
‘‘కల్యాణి ప్రియదర్శన్ నాకు చెల్లిలాంటిది. మేమిద్దరం ఒకేలా ఉంటాం, ఒకేలా ఆలోచిస్తాం. చంద్ర పాత్ర కోసం తను తప్ప మా మైండ్‌లోకి వేరే ఎవరి పేరు రాలేదు. నన్ను ఎలాగైతే మీవాడిగా భావించారో అలాగే నేను నిర్మించిన ‘కొత్త లోక’ చిత్రాన్ని కూడా మీ సినిమాగా భావించి ఆదరిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని దుల్కర్ సల్మాన్ అన్నారు. కల్యాణీ ప్రియదర్శన్ లీడ్ రోల్‌లో, నస్లెన్ కీలక పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘లోక చాప్టర్ 1: చంద్ర’. ఈ మూవీ వారం రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది.
బడ్జెట్ గురించి ఆలోచించలే
డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో ఆగస్టు 29న నిర్మాత సూర్యదేవర నాగవంశీ విడుదల చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్ర విజయోత్సవానికి దర్శకులు నాగ్ అశ్విన్, వెంకీ అట్లూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా బడ్జెట్ తక్కువని మీరు అనుకోవచ్చు. కానీ, మలయాళ పరిశ్రమలో ఈ బడ్జెట్ చాలా ఎక్కువ. అయితే నేను బడ్జెట్ గురించి ఆలోచించలేదు. డైరెక్టర్, డీఓపీ మధ్య బాండింగ్ బాగుంటే మంచి సినిమాలు చేయొచ్చు’’ అని చెప్పారు.
రూ.30 కోట్లు ఎక్కువ
నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘అందరిలాగే నేను కూడా ఈ సినిమా రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా ప్రారంభించినప్పుడు మలయాళంలో రూ.30 కోట్లు అనేది చాలా ఎక్కువ. నిర్మాతగా ధైర్యం చేసిన దుల్కర్ సల్మాన్‌ని అభినందించాలి’’ అన్నారు వెంకీ అట్లూరి. ‘‘ఇలాంటి సూపర్ హీరో సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు నాగవంశీ. కల్యాణీ ప్రియదర్శన్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి, మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని తెలిపారు. ‘‘తెలుగు ప్రేక్షకులు మా సినిమాపై కురిపిస్తున్న ప్రేమకు హ్యాపీగా ఉంది’’ అన్నారు డొమినిక్ అరుణ్.
తండ్రి రియాక్షన్ ఇదే!
ఈ చిత్రాన్ని తమిళనాడులో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ విడుదల చేసింది. గురువారం మధ్యాహ్నం చైన్నెలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ మాట్లాడుతూ.. యాక్షన్ హీరోగా నటించనున్నట్లు తండ్రి ప్రియదర్శన్‌కు చెప్పగా నువ్వా.. యాక్షన్ హీరో పాత్రలోనా! అని ఆశ్చర్యపోయారన్నారు. ఆ తరువాత చెయ్యి, కాళ్లు, చేతులు విరగ్గొట్టుకోకుండా ఉంటే సరి అని అన్నారన్నారు.