సాయికుమార్‌ గోల్డెన్‌ జూబ్లీ | Golden Jubilee For Sai Kumar In Cinema Industry | Sakshi
Sakshi News home page

సాయికుమార్‌ గోల్డెన్‌ జూబ్లీ

Jan 10 2025 5:06 AM | Updated on Jan 10 2025 5:06 AM

Golden Jubilee For Sai Kumar In Cinema Industry

‘‘కనిపించే ఈ మూడు సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే, కనిపించని ఆ నాలుగో సింహమేరా..పోలీస్‌...’ అనే డైలాగ్‌ వింటే... వెంటనే సాయికుమార్‌ అని ఆడియన్స్‌ చెప్పేస్తారు. అంటూ ‘పోలీస్‌ స్టోరీ’లో ఆయన తనదైన శైలిలో పవర్‌ఫుల్‌గా చెప్పి, ఆకట్టుకున్నారు. నటుడిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సాయికుమార్‌ ఇండస్ట్రీలోకి వచ్చి యాభై సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సాయికుమార్‌ గురించి కొన్ని విశేషాలు...

1972 అక్టోబరు 20న ‘మయసభ’ అనే నాటకంలో దుర్యోధనుడిపాత్ర కోసం తొలిసారి మేకప్‌ వేసుకున్నారు సాయికుమార్‌. ఆయన వెండితెర ప్రయాణం ‘దేవుడు చేసిన పెళ్లి’ చిత్రంతో జరిగింది. బాపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయికుమార్‌ బాలనటుడిగా చేశారు. ఈ మూవీ 1975 జనవరి 9న రిలీజైంది. గురువారంతో (జనవరి 9) వెండితెరపై సాయికుమార్‌ యాభైఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.

ముందు డబ్బింగ్‌ ఆర్టిస్టుగానే కెరీర్‌ మొదలుపెట్టారు సాయికుమార్‌. ఆ తర్వాత ‘ఛాలెంజ్, కలికాలం, మేజర్‌ చంద్రకాంత్‌’ వంటి తెలుగు సినిమాల్లో నటిస్తూనే, ‘తయ్యల్‌క్కారన్, కావల్‌ గీతమ్‌’ వంటి తమిళ సినిమాల్లోనూ నటించారు. 1996లో సాయికుమార్‌ హీరోగా వచ్చిన కన్నడ చిత్రం ‘పోలీసు స్టోరీ’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలోని సాయి కుమార్‌ నటనకు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో అనువాదమై, విజయం సాధించింది. ‘పోలీసు స్టోరీ’ తర్వాత ఆయనపాతిక చిత్రాల్లోపోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. ఇక తెలుగులో ‘అమ్మ రాజీనామా, కర్తవ్యం, అంతఃపురం, ఈశ్వర్‌ అల్లా, జగద్గురు ఆది శంకర, ఎవడు, పటాస్, పండుగ చేస్కో, భలే మంచి రోజు, సరైనోడు, జనతా గారేజ్, ఓం నమో వెంకటేశాయ,  జై లవ కుశ, రాజా ది గ్రేట్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, మహర్షి, ఎస్‌ఆర్‌ కల్యాణమండపం, దసరా, సార్‌...’ ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో సాయికుమార్‌ నటించారు.

50 ఏళ్ల కెరీర్‌లో హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మెప్పించిన సాయికుమార్‌ విలన్‌గానూ నిరూపించుకున్నారు. ‘సామాన్యుడు, ప్రస్థానం, ఎవడు..’ వంటి చిత్రాల్లో విలన్‌గా చేశారు. కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాకుండా, బుల్లితెరపై రాణిస్తున్నారు సాయికుమార్‌. ఇక ఆయన తమ్ముళ్లు అయ్యప్ప పి.శర్మ, పి. రవిశంకర్‌ డబ్బింగ్‌ ఆర్టిస్టులుగా, నటులుగా సినిమా రంగంలోనే రాణిస్తున్నారు. ఆయన కొడుకు ఆది సాయికుమార్‌ హీరోగా చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement