34 ఏళ్ల తర్వాత సూపర్‌ హిట్‌ సినిమాకు రీమేక్‌.. | Director Ramanarayanan Son Planning To Remake Sravana Sukravaram Movie, Is Nayanthara To Play Lead Role? - Sakshi
Sakshi News home page

శ్రావణ శుక్రవారం సినిమా గుర్తుందా..? 34 ఏళ్ల తర్వాత..

Published Wed, Feb 7 2024 1:39 PM

Director Ramanarayanan Son Planning to Remake Sravana Sukravaram Movie - Sakshi

దివంగత దర్శకుడు రామనారాయణన్‌ అద్భుత సృష్టి 'ఆడివెళ్లి'. ఈ మూవీలో హీరోయిన్‌ సీత ప్రధాన పాత్రను పోషించింది. 1990లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రావణ శుక్రవారం పేరిట తెలుగులోనూ అనువాదమై ఇక్కడా ఘనవిజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని రామనారాయణన్‌ కుమారుడు, నిర్మాత మురళి రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆడివెళ్లి గ్రామీణ నేపథ్యంలో రూపొందించిన చిత్రం కావడంతో అప్పట్లో అనూహ్య విజయాన్ని సాధించిందన్నారు.

అప్పుడు నాకు తొమ్మిదేళ్లు
ఆ చిత్రం నిర్మాణ సమయంలో తనకు తొమ్మిది సంవత్సరాలని, తండ్రి వెంట షూటింగ్‌కు వెళ్లిన విషయం తనకు ఇప్పటికీ జ్ఞాపకం ఉందని గుర్తు చేసుకున్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రారంభదశలోనే తన తండ్రి దాన్ని చాలా బాగా వాడుకున్నారని చెప్పారు. ఆడివెళ్లి చిత్రాన్ని 90 రోజుల్లో పూర్తి చేశారన్నారు. ఆ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఉత్సవాల్లో మారుమోగుతూ ఉంటాయని పేర్కొన్నారు. ఏనుగు వంటి జంతువులకు ప్రాముఖ్యత కలిగిన ఆ చిత్రాన్ని రీమేక్‌ చేయడం కష్టంతో కూడిన పనేనన్నారు. అయినప్పటికీ ఈ చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

సీత పాత్రలో నయనతార?
దీనికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగిన దర్శకుడు అవసరమని చెప్పారు. ఆ కథను నేటి కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ చిత్రంలో సీత పోషించిన ప్రధాన పాత్రలో నయనతార నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, నిజానికి ఇంతవరకు ఇందులో నటించే నటీనటులను ఎంపిక చేయలేదన్నారు. ఏదేమైనా ఆడివెళ్లి రీమేక్‌లో నయనతార నటించనున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో ఇందులో ఆమె నటిస్తే బాగుంటుందని తామూ భావిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే చిత్ర వివరాలను చెబుతామని నిర్మాత మురళి పేర్కొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement