డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాం! ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు ట్రెండు మారింది. ఓపక్క యాక్టింగ్ చేస్తూనే మరోపక్క మెడిసిన్ పూర్తి చేస్తున్నారు తారలు. కొందరైతే డాక్టరయ్యాక కూడా యాక్టర్ అవొచ్చని నిరూపిస్తున్నారు. అలాంటివారి జాబితాలోకే వస్తుంది నటి శ్రద్ధా గోకుల్. ఈమె మలయాళ దృశ్యం 3 మూవీలో నర్సుగా కనిపించింది. కానీ నిజ జీవితంలో ఈమె మాత్రం నర్సు కాదు, ఏకంగా వైద్యురాలు.. తనగురించే ఈ ప్రత్యేక కథనం..
చైల్డ్ ఆర్టిస్ట్‌గా..
మలయాళ నటి శ్రద్ధా గోకుల్‌కు సినిమాలు కొత్తేం కావు. చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చింది. 'హలో కుట్టిచేతన్' అనే మలయాళ సీరియల్‌లో వర్ష పాత్రలో కనిపించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అప్పట్లోనే మంచి మార్కులు కొట్టేసింది. ఇది కేవలం పిల్లల కోసమే డిజైన్ చేసిన సీరియల్. ఈ సీరియల్ కంటే ముందు సూపర్ డ్యాన్సర్ జూనియర్ అనే డ్యాన్స్ షోలో పాల్గొంది శ్రద్ధా.
చదువు నిర్లక్ష్యం చేయొద్దని..
సీరియల్స్‌లో క్లిక్ అవడంతో దుల్కర్ సల్మాన్ 'పట్టం పోలే' మలయాళ మూవీలో నటించే ఛాన్స్ చేజిక్కించుకుంది. తర్వాత సినిమా అవకాశాలు రాలేదని కాదు కానీ చదువును నిర్లక్ష్యం చేయొద్దనుకుంది. నటనకు బ్రేక్ ఇచ్చేసి చదువుపైనే దృష్టి సారించింది. ఫిలిప్పీన్స్‌లో మెడిసిన్ పూర్తి చేసింది. అనంతరం కేరళ తిరువనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసింది.
రీఎంట్రీ
తను సినిమాల్లోకి వస్తుందని మళ్లీ ఊహించలేదు. కానీ అనుకోకుండా కొచ్చిలో ఓ ఆడిషన్‌కు వెళ్లింది. అక్కడ సెలక్ట్ అవడంతో జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన 'వళతు వశతె కల్లాన్' మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో చిన్న పాత్రే అయినా బాగా క్లిక్ అయింది. దాంతో జీతూ జోసెఫ్ ఆమెకు దృశ్యం 3లో ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో డాక్టర్ శ్రద్ధా గోకుల్ నర్సుగా కనిపించింది.
యాక్టింగ్, మెడిసిన్.. రెండింటినీ వదిలేయాలని లేదు. డెర్మటాలజీ విభాగంలో పీజీ చేయాలనుంది. దానికోసం ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నాను. అలాగే నాకు డ్యాన్సింగ్, యాక్టింగ్ రెండూ చాలా ఇష్టం. మంచి అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను.
- శ్రద్ధా గోకుల్
చదవండి: కుటుంబమంతా చనిపోవాలనుకున్నాం.. ఒంటిపై కిరోసిన్ పోశా..: శివకుమార్


