ రవి

Advertisement
 
Advertisement
Advertisement