యశవంతపుర (కర్ణాటక): టీవీ సీరియళ్ల కథల గురించి అందరికీ తెలిసిందే. అందులో పాత్రధారులు నిరంతరం కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారు. అదేమాదిరి ఓ నటి నిజ జీవితంలోనూ ప్రవర్తించింది. కన్నడ టీవీ సీరియల్స్‌లో నటించి పేరుపొందిన నటీమణి ఆశా జోయిస్ (Asha Jois) నేరారోపణల్లో చిక్కుకుంది. ఓ మహిళ ప్రైవేట్ వీడియో, ఫోటోలను దొంగతనం చేసి రూ.2 కోట్లు ఇవ్వాలని బెదిరించినట్లు బెంగళూరు నగర తిలక్ నగర ఠాణాలో ఫిర్యాదు దాఖలైంది. పార్వతి (61) అనే మహిళ ఈ మేరకు ఫిర్యాదు చేసింది.
డబ్బు ఇవ్వకపోవడంతో..
ఆశా జోయిస్.. 2016లో మిస్ ఇండియా ప్లానెట్ పోటీలలో విజేతగా నిలిచింది. టీవీ సీరియల్స్‌లోనూ నటించింది. తర్వాత బాధిత మహిళ పార్వతితో స్నేహం పెంచుకుంది. తాను టీవీ నటి అని చెప్పుకుంది. ఈ నేపథ్యంలో ఆశా.. బాధితురాలి వీడియోలను సేకరించి ఆమె భర్తను డబ్బు కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించింది. ఇందుకు వారు తిరస్కరించడంతో వీడియోలు, ఫోటోలు, వాయిస్ రికార్డ్‌లను బాధితురాలికి తెలిసినవారికి పంపించింది. దీనివల్ల అందరి ముందు అభాసుపాలయ్యాని, ఘోర అవమానం జరిగిందంటూ బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
చదవండి: నారా రోహిత్-శిరీష పెళ్లి సందడి: హల్దీ వీడియో చూశారా?


